Daily Current Affairs in Telugu: 2022, మార్చి 2 కరెంట్ అఫైర్స్
Shooting: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో రజతం గెలిచిన భారతీయురాలు?
సీనియర్ విభాగంలో తొలిసారి ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్(ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్)లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్‌కు రజత పతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 17 ఏళ్ల ఇషా సింగ్ రజత పతకం కైవసం చేసుకుంది. మార్చి 1న ఈజిప్ట్ రాజధాని నగరం కైరో వేదికగా జరిగిన ఫైనల్లో ఇషా 4–16 పాయింట్ల తేడాతో ‘రియో ఒలింపిక్స్’ స్వర్ణ పతక విజేత అనా కొరాకాకి (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ భాగంలో సౌరభ్ చౌదరీ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో సౌరభ్ 16–6తో మైకేల్ ష్వాల్డ్ (జర్మనీ)పై గెలిచాడు. 19 ఏళ్ల సౌరభ్‌కు ప్రపంచకప్ టోర్నీలలో ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్(ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్)లో రజత పతకం గెలిచిన షూటర్?
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్
ఎక్కడ : కైరో, ఈజిప్ట్
ఎందుకు : మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో ఇషా 4–16 పాయింట్ల తేడాతో ‘రియో ఒలింపిక్స్’ స్వర్ణ పతక విజేత అనా కొరాకాకి (గ్రీస్) చేతిలో ఓడిపోయినందున..
The Wealth Report - 2022: ఎన్ని డాలర్లు కలిగిన వారిని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలుగా పరిగణిస్తారు?
Knight Frank's The Wealth Report - 2022: భారత్‌లో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐ (అధిక విలువ కలిగిన వ్యక్తులు)ల సంఖ్య 2021లో 11 శాతం పెరిగి 13,637కు చేరుకుంది. 2021 ఏడాది ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం, డిజిటల్ విప్లవం హెచ్‌ఎన్‌ఐల వృద్ధికి తోడ్పడింది. 2021లో బిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. 748 బిలియనీర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉంటే, 554 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. భారత్‌లో 145 మంది బిలియనీర్లు ఉన్నారు. మార్చి 1న విడుదల చేసిన ‘ద వెల్త్ రిపోర్ట్ 2022’లో ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఈ విషయాలను వెల్లడించింది. 30 మిలియన్ డాలర్లు (రూ.225 కోట్లు) అంతకంటే ఎక్కువ కలిగిన వారిని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలుగా పరిగణిస్తారు.
ద వెల్త్ రిపోర్ట్ 2022లోని ముఖ్యాంశాలు..
- 2021లో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య అంతర్జాతీయంగా 9.3 శాతం పెరిగి 6,10,569కు చేరింది. అంతకుముందు సంవత్సరంలో వీరి సంఖ్య 5,58,828.
- భారత్‌లో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 2020 చివరికి 12,287గా ఉంటే, 2021 చివరికి 13,637కు పెరిగింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే వృద్ధి ఎక్కువగా నమోదైంది.
- భారత్‌లోని నగరాల్లో.. బెంగళూరు నగరంలో వీరి సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంది. 2021 ఏడాది ఈ నగరంలో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 17 శాతం వృద్ధి చెంది 352గా ఉంది. బెంగళూరు తర్వాత ఢిల్లీలో 12.4 శాతం పెరిగి 210కి, ముంబైలో 9 శాతం పెరిగి 1,596కు అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య చేరింది.
- భారత్‌లోని సంపన్నుల్లో 69 శాతం మంది సంపద 2022లో 10 శాతం పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ అంచనా.
- ఆసియా బిలియనీర్ల క్లబ్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి ఉన్న బిలియనీర్లలో 36 శాతం మంది ఆసియాలోనే ఉన్నారు.
- అంతర్జాతీయంగా 1,35,192 అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు తాము సొంతంగా సంపాదించి ఈ స్థితికి చేరినవారు. వీరిలో 40 ఏళ్లలోపు వారు 20 శాతంగా ఉన్నారు.
- ఇలా స్వయంగా పైకి ఎదిగిన అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల వృద్ధి విషయంలో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది.
- వచ్చే ఐదేళ్లలో అంతర్జాతీయంగా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 28 శాతం పెరుగుతుందని అంచనా. అలాగే భారత్‌లో 2021–2026 మధ్య అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 39 శాతం పెరిగి 19,006కు చేరుకోవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధిక మంతి బిలియనీర్లు కలిగిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ద వెల్త్ రిపోర్ట్ 2022
ఎక్కడ : ప్రపంచంలో..
