Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మార్చి 04 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Mar-04

Russia-Ukraine war: రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్‌ నగరం?

Ukraine

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నానాటికీ ఉగ్రరూపు దాలుస్తోంది. దేశంలోని పలు నగరాలపై రష్యా సైన్యం కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడుతోంది. పెద్దపెట్టున బాంబులు, క్షిపణి దాడులతో హడలెత్తిస్తోంది. రాజధాని కీవ్‌పై బాంబుల వర్షమే కురిపిస్తోంది. యుద్ధం మొదలైన 8 రోజుల అనంతరం ఎట్టకేలకు ఒక నగరాన్ని రష్యా ఆక్రమించుకోగలిగింది. 3 లక్షల జనాభా ఉండే కీలకమైన రేవు పట్టణమైన ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు మార్చి 3న రష్యా సైన్యం ప్రకటించింది. స్థానిక పాలనా యంత్రాంగం కూడా దీన్ని ధ్రువీకరించింది. బేషరతుగా లొంగిపోయి రష్యా సైన్యానికి సహకరించాలంటూ ప్రజలకు నగర మేయర్‌ పిలుపునిచ్చారు. మరోవైపు ఉక్రెయిన్‌ నుంచి వలసలు 10 లక్షలు దాటిపోయాయి. దేశ జనాభాలో 2 శాతానికి పైగా ఇప్పటికే సరిహద్దులు దాటారని ఐరాస అంచనా వేసింది.

రెండో దఫా చర్చలు..
రష్యా, ఉక్రెయిన్‌ మధ్య రెండో దఫా చర్చలు బెలారస్‌ సమీపంలో పోలండ్‌ సరిహద్దుల వద్ద మార్చి 3న జరిగాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాలూ తమ డిమాండ్లపై పట్టుబట్టినట్టు సమాచారం. అయితే పౌరులు యుద్ధ క్షేత్రాల నుంచి సురక్షితంగా తరలి వెళ్లేందుకు సహకరించాలని, అందుకు వీలుగా ఆయా చోట్ల తాత్కాలికంగా కాల్పులను విరమించాలని ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. సంక్షభంపై మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించినట్టు రష్యా ప్రతినిధులు తెలిపారు.

దౌత్యమార్గంలో వెళ్లాల్సిందే: ప్రధాని మోదీ
రోజురోజుకూ ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా సేనల దాడుల పరంపర ఎక్కువవుతున్న నేపథ్యంలో సమస్యకు దౌత్యమార్గం ద్వారా పరిష్కారం కనుగొనాలని ప్రధాని మోదీ అభిలషించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాలతో కలసి ప్రధాని మోదీ మార్చి 3న రాత్రి ‘క్వాడ్‌’ సదస్సులో వర్చువల్‌ పద్ధతిలో పాల్గొని ఈ మేరకు ప్రసంగించారు.

Satellite Company: రష్యా ఉపగ్రహాల ప్రయోగాలు నిలిపివేసిన సంస్థ?

OneWeb-Russia

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా ఉపగ్రహాల ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా బ్రిటిష్‌ శాటిలైట్‌ కంపెనీ వన్‌వెబ్‌ వెల్లడించింది. కజికిస్తాన్‌లో ఉన్న రష్యాకు చెందిన బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించే అన్ని ఉపగ్రహ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్టుగా మార్చి 3న వన్‌వెబ్‌ తెలిపింది. మరోవైపు రష్యా తమ దేశ అంతరిక్ష రాకెట్‌ సూయజ్‌ నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్‌ జాతీయ జెండాలను తొలగించింది. భారత్‌ జెండాను మాత్రం అలాగే ఉంచింది. రష్యా అంతరిక్ష ఏజెన్సీ చీఫ్‌ ద్విమిత్రి రోగోజిన్‌ దీనికి సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.

ఇంజన్ల సరఫరాను నిలిపివేత..
మరోవైపు అమెరికాకు రాకెట్‌ ఇంజన్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టుగా రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు అగ్రరాజ్యం ఆర్థిక ఆంక్షలు విధించడంతో దానికి ప్రతిగా రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. 1990 నుంచి ఇప్పటివరకు రష్యా 122ఆర్‌డీ–180 ఇంజన్లను అగ్రరాజ్యానికి పంపిణీ చేసింది.

