Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 15 కరెంట్‌ అఫైర్స్‌

colonel Viplav Tripathi

Manipur Attack: మణిపూర్‌లో తీవ్రవాదుల ఘాతుకం

సరిహద్దు రాష్ట్రం మణిపూర్‌లో భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు మెరుపుదాడికి దిగారు. నవంబర్‌ 13న జరిగిన ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్‌’కు చెందిన ఖుగా బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి, ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్‌ రివల్యూషనరీ పార్టీ ఆఫ్‌ కాంగ్లీపాక్‌(ప్రెపాక్‌), పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. చురాచాంద్‌పూర్‌ జిల్లాలోని సెఖాన్‌ గ్రామం వద్ద విప్లవ్‌ కుటుంబంతో కాన్వాయ్‌లో వస్తుండగా తీవ్రవాదులు పేలుడు పదార్థాలను(ఐఈడీ) పేల్చారు. కాల్పులు సైతం జరిపారు.

డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ఉక్కుపాదం...
తీవ్రవాదుల దాడిలో మరణించిన కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి(41) గతంలో మిజోరాంలో పనిచేశారు. 2021 జూలైలో బదిలీపై మణిపూర్‌కు వచ్చారు. మిజోరాంలో ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విప్లవ్‌ త్రిపాఠి స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌ లోని రాయ్‌గఢ్‌.

ఏమిటీ పీఎల్‌ఏ? దీన్ని ఎవరు ప్రారంభించారు?

  • పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)ను 1978 సెప్టెంబర్‌ 25న ఎన్‌.బిశ్వేశ్వర్‌ సింగ్‌ ప్రారంభించారు. మణిపూర్‌కు భారతదేశం నుంచి విముక్తి కలిగించి, స్వతంత్ర దేశంగా మార్చడమే తమ సంస్థ ధ్యేయమని ప్రకటించారు. మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలు, మావో ఆలోచనా విధానంపై ఆధారపడి పీఎల్‌ఏ పనిచేస్తోంది. పీఎల్‌ఏకు చైనా ప్రభుత్వం నుంచి అండదండలు లభిస్తున్నాయి.
  • ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర తీవ్రవాద, వేర్పాటువాద సంస్థలతో పీఎల్‌ఏ చేతులు కలిపింది. ఉమ్మడి శత్రువైన భారతదేశాన్ని ఓడించడానికి ఆయా సంస్థలు ఒక్క తాటిపైకి వచ్చాయి. పీఎల్‌ఏ 1989లో రివల్యూషనరీ పీపుల్స్‌ ఫ్రంట్‌(ఆర్‌పీఎఫ్‌) పేరిట ఒక రాజకీయ విభాగాన్ని ప్రారంభించింది. మణిపూర్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌లో పీఎల్‌ఏ భాగస్వామిగా చేరింది.


ICC: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న దివంగత క్రికెటర్‌?

ICC Hall Of Fame 2021

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా ముగ్గురు దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు కల్పించింది. శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ షాన్‌ పొలాక్‌లతో పాటు ఇంగ్లండ్‌ దివంగత మహిళా క్రికెటర్‌ జెనెట్టె బ్రిటిన్‌లు ఈ జాబితాలో ఉన్నారు. దీంతో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చిన క్రికెటర్ల సంఖ్య 106కి చేరింది. జయవర్ధనే సభ్యుడిగా ఉన్న శ్రీలంక జట్టు 2014 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. వన్డే, టెస్టు ఫార్మాట్లలో 3 వేల పరుగులు, 300 వికెట్ల చొప్పున తీసిన తొలి క్రికెటర్‌గా షాన్‌ పొలాక్‌ ఘనతకెక్కాడు. బ్రిటిన్‌ 19 ఏళ్ల (1979–1998) పాటు టెస్టుల్లో ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2017లో మరణించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలో చోటు దక్కించుకున్న క్రికెటర్లు?
ఎప్పుడు : నవంబర్‌ 13
ఎవరు    : శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ షాన్‌ పొలాక్, ఇంగ్లండ్‌ దివంగత మహిళా క్రికెటర్‌ జెనెట్టె బ్రిటిన్‌
ఎందుకు : క్రికెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు... 


