Skip to main content

వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ ఫస్ట్ : సీపీసీబీ

వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో కోల్‌కతా ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) వెల్లడించింది.
అత్యంత ఎక్కువగా వాయుకాలుష్యం ఉన్న నగరాలు/పట్టణాలను రెడ్ జోన్‌లో, సాధారణ స్థాయిలో వాయు కాలుష్యం ఉన్న నగరాలు/పట్టణాలను గ్రీన్ జోన్ పరిధిలో చేర్చి సీపీసీబీ ఓ జాబితా విడుదల చేసింది. వీటిలో మన భాగ్యనగరం హైదరాబాద్ గ్రీన్ జోన్ లో ఉంది.

ఎలా విస్తరిస్తోంది?
జాతీయ వాయు ప్రమాణాల సూచి ప్రకారం.. 2.5 మైక్రాన్ల పరిమాణంలో 40 మైక్రోగ్రాముల (గాలిలో క్యూబిక్ మీటర్ పరిధిలో ఉన్న దుమ్ముధూళిని మైక్రోగ్రామ్స్‌లో కొలుస్తారు) దుమ్ముకణాలు ఉండాలి. అయితే, హైదరాబాద్‌లో అది 50 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు తేలింది. పది మైక్రాన్ల పరిణామంలో 60 మైక్రోగాములు ఉండాల్సి ఉండగా.. అది హైదరాబాద్‌లో 100 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు వెల్లడైంది. అదే ఢిల్లీలో అయితే అది అత్యంత ప్రమాదకరంగా 700 నుంచి 994 మైక్రోగ్రాములు ఉన్నట్టు గుర్తించారు. ఇక హైదరాబాద్‌లో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ సాధారణ స్థాయి కంటే 4 పాయింట్లు మాత్రమే అధికంగా ఉన్నట్టు తేలింది.

దక్షిణాది నగరాలన్నీ సేఫ్‌జోన్‌లోనే...
హైదరాబాద్ సహా దక్షిణాది నగరాలైన చెన్నై, ముంబై, బెంగళూరు నగరాలు ‘సేఫ్ జోన్’లో ఉన్నాయి. జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాల కంటే కొంచెం అధికంగా మన రాష్ట్రంలో కాలుష్యం ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం ‘స్పెషల్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటుచేసింది.

హైదరాబాద్ ఎందుకు సురక్షితం?
హిమాలయాలు సమీపంలో ఉండడం, విపరీతమైన చలిగాలులు పెరగడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు, కోతల తర్వాత వాటిని తగలబెట్టడం వంటి అంశాలే ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలని గుర్తించారు. ఎత్తైన ప్రాంతంలోని హిమాలయాల నుంచి ధూళి, దుమ్ముకణాలు గాలిలో ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా విపరీతమైన చలి కారణంగా మార్గం మధ్యలోనే నిలిచిపోతాయి. వాటికి పరిశ్రమలు, వాహన కాలుష్యం తోడు కావడంతో విష వాయువులుగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో దీనికి భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉండటంతో ఢిల్లీ స్థాయిలో ఇక్కడ కాలుష్యం విస్తరించే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే ట్రాఫిక్ పెరుగుదల, పరిశ్రమల కాలుష్య ఉద్గారాలు, రోడ్డుపై ధూళి, దుమ్ము విస్తరించడం, తదితర కారణాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ కాలుష్యనియంత్రణ మండలి ఉన్నతాధికారి ఒకరు సాక్షికి వెల్లడించారు.

సీపీసీబీ గణాంకాల ప్రకారం ఏ నగరాలు ఏ జోన్‌లో ఉన్నాయంటే...
రెడ్‌జోన్‌లో...
ఘజియాబాద్, నోయిడా, ఢిల్లీ, ఫరీదాబాద్, భివాని, హిసార్, ఫతేహబాద్, గురుగ్రామ్, లక్నో, బహదుర్‌ఘర్, భటిండా, భీవాండి, హాపూర్, బులంద్‌షహర్, అంబాలా, అమృత్‌సర్, రోహతక్, పటౌడి, కాన్పూర్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు నగరాలు.

గ్రీన్‌జోన్‌లో... హైదరాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, చెన్నై, బెంగళూరు, మైసూరు, కొచ్చి తదితర దక్షిణాది రాష్ట్రాల్లోని నగరాలు.

క్విక్ రివ్యూ:
ఏమిటి: వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానం
ఎందుకు: దేశంలో అత్యంత ఎక్కువగా వాయుకాలుష్యం ఉన్న నగరాలు
ఎక్కడ: ఢిల్లీ
Published date : 13 Nov 2019 06:01PM

Photo Stories