Daily Current Affairs in Telugu: 2022, మార్చి 03 కరెంట్ అఫైర్స్
UN General Assembly: ఉక్రెయిన్‌పై దాడి తీర్మానానికి ఎన్ని దేశాలు అనుకూలంగా ఓటేశాయి?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించింది. మార్చి 2న జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ 76వ ‘అసాధారణ’ సర్వసభ్య సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. ‘ఉక్రెయిన్‌పై దాడి’ పేరుతో రూపొందిన తీర్మానానికి మొత్తం 193 సభ్య దేశాల్లో 141 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఐదు దేశాలు వ్యతిరేకించాయి. ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. దౌత్యం, చర్చలు తప్ప వివాద పరిష్కారానికి మరో మార్గం లేదని భారత్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. మొత్తం 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలిలోనూ ఫిబ్రవరి 28న ఇలాంటి తీర్మానాన్నే ప్రవేశపెట్టగా రష్యా వీటో చేయడం తెలిసిందే. దాంతో మార్చి 2న జనరల్ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రష్యాకు బెలారస్ మద్దతును కూడా ఐరాస తీవ్రంగా తప్పుబట్టింది.
Securities and Exchange Board of India: సెబీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహిళ?
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ– సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్‌గా మాజీ బ్యాంకర్ మాధవీ పురీ బుచ్ మార్చి 2న బాధ్యతలు స్వీకరించారు. సెబీకి ఒక మహిళ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. అలాగే ఈ కీలక బాధ్యతలు చేపట్టిన తొలి నాన్–బ్యూరోక్రాట్ కూడా మాధవీనే. ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న అజయ్ త్యాగి స్థానంలో మాధవీ పురీ నియామకం జరిగింది. అజయ్ త్యాగి ఫిబ్రవరి 28వ తేదీన సెబీ చీఫ్‌గా బాధ్యతలు విరమించారు. సెబీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ..
ఫైనాన్షియల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన 57 ఏళ్ల మాధవీ.. ఐసీఐసీఐ బ్యాంక్‌సహా ప్రయివేట్ రంగంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. సెబీకి ఐదేళ్ల పూర్తికాలపు సభ్యురాలిగా ఆమె పదవీకాలం 2021 అక్టోబర్‌లో ముగిసింది. పూర్తికాలపు సభ్యురాలిగా మాధవి త్యాగితో కలసి 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబర్ 4వరకూ పలు విధులు నిర్వర్తించారు. సెబీ చట్ట ప్రకారం చైర్మన్ పదవికి అభ్యర్ధుల ఎంపికలో గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ పనిచేసేందుకు వీలుంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహిళ?
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : మాజీ బ్యాంకర్ మాధవీ పురీ బుచ్
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : ఇప్పటివరకు సెబీ చీఫ్‌గా ఉన్న అజయ్ త్యాగి తాజాగా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..