Cleanest State: పరిశుభ్రమైన రాష్ట్రాల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం?

Swachhta

దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ వరుసగా మూడో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. 2021, నవంబర్‌ 20వ తేదీన జరిగే స్వచ్ఛ అమృత్‌ మహోత్సవ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అవార్డు అందుకోనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం, దానిని శాస్త్రీయవిధానంలో పారవేయడం, బహిరంగ మల విసర్జన రహిత, వ్యర్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంతోపాటు పౌరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఛత్తీస్‌గఢ్‌ను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 61 నగరాలు స్వచ్ఛత విషయంలో మెరుగైన పని తీరు కనబరిచాయని వివరించారు. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో వరుసగా మూడో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : నవంబర్‌ 14
ఎవరు    : ఛత్తీస్‌గఢ్‌
ఎక్కడ    : దేశంలో...
ఎందుకు : స్వచ్ఛత విషయంలో అత్యుత్తమ పనితీరును కనబరిచినందున... 


Air Defence System: భారత్‌కు ఎస్‌–400 క్షిపణి వ్యవస్థను సరఫరా చేస్తోన్న దేశం?

S-400 Missiles

 ఉపరితలం నుంచి గగన తలంలోని లక్ష్యాలను ఛేదించే ఎస్‌–400 క్షిపణుల సరఫరా ప్రక్రియను రష్యా ప్రారంభించింది. భారత్‌కు ఈ క్షిపణులను అందజేస్తున్నామని నవంబర్‌ 14న రష్యా ఫెడరల్‌ సర్వీస్‌ ఫర్‌ మిలటరీ టెక్నికల్‌ కోపరేషన్‌ డైరెక్టర్‌ దిమిత్రి షుగావ్‌ చెప్పారు. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడంలో ఎస్‌–400 క్షిపణులు భారత్‌కు అండగా నిలవనున్నాయి. మొదటి క్షిపణిని చైనాతో సంక్షోభం నెలకొని ఉన్న లద్దాఖ్‌ సెక్టార్‌లో మెహరించాలని భారత వాయుసేన భావించినట్టు తెలుస్తోంది. చైనా ఇప్పటికే ఎస్‌–400 రెండు క్షిపణుల్ని లద్దాఖ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో మోహరించింది.

ఆకాశంలోకి...
రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్‌–400 ట్రయంఫ్‌ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను (దాదాపు రూ.35 వేల కోట్లను పైగా వెచ్చించి) కొనుగోలు చేయాలని భారత్‌ 2015లో నిర్ణయించింది. ఈ మేరకు 2018లో ఆ దేశంతో భారత్‌ ఒప్పందం చేసుకుంది. ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ వెనుకంజ వేయకుండా మొదటి దఫాగా 800 మిలియన్‌ డాలర్లను చెల్లించింది. 2021 చివరి నాటికి మొత్తం 5 క్షిపణులు భారత్‌కు చేరనున్నాయి. ఇప్పటికే ఈ క్షిపణుల వినియోగంపై భారత వైమానిక దళం అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది.

ఎస్‌–400 ప్రత్యేకతలు..

  • శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 400 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్‌–400 ట్రయంఫ్‌ వాటిని గుర్తించి నాశనం చేయగలదు.
  • ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు.
  • ఎస్‌–300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్‌–400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు.
  • భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు.
  • వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌కు ఎస్‌–400 క్షిపణి వ్యవస్థను అందిస్తోన్న దేశం?
ఎప్పుడు : నవంబర్‌ 14
ఎవరు    : రష్యా 
ఎందుకు : 2018లో రూ.35 వేల కోట్లతో 5 ఎస్‌–400 క్షిపణుల కొనుగోలుకు రష్యాతో భారత్‌ ఒప్పందం చేసుకున్నందున...