ఈ శతాబ్దంలోనే అత్యంత వేగవంతమైన వలసలు..
రష్యా దాడుల పర్యవసానంగా ఉక్రెయిన్‌ జనాభాలో 2 శాతం మంది నివాసాలను వదిలిపెట్టి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కేవలం వారం రోజుల్లోనే 10 లక్షల మంది వలసబాటపట్టారని తెలిపింది. ఈ శతాబ్దంలోనే అత్యంత వేగవంతమైన వలసలుగా అభివర్ణించింది.

రష్యా నేరాలపై ఐసీసీలో విచారణ
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడిలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) విచారణ ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న నరమేధంపై విచారణ ప్రారంభించినట్టుగా మార్చి 3న ఐసీసీ ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌ చెప్పారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రష్యా ఉపగ్రహాల ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించిన సంస్థ?
ఎప్పుడు : మార్చి 3
ఎవరు    : బ్రిటిష్‌ శాటిలైట్‌ కంపెనీ వన్‌వెబ్‌  
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో..

Shooting: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు స్వర్ణం

Esha Singh, Shri Nivetha, Ruchira Vinerkar,

ఈజిప్ట్‌ రాజధాని నగరం కైరో వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. మార్చి 3న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్, రుచిత వినేర్కర్, శ్రీ నివేతలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. స్వర్ణ పతక పోరులో భారత బృందం 16–6 పాయింట్ల తేడాతో సాండ్రా, అండ్రియా, కెరీనాలతో కూడిన జర్మనీ జట్టుపై విజయం సాధించింది.

సౌరభ్‌ చౌదరీ ఏ క్రీడ‌లో ప్రసిద్ధి చెందాడు?
ఇప్పటి వరకు ఈ టోర్నీలో 2 స్వర్ణాలు, ఒక రజతం నెగ్గిన భారత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో సౌరభ్‌ చౌదరీ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన విషయం విదితమే. 19 ఏళ్ల సౌరభ్‌కు ప్రపంచకప్‌ టోర్నీలలో ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం. అలాగే మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ రజతం దక్కించుకుంది. ఇక తాజాగా మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌(ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌)లో స్వర్ణం గెలిచిన జట్టు?
ఎప్పుడు : మార్చి 1
ఎవరు    : ఇషా సింగ్, రుచిత వినేర్కర్, శ్రీ నివేతలతో కూడిన భారత జట్టు
ఎక్కడ    : కైరో, ఈజిప్ట్‌
ఎందుకు : మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో భారత జట్టు 16–6 పాయింట్ల తేడాతో సాండ్రా, అండ్రియా, కెరీనాలతో కూడిన జర్మనీ జట్టుపై విజయం సాధించినందున..

Electronics Manufacturing: సాన్మినా కార్పొరేషన్‌తో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ?

Sanmina-Reliance

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) తాజాగా ఎలక్ట్రానిక్‌ తయారీలోకి ప్రవేశించింది. ఇందుకు వీలుగా అనుబంధ సంస్థ రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎస్‌బీవీఎల్‌) ద్వారా సాన్మినా కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంస్థల భాగస్వామ్యంతో ఎలక్ట్రానిక్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి. ప్రధానంగా కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్కింగ్, రక్షణ, ఏరోస్పేస్‌ తదితర హైటెక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హార్డ్‌వేర్‌పై దృష్టిపెట్టనున్నాయి. భాగస్వామ్య సంస్థ(జేవీ)లో ఆర్‌ఎస్‌బీవీఎల్‌ 50.1 శాతం వాటా పొందనుండగా.. సాన్మినాకు 49.9 శాతం వాటా లభించనుంది. సాన్మినాకు దేశీయంగా గల సంస్థలో ఆర్‌ఎస్‌బీవీఎల్‌ రూ. 1,670 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేయనుంది. తద్వారా జేవీలో వాటాను పొందనుంది. మార్చి 3న సాన్మినా కార్పొరేషన్, ఆర్‌ఎస్‌బీవీఎల్‌ సంయుక్తంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ డీల్‌ 2022 సెప్టెంబర్‌కల్లా పూర్తికాగలదని అంచనా.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సాన్మినా కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : మార్చి 3
ఎవరు    : రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎస్‌బీవీఎల్‌) 
ఎందుకు : రెండు సంస్థల భాగస్వామ్యంతో ఎలక్ట్రానిక్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు..