NABARD: ప్రస్తుతం నాబార్డ్ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో రుణ ఆవశ్యకత అంచనాలతో నాబార్డ్ రూపొందించిన స్టేట్ ఫోకస్ పత్రాన్ని మార్చి 2న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ఫోకస్ పత్రంలో 2021–22 ఏడాదితో పోలిస్తే పది శాతం పెరుగుదల ఉంది. 2022–23 ఆర్థిక ఏడాదికి రూ.2,54,357.08 కోట్ల రాష్ట్ర వార్షిక రుణ అంచనాగా పేర్కొంది. ఇందులో మొత్తం వ్యవసాయ రంగానికి 1,71,040.98 కోట్ల రుణ ఆవశ్యకత ఉంటుందని నాబార్డ్ అంచనా వేసింది. ప్రస్తుతం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్–NABARD) చైర్మన్‌గా డాక్టర్ చింతల గోవిందరాజులు ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
నాలుగు దేశాలకు ఏపీ అధికారులు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులను త్వరితగతిన క్షేమంగా ఇక్కడికి చేర్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులను సురక్షితంగా తీసుకు రావడానికి ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లొవేకియాలకు రాష్ట్ర ప్రతినిధులను పంపాలని నిర్ణయించింది. హంగేరీకి ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సలహాదారుడు, ఏపీ ఎన్‌ఆర్టీ అధ్యక్షుడు మేడపాటి ఎస్.వెంకట్, పోలండ్‌కు యూరప్ ప్రత్యేక ప్రతినిధి రవీంద్రరెడ్డి, రొమేనియాకు ప్రవాసాంధ్రుల ప్రభుత్వ ఉప సలహాదారుడు చందర్షరెడ్డి, స్లొవేకియాకు నాటా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ను పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
Cricket: మహిళల వన్డే వరల్డ్‌కప్–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
మహిళల వన్డే వరల్డ్‌కప్–2022కు న్యూజిలాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు 6 వేదికల్లో టోర్నీ (మొత్తం 31 మ్యాచ్‌లు) నిర్వహిస్తారు. ఏప్రిల్ 3న క్రైస్ట్‌చర్చ్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలో 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్ అర్హత సాధించగా, ఐసీసీ ర్యాంకింగ్ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికాలకు అవకాశం దక్కింది. మిగిలిన మూడు స్థానాలను క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉండగా... కోవిడ్ ప్రభావంతో ఆ టోర్నీ రద్దయింది. దాంతో మళ్లీ వన్డే ర్యాంకింగ్ ప్రకారమే పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌కు ఐసీసీ అవకాశం కల్పించింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడం ఇదే తొలిసారి.
భారత మహిళల జట్టు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరించనున్నారు?
మహిళల వన్డే వరల్డ్‌కప్–2022లో పాల్గొనే భారత మహిళల జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించనుంది.
భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, జులన్ గోస్వామి, పూజా వస్త్రకర్, మేఘన సింగ్, రేణుక సింగ్ , తానియా, రాజేశ్వరి, పూనమ్ యాదవ్.
ప్రైజ్‌మనీ ఎంతంటే: 2017 కంటే ఈసారి ప్రైజ్‌మనీని రెట్టింపు చేశారు. విజేతకు 13 లక్షల 20 వేల డాలర్లు (రూ. 10 కోట్లు), రన్నరప్ జట్టుకు 6 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 54 లక్షలు), సెమీస్‌లో ఓడిన జట్లకు 3 లక్షల డాలర్ల (రూ. 2 కోట్ల 26 లక్షలు) చొప్పున లభిస్తాయి.
6వ వన్డే వరల్డ్ కప్: మిథాలీ రాజ్‌కు ఇది 6వ వన్డే వరల్డ్ కప్. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా ఆమె నిలవనుంది.
గత రికార్డు: మహిళల వన్డే వరల్డ్‌కప్ 11 సార్లు జరగ్గా్గ... ఆస్ట్రేలియా 6 సార్లు, ఇంగ్లండ్ 4 సార్లు, న్యూజిలాండ్ ఒకసారి విజేతగా నిలిచాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల వన్డే వరల్డ్‌కప్–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
ఎప్పుడు : మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు
ఎవరు : న్యూజిలాండ్
ఎక్కడ : న్యూజిలాండ్‌లోని మొత్తం 6 వేదికల్లో..
Vacuum Bomb: థర్మోబారిక్ బాంబులు ఏ సూత్రం ఆధారంగా విధ్వంసం సృష్టిస్తాయి?
అణ్వాయుధాల తర్వాత అంతటి విధ్వంసాన్ని, ప్రాణనష్టాన్ని సృష్టించగల ఆయుధాలు.. థర్మో బారిక్ బాంబులు. అటు భారీ ఆస్తి నష్టంతో పాటు, ఇటు పెద్ద ఎత్తున జనహననానికి కారణమయ్యే ఈ బాంబులను తమ నగరాలపై రష్యా ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇంతకీ ఏమిటీ బాంబులు? ఎందుకు అంతగా విధ్వంసం సృష్టిస్తాయి? చూద్దాం..
వాక్యూం బాంబ్ అని.. ఏరోసాల్ బాంబ్ అని..