Ambulance Services: గోవుల కోసం అంబులెన్స్‌లను అందుబాటులోకి తేనున్న రాష్ట్రం? 

Ambulance Services

దేశంలోనే తొలిసారిగా గోవుల కోసం అంబులెన్స్‌ సేవలను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్‌ల్లో ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందించనున్నట్లు రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి, పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ్‌ చౌదరి తెలిపారు. ఇలాంటి పథకం దేశంలోనే ఇది తొలిసారి అని నవంబర్‌ 14న పేర్కొన్నారు. గోవులకు అంబులెన్స్‌ సేవల పథకాన్ని డిసెంబర్‌లో ప్రారంభిస్తామన్నారు. 515 అంబులెన్స్‌లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్‌ ‘112’కు ఫోన్‌ చేసి, అంబులెన్స్‌ సేవలు పొందవచ్చని సూచించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : దేశంలోనే తొలిసారిగా గోవుల కోసం అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న రాష్ట్రం?
ఎప్పుడు : నవంబర్‌ 14
ఎవరు    : ఉత్తరప్రదేశ్‌  
ఎందుకు : అనారోగ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్‌ల్లో ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందించేందుకు... 


National Cricket Academy: ఎన్‌సీఏ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న క్రికెటర్‌?

VVS Laxman and Ganguly

భారత క్రికెట్‌ జట్టు మాజీ ప్లేయర్, హైదరాబాద్‌ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ త్వరలోనే జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని నవంబర్‌ 14న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వెల్లడించాడు. గతంలో ఈ బాధ్యతల్లో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ ఇటీవలే భారత హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ను ఎన్‌సీఏ చీఫ్‌గా నియమించారు. ఎన్‌సీఏ చీఫ్‌గానే కాకుండా భారత్‌ ‘ఎ’, భారత్‌ అండర్‌–19 జట్లకు కోచ్‌గా కూడా లక్ష్మణ్‌ వ్యవహరించాల్సి ఉంటుంది.

ఫిఫా ప్రపంచకప్‌లో ఎన్ని జట్లు పాల్గొననున్నాయి?
2022 ఏడాది ఖతర్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ జట్టు అర్హత సాధించింది. ఫ్రాన్స్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్‌ బెల్జియం, 2018 ప్రపంచకప్‌ రన్నరప్‌ క్రొయేషియా జట్టు కూడా ఈ మెగా ఈవెంట్‌కు బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. 32 జట్లు పాల్గొనే 2022–ప్రపంచకప్‌ టోర్నీకి ఇప్పటివరకు ఆతిథ్య ఖతర్‌ జట్టుతోపాటు జర్మనీ, డెన్మార్క్, బ్రెజిల్, బెల్జియం, ఫ్రాన్స్, క్రొయేషియా అర్హత పొందాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా బాధ్యతలను చేపట్టనున్న క్రికెటర్‌?
ఎప్పుడు : నవంబర్‌ 14
ఎవరు    : భారత క్రికెట్‌ జట్టు మాజీ ప్లేయర్, హైదరాబాద్‌ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌
ఎందుకు : గతంలో ఈ బాధ్యతల్లో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ ఇటీవలే భారత హెడ్‌ కోచ్‌గా నియమితులైన నేపథ్యంలో...


Ombudsman Scheme: ప్రధాని మోదీ ప్రారంభించిన ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ ఉద్దేశం?