Chess: సీనియర్‌ జాతీయ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ సాధించిన ఆటగాడు?

Arjun Erigaisi

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ వేదికగా జరిగిన 58వ సీనియర్‌ జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌లో మార్చి 3న గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ విజేతగా నిలిచాడు. దీంతో సీనియర్‌ టైటిల్‌ సాధించిన తొలి తెలంగాణ ఆటగాడిగా అర్జున్‌ ఘనత వహించాడు. టైటిల్‌ రేసులో.. 18 ఏళ్ల అర్జున్‌తో పాటు తమిళ గ్రాండ్‌ మాస్టర్లు గుకేశ్, ఇనియన్‌ ఉమ్మడిగా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... చివరకు టైబ్రేక్‌ స్కోరుతో అర్జున్‌ను విజేతగా ఖరారు చేశారు. గుకేశ్, ఇనియన్‌లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి. తెలంగాణ ఆటగాడు అర్జున్‌కి ట్రోఫీతో పాటు రూ. 6 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
58వ సీనియర్‌ జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆటగాడు?
ఎప్పుడు : మార్చి 3
ఎవరు    : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌
ఎక్కడ    : కాన్పూర్, ఉత్తరప్రదేశ్‌
ఎందుకు : 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండటంతోపాటు.. మెరుగైన  టైబ్రేక్‌ స్కోరు కలిగి ఉన్నందున..

Tata IPL 2022: ఐపీఎల్‌ భాగస్వామిగా వ్యవహరించనున్న పేమెంట్‌ నెట్‌వర్క్‌?

Rupay-IPL

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 సీజన్‌కు ‘రూపే’ అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఇది ఒకటికి మించిన సంవత్సరాల భాగస్వామ్యంగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) పేర్కొంది. టాటా ఐపీఎల్‌ 2022 సీజన్‌కు అధికారిక పార్ట్‌నర్‌గా రూపేను ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మార్చి 3న ప్రకటించింది. ఐపీఎల్‌ 2022 సీజన్‌ మార్చి 26 నుంచి మే 29 వరకు జరగనుంది. ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన ‘రూపే నెట్‌వర్క్‌’ ఏకైక దేశీ పేమెంట్‌ నెట్‌వర్క్‌. ఆత్మనిర్భర్‌ కార్యక్రమంలో భాగంగా దీన్ని ఆవిష్కరించారు. ఎన్‌పీసీఐ ప్రధాన కార్యాలయం భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 సీజన్‌కు అధికారిక భాగస్వామిగా వ్యవహరించనున్న పేమెంట్‌ నెట్‌వర్క్‌?
ఎప్పుడు : మార్చి 3
ఎవరు    : ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన రూపే నెట్‌వర్క్‌
ఎందుకు : ఎన్‌పీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు..

Life Insurance Corporation of India: ఎల్‌ఐసీ సీఎఫ్‌వోగా ఎవరు నియమితులయ్యారు?

LIC

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో)గా సునీల్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. సీఎఫ్‌వోగా ఆయన బాధ్యతలను స్వీకరించినట్టు మార్చి 3న ఎల్‌ఐసీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఎల్‌ఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుభాంగి సంజయ్‌ సోమాన్‌ సీఎఫ్‌వో బాధ్యతలు చూశారు. సునీల్‌ అగర్వాల్‌ గతంలో రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలో సీఎఫ్‌వోగా 12 ఏళ్లపాటు పనిచేశారు. అలాగే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు 5 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.