అత్యధిక నష్టాన్ని కలిగించే ఈ థర్మోబారిక్ ఆయుధాల తయారీ 1960లో యూఎస్, సోవియట్ పోటాపోటీగా చేపట్టాయి. అప్పటినుంచి అంచెలంచెలుగా వీటిని అభివృద్ధి చేస్తూ వచ్చాయి. 2007లో రష్యా అతిపెద్ద థర్మోబారిక్ ఆయుధాన్ని పరీక్షించింది. ఈ ఆయుధం 39.9 టన్నుల పేలుడును సృష్టించింది. వీటి తయారీకి ఒక్కో బాంబుకు దాదాపు 1.6 కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతుంది. 2017లో అమెరికా తాలిబన్లపై అఫ్గాన్‌లో ఈ బాంబును ప్రయోగించింది. దీని బరువు 21,600 పౌండ్లు. దీని ప్రయోగంతో దాదాపు వెయ్యి అడుగుల విస్తీర్ణంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. వీటిని వాక్యూం బాంబ్ అని, ఏరోసాల్ బాంబ్ అని, ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్‌ప్లోజివ్ అని వ్యవహరిస్తారు.
ఉక్రెయిన్‌పై ప్రయోగించారా?
ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా టీఓఎస్1 బురాటినో అనే థర్మోబారిక్ రాకెట్ సిస్టమ్‌ను వాడినట్లు కొన్ని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఆయుధాన్ని ఫ్లేమ్ త్రోయర్ అని కూడా వ్యవహరిస్తారు. రష్యా తమపై వాక్యూమ్ బాంబ్‌ను ప్రయోగించిందని ఐరాసలో ఉక్రెయిన్ రాయబారి విలేకరులతో ధ్రువీకరించారు. అయితే రష్యా నిజంగా వీటిని ప్రయోగించిందనేందుకు మరే ఇతర అధికారిక ఆధారాలు ఇంతవరకు లభించలేదు.
ఆవిరి మేఘాల పేలుడు సూత్రం ఆధారంగా..
వాక్యూం బాంబులను పేల్చినప్పుడు పేల్చిన పరిసరాల్లోనుంచి ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన పేలుడును సృష్టిస్తాయి. సాధారణ బాంబు పేలుడు వల్ల ఉద్భవించే పేలుడు తరంగాలతో పోలిస్తే ఈ బాంబుల వల్ల ఉత్పత్తయ్యే పేలుడు తరంగం (బ్లాస్ట్ వేవ్) ఎక్కువకాలం ఉంటుంది. ఈ బాంబులు సృష్టించే అధిక ఉష్ణోగ్రత కారణంగా దీన్ని ప్రయోగించిన ప్రాంతంలోని మానవ శరీరాలు ఆవిరైపోతాయి. ఆవిరి మేఘాల పేలుడు సూత్రం ఆధారంగా ఈ బాంబులు విధ్వంసం సృష్టిస్తాయి.
బాంబుల ప్రయోగ, పేలుడు దశలు ఇలా..
1. థర్మోబారిక్ బాంబులను యుద్ధ ట్యాంకులపై అమర్చే మినీ రాకెట్ లాంచర్ల నుంచి ప్రయోగిస్తారు. ఐదారు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయవచ్చు.
2. లక్ష్యంగా చేసుకున్న ప్రదేశంలో 100 అడుగుల (సుమారు 30 మీటర్ల) ఎత్తున ఈ బాంబులోని ఒక భాగం విడిపోయి, అతితీవ్రంగా మండే లక్షణమున్న ఏరోసాల్ ఇంధనాన్ని విడుదల చేస్తుంది. అది ఆవిర మేఘంలాగా వేగంగా పరిసరాలను చుట్టేస్తుంది.
3. బాంబు మిగిలిన భాగం మరికాస్త దిగువకు ప్రయాణించిన తర్వాత పేలిపోతుంది (బ్లాస్ట్). ఇది తొలిదశలో విడుదలైన ఏరోసాల్ ఇంధనాన్ని మండించడంతోపాటు షాక్‌వేవ్‌ను సృష్టిస్తుంది.