RBI Schemes

రిటైల్‌ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్‌ను మరింత అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన ‘ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌’ ప్రారంభమైంది. అలాగే సెంట్రల్‌ బ్యాంక్‌ రెగ్యులేట్‌ చేస్తున్న సంస్థలపై కస్టమర్ల ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడానికి ఉద్ధేశించిన ‘ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌’ కూడా ప్రారంభమైంది. ఈ రెండు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌ 12న వర్చువల్‌ విధానం ద్వారా ఢిల్లీ నుంచి ఆవిష్కరించారు. సురక్షితమైన వ్యవస్థ ద్వారా క్యాపిటల్‌ మార్కెట్లలో సులువుగా ఇన్వెస్ట్‌ చేయడానికి రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ తోడ్పడగలదని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.

ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌: ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా బ్యాంకులు, బీమా కంపెనీల్లాంటి పెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ బాండ్లను ఇకపై చిన్న స్థాయి రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం ఆర్‌బీఐ వద్ద ఆన్‌లైన్‌ రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ అకౌంట్‌ (ఆర్‌డీజీ ఖాతా) తెరవాల్సి ఉంటుంది.

సమగ్ర అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ 2021: 

  • ఈ పథకం ద్వారా రిజర్వ్‌ బ్యాంక్‌ పరిధిలో పనిచేసే ఆర్థిక సంస్థలు అందించే సేవల్లో లోపాలకు సంబంధించి వివిధ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే చోట(ఒకే అంబుడ్స్‌మన్‌కు) ఫిర్యాదు చేయొచ్చు.
  • ప్రస్తుతం బ్యాంకులు, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్లు వంటి వాటికి వేర్వేరుగా అంబుడ్స్‌మన్‌ ఉంటున్నారు. వీటికి సంబంధించిన బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ 2006, అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ ఫర్‌ నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీస్‌ 2018, అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ ఫర్‌ డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ 2019 అనే 3 స్కీములను కలిపి కొత్తగా సమగ్ర అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ 2021ను రూపొందించారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్, ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ ప్రారంభం
ఎప్పుడు  : నవంబర్‌ 14
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : రిటైల్‌ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్‌ను మరింత అందుబాటులోకి తేవడానికి, సెంట్రల్‌ బ్యాంక్‌ రెగ్యులేట్‌ చేస్తున్న సంస్థలపై కస్టమర్ల ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడానికి... 


Presidential Elections: లిబియా దేశ రాజధాని నగరం పేరు?

Saif al-Islam-Libya

లిబియా నియంత, దివంగత ముఅమ్మర్ అల్‌–గడాఫీ(కల్నల్‌ గడాఫి) కుమారుడు సయీఫ్‌ అల్‌ ఇస్లాం అదేశ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పలు నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సయీఫ్‌ అల్‌ ఇస్లాం 2021, డిసెంబర్‌ 24న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్‌ వేసినట్లు లిబియా ఎన్నికల సంఘం నవంబర్‌ 14న ప్రకటించింది. దాదాపు 40 ఏళ్లపాటు లిబియాను పాలించిన గడాఫీ 2011లో తలెత్తిన తిరుగుబాటులో హతమైన విషయం తెలిసిందే. అనంతరం ఆ దేశం ప్రత్యర్థి వర్గాల హింసాత్మక చర్యలతో అట్టుడుకుతోంది. లిబియా రాజధాని ట్రిపోలీలో ఒక ప్రభుత్వం, తూర్పు ప్రాంతంలో మరో ప్రభుత్వం కొనసాగుతోంది.

లిబియా..
రాజధాని:
ట్రిపోలీ; కరెన్సీ: లిబియన్‌ దినార్‌

ఈక్వెడార్‌ జైల్లో ఘర్షణ..
ఈక్వెడార్‌లోని గుయాక్విల్‌లో ఉన్న జైలులో రెండు ముఠాల మధ్య భీకరస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. నవంబర్‌ 13న జరిగిన ఈ ఘటనలో 68 మంది ఖైదీలు మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు.

ఈక్వెడార్‌..
రాజధాని:
క్విటో; కరెన్సీ: యునైటెడ్‌ స్టేట్స్‌ డాలర్‌

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 13 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 15 Nov 2021 07:23PM

Photo Stories