ఫిస్డమ్‌తో యూకో బ్యాంక్‌ జోడీ
ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌ తాజాగా పెట్టుబడి సేవలు అందిస్తున్న ఫిస్డమ్‌తో చేతులు కలిపింది. దీని ప్రకారం డీమ్యాట్‌ ఖాతా, స్టాక్‌ బ్రోకింగ్, పెన్షన్‌ ఫండ్స్, ట్యాక్స్‌ ఫైలింగ్‌ సేవలు మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ అయిన యూకో ఎంబ్యాంకింగ్‌ ప్లస్‌లో అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఫిస్డమ్‌ సేవలు అందిస్తున్న సంస్థల్లో ఇండియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కర్నాటక బ్యాంక్, సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ఉన్నాయి.     
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో)గా ఎవరు నియమితులయ్యారు?
ఎప్పుడు  : మార్చి 3
ఎవరు    : సునీల్‌ అగర్వాల్‌
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర 

Russian invasion of Ukraine: రష్యా సావరిన్‌ రేటింగ్‌ను జంక్‌ గ్రేడ్‌కు తగ్గించిన సంస్థలు? 

Rating Agencies

రష్యా సావరిన్‌ రేటింగ్‌ను అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మూడీస్, ఫిచ్‌.. జంక్‌ గ్రేడ్‌కు తగ్గించాయి. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాల తీవ్ర ఆంక్షలు రేటింగ్‌ కోతకు దారితీశాయి. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు ఒక దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆ దేశానికి సంబంధించి మూడీస్, ఫిచ్, ఎస్‌అండ్‌పీ వంటి సంస్థల రేటింగ్‌ ఏమిటన్నది పరిశీలిస్తాయి. మూడీస్, ఫిచ్‌ తాజా నిర్ణయం పుతిన్‌ ప్రభుత్వం రుణ వ్యయాలను భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి. రుణాలు చెల్లించలేని (డిఫాల్ట్‌ రిస్క్‌) పరిస్థితి ఉత్పన్నం కావచ్చని జంక్‌ కేటగిరీ సూచిస్తుంది.

  • మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌: రష్యా లాంగ్‌ టర్మ్‌ ఇష్యూయెర్‌ అండ్‌ సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ (లోకల్‌–అండ్‌ ఫారిన్‌ కరెన్సీ) డెట్‌ రేటింగ్‌ను ‘బీఏఏ3’ నుంచి ‘బీ3’కి తగ్గించింది.
  • ఫిచ్‌ రేటింగ్స్‌: రష్యా రేటింగ్‌ను ‘బీబీబీ’ నుంచి ‘బీ’కి కుదించింది. దేశాన్ని ‘రేటింగ్‌ వాచ్‌ నెగెటివ్‌’ జాబితాలో పెట్టింది. పలు దేశాల ఆంక్షలు, రూబుల్‌ పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, ఫైనాన్షియల్‌ వ్యవస్థలకు సంబంధించి విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రష్యా సావరిన్‌ రేటింగ్‌ను జంక్‌ గ్రేడ్‌కు తగ్గించిన అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు? 
ఎప్పుడు : మార్చి 3
ఎవరు    : మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్, ఫిచ్‌ రేటింగ్స్‌
ఎందుకు  : ఉక్రెయిన్‌పై రష్యా దాడి సందర్భంగా.. రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు విధించడంతో..

Andhra Pradesh: భోగరాజు సీతారామయ్య మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

Dr. Bhogaraju Pattabhi Sitaramayya

తెలుగు వారి గొప్పదనాన్ని చాటి చెప్పిన ఆంధ్రా బ్యాంక్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఓ మ్యూజియం, అతి పెద్ద కన్వెన్షన్‌ హాలు నిర్మించనుంది. మ్యూజియం ఏర్పాటుకు అవసరమైన ఎకరంన్నర భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో మ్యూజియం, కన్వెన్షన్‌ హాలు నిర్మాణానికి అవసరమైన రూ.40 కోట్లను ఆంధ్రా బ్యాంకును విలీనం చేసుకున్న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరపున ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌రాయ్‌ విరాళంగా ప్రకటించారు. 1923, నవంబర్‌ 23న స్థాపించిన ఆంధ్రా బ్యాంక్‌ను ఇటీవలి కాలంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరున మ్యూజియం, అతి పెద్ద కన్వెన్షన్‌ హాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ    : మచిలీపట్నం, కృష్ణా జిల్లా

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 03 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 04 Mar 2022 06:58PM

Photo Stories