Skip to main content

విజయవాడలో జాతీయ విద్యా దినోత్సవం

భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సందర్భంగా మైనార్టీ, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ విద్యా, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
విజయవాడలో నవంబర్ 11న జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ మౌలానా.. సుదీర్ఘంగా 1958 వరకు 11 ఏళ్ల పాటు దేశ తొలి విద్యా మంత్రిగా ఎన్నో మంచి పనులు చేశారని, నేడు ఉన్న పలు విద్యా సంస్థలు ఆయన ప్రారంభించినవేనని తెలిపారు. మౌలానా జయంతిని 2008లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2019-20 బడ్జెట్‌లో రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి రూ.952 కోట్లు కేటాయించారు.

మరోవైపు ఉర్దూ భాషలో సేవలు అందించిన వారితో పాటు పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యలో ప్రతిభ చూపిన ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ పురస్కారాలను ప్రదానం చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ అవార్డు కింద లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, సీఎస్ అబ్దుల్ సలాం షహెమేరీకి ప్రదానం చేశారు. అలాగే పదవ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యా పురస్కారాలను సీఎం అందజేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జాతీయ విద్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినోత్సవం
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సందర్భంగా
Published date : 12 Nov 2019 05:46PM

Photo Stories