4. ఏరోసాల్ ఇంధనం అంటుకోవడం, పేలుడుతో షాక్‌వేవ్ ఏర్పడడంతో చుట్టుపక్కల ఉన్న గాలి వేగంగా పేలుడువైపు దూసుకొస్తుంది.
5. అలా వచ్చిన గాలిలోని ఆక్సిజన్‌ను వినియోగించుకుని ఏరోసాల్ ఇంధనం ఒక్కసారిగా మండి తీవ్ర ఉష్ణోగ్రతతో, భారీ విస్ఫోటనాన్ని (ఎక్స్‌ప్లోజన్) సృష్టిస్తుంది.
Russia-Ukraine War: అంతర్జాతీయ న్యాయస్థానం ఏ నగరంలో ఉంది?
రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ ఫిర్యాదు చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తక్షణం అడ్డుకోవాలని కోరింది. యుద్ధాన్ని ఆపాలని రష్యాను ఆదేశిస్తూ తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరినట్లు ఫిబ్రవరి 28న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్ రాజధాని ది హేగ్ నగరంలో ఉంది. యుద్ధానికి రష్యా నేతలను బాధ్యులను చేస్తూ వారిపై వ్యక్తిగతంగా క్రిమినల్ ఆరోపణలు మోపి విచారించే పరిధి కోర్టుకు లేదు. దేశాల మధ్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన వంటి న్యాయపరమైన ఆరోపణలను ఇది పరిష్కరిస్తుంటుంది. ఐరాసకు సంబంధించి ఇదే అత్యుత్తమ న్యాయ సంస్థ.
రక్షణకు 113 బిలియన్ డాలర్లు కేటాయించిన జర్మనీ
రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల కోసం ఏకంగా 113 బిలియన్ డాలర్లు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ఫిబ్రవరి 28న చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ప్రకటించారు. తాజా ప్రకటనతో రక్షణపై పెట్టుబడులు దేశ జీడీపీలో 2 శాతాన్ని మించాయి. ఉక్రెయిన్‌కు సాయంగా 500 స్టింగర్ మిసైళ్లు, 1,000 యాంటీ ట్యాంక్ వెపన్స్, ఇతర ఆయుధాలు, సామగ్రిని పంపుతున్నట్టు ఫిబ్రవరి 27న జర్మనీ ప్రకటించడం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఉక్రెయిన్
ఎక్కడ : ది హేగ్, నెదర్లాండ్స్
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తక్షణం అడ్డుకోవాలని..
ABDM: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రధాన ఉద్దేశం?
పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడీ కార్డును జారీ చేసేందుకు ఉద్దేశించిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎమ్)’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) ఆధ్వర్యంలో రూ.1,600 కోట్లతో వచ్చే అయిదేళ్లలో ఇది పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 26న ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన లద్దాఖ్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, దామన్, డయ్యూ పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లలో చేపట్టిన ఏబీడీఎం పైలట్ ప్రాజెక్టులు విజయవంతమయ్యాయని తెలిపింది.
ఏబీడీఎమ్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
ఏబీడీఎమ్‌కు 2021, సెప్టెంబర్ 27న ఢిల్లీలో వర్చువల్ విధానం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
డిజిటల్ హెల్త్ ఐడీ కార్డుతో ప్రయోజనాలు..
ఆరోగ్య చరిత్ర నిక్షిప్తం: వ్యక్తి ఆధార్ కార్డు లేదా మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 14 అంకెలు ఉండే డిజిటల్ హెల్త్ ఐడెంటిఫికేషన్(ఐడీ) నంబర్ కేటాయిస్తారు. ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, గత మెడికల్ రిపోర్టులు, కుటుంబ వివరాలు, ఉండే ప్రాంతం, చిరునామా తదితరాలను తీసుకుంటారు. కార్డులో పౌరుల ఆరోగ్య చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది. వ్యక్తికి హఠాత్తుగా ఆరోగ్య సమస్య ఎదురైతే తోడుగా ఆస్పత్రికి హెల్త్ కార్డు తీసుకెళ్తే హెల్త్ హిస్టరీ సాయంతో సరైన చికిత్స సకాలంలో పొందే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. దీంతో వేరే ప్రాంతాల, వేరే రాష్ట్రాల పౌరులకూ చికిత్స చేయడం అక్కడి వైద్యులకు సులభం అవుతుంది.