Vice President Venkaiah Naidu: కథాసూక్తమ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
గుంటూరు జిల్లా, ఆత్మకూరులో రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి 1న జరిగిన గురు సన్మానం, 2020–2021 విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా ప్రతి రాష్ట్రమూ కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అనంతరం ప్రముఖ రచయిత వేదాంతం శరశ్చంద్రబాబు రచించిన నీతి కథల సమాహారం ‘కథాసూక్తమ్’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు.
ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఎవరు ఉన్నారు?
దేశంలోని చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంపులో భాగంగా మరిన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌పీవో) ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో సీఐఐ–ఎన్‌సీడీఈఎక్స్ ఎఫ్‌పీవో సమ్మిట్ నిర్వహించిన సదస్సులో మంత్రి ఈ విషయం వెల్లడించారు రూ.6,865 కోట్ల పెట్టుబడితో 10వేల ఎఫ్‌పీవోల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. ఇవి పనిచేయడం ప్రారంభిస్తే క్లస్టర్ ఆధారంగా ఒక్కో జిల్లా ఒక్కో వ్యవసాయ ఉత్పత్తిలో ప్రత్యేకత సాధిస్తుందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ రచయిత వేదాంతం శరశ్చంద్రబాబు రచించిన నీతి కథల సమాహారం ‘కథాసూక్తమ్’ అనే పుస్తకావిష్కరణ
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఆత్మకూరు, గుంటూరు జిల్లా
Russia-Ukraine War: యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) సమావేశం సందర్భంగా రష్యాకు పరాభవం ఎదురైంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రసంగం సమయంలో సభ్యదేశాల ప్రతినిధులు మూకుమ్మడిగా వాకౌట్ చేశారు. మార్చి 1న జరిగిన కౌన్సిల్ 49వ సమావేశంలో రికార్డు చేసిన సెర్గీ లావ్రోవ్ ప్రసంగం వస్తుండగానే మెజారిటీ సభ్య దేశాల ప్రతినిధులు వాకౌట్ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు వారంతా నిరసన తెలిపారు. యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యాలయం స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో ఉంది. ప్రస్తుతం దీని ప్రెసిడెంట్‌గా ఫెడెరికో విల్లెగాస్ బెల్ట్రాన్ ఉన్నారు.
ఉక్రెయిన్ నగరాలపై భారీ దాడులు
ఉక్రెయిన్‌లో రష్యా సేనల విధ్వంసం మార్చి 1న పతాక స్థాయికి చేరింది. నగరాలన్నింటిపైనా భారీ దాడులకు దిగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, దేశంలో రెండో పెద్ద నగరమైన ఖర్కీవ్ స్వాధీనమే లక్ష్యంగా రష్యా దళాలు భారీగా కాల్పులు, బాంబు, క్షిపణి దాడులకు దిగాయి. వీటితోపాటు మారిపోల్, సమీ, ఖెర్సాన్ తదితర నగరాలన్నింటిపైనా రష్యా దళాలు భీకరంగా విరుచుకుపడుతున్నాయి.
ఉక్రెయిన్‌లో భారత వైద్య విద్యార్థి మృతి
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయుడొకరు చనిపోయారు. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా చలగేరికి చెందిన నవీన్ శేఖరప్ప గ్యాన్ గౌడర్ ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో ఉంటూ మెడిసిన్ ఫైనలియర్ చదువుకుంటున్నారు. ఖర్కీవ్ నగరంపై రష్యా సైన్యం జరుపుతున్న దాడుల్లో మార్చి 1న నవీన్ చనిపోయినట్లు భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.
ఐరాసలో రష్యా దౌత్యాధికారుల బహిష్కరణ
ఐక్యరాజ్యసమితిలో రష్యాకు చెందిన 12 మంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. వీరంతా గూఢచర్య కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని ఆరోపించింది. అమెరికాది రెచ్చగొట్టే చర్యన్న రష్యా, ఐరాసకు కేంద్రకార్యాలయం ఉన్న దేశంగా అమెరికా ఈ విధంగా చేయడం ఐరాస నిబద్ధతకు వ్యతిరేకమని విమర్శించింది.
రష్యన్ చానల్స్‌పై నెట్‌ఫ్లిక్స్ నిషేధం
రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏవీ తాము ప్రసారం చేయడం లేదని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన వారం తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే యూ ట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ రష్యా ప్రభుత్వ చానల్స్‌పై నిషేధం విధించాయి.
Andhra Pradesh: జగనన్న తోడు మూడో విడత కింద ఎంత మొత్తాన్ని విడుదల చేశారు?
జగనన్న తోడు పథకం మూడో విడత కింద.. 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 28న తన క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కోవిడ్ అవస్థల నుంచి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేలా రెండున్నరేళ్లలో దాదాపు రూ.1.29 లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపారు.