యాప్‌తో అనుసంధానం: డిజిటల్ హెల్త్ ఐడీ(ఖాతా) వివరాలను ఒక మొబైల్ అప్లికేషన్‌తో అనుసంధానిస్తారు. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ, హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీస్‌గా దీనిని పిలుస్తారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఏ) తరహాలో యూనిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్(యూహెచ్‌ఐ)ను ఈ వ్యవస్థలో వాడనున్నారు. వైద్యులు, వైద్యశాలలు, డయాగ్నస్టిక్ ల్యాబ్, ఫార్మసీలు యూహెచ్‌ఐ ద్వారా రోగుల గత రిపోర్ట్‌లను తీసుకుంటాయి. తద్వారా సత్వర వైద్య సేవలు అందిస్తాయి.
టెలీ మెడిసిన్ వ్యవస్థ విస్తరణ: దేశంలో ఎంత మంది ఏ విధమైన వ్యాధులతో బాధపడుతున్నారో తెలిస్తే.. ప్రభుత్వం సైతం తగు విధంగా విధానపర ‘ఆరోగ్య’ నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టెలీ మెడిసన్ వంటి సదుపాయాలు ఈ హెల్త్ కార్డు ద్వారా సులభంగా పొందొచ్చు. దీంతో టెలీ మెడిసిన్ వ్యవస్థ మరింతగా విస్తరించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎమ్)కు అమలుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశవ్యాప్తంగా..
ఎందుకు : పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడీ కార్డును జారీ చేసేందుకు..
FM Nirmala Sitharaman: ఈ–బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
బడ్జెట్‌లో ప్రతిపాదించిన కొత్త ఎలక్ట్రానిక్ బిల్ (ఈ–బిల్) ప్రాసెసింగ్ సిస్టమ్ మార్చి 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా ఎనిమిది శాఖలతో మొదలుపెట్టిన ఈ విధానాన్ని 2022–23లో అన్ని శాఖలు, విభాగాల్లో దశలవారీగా అమల్లోకి తేనున్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన 46వ సివిల్ అకౌంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ–బిల్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సరఫరాదారులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులను పారదర్శకంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడగలదని తెలిపారు. కాంట్రాక్టరు లేదా సరఫరాదారు తమ క్లెయిమ్‌లను నేరుగా డిజిటల్ విధానంలో దాఖలు చేయొచ్చని చెప్పారు.
చెస్ ఒలింపియాడ్ ఆతిథ్యానికి భారత్ బిడ్
అఖిల భారత చెస్ సమాఖ్య 2022 ఏడాది చెస్ ఒలింపియాడ్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్ వేయనుంది. ఇందులో భాగంగా గ్యారంటీ మనీ కోటి డాలర్లను (రూ. 74 కోట్లు) అంతర్జాతీయ చెస్ సమాఖ్యకు డిపాజిట్ చేసింది. వాస్తవానికి ఈ చెస్ మెగా టోర్నీ 2022, జూలై 26 నుంచి ఆగస్టు 8 వరకు రష్యాలో జరగాల్సింది. అయితే ఆ దేశం ఉక్రెయిన్‌పై అకారణంగా యుద్ధం చేస్తుండటంతో అక్కడ ఈవెంట్‌ను రద్దు చేసి తాజాగా బిడ్‌లను ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నూతన ఎలక్ట్రానిక్ బిల్ (ఈ–బిల్) ప్రాసెసింగ్ సిస్టమ్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి.. సరఫరాదారులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులను పారదర్శకంగా నిర్వహించేందుకు..
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, మార్చి 2 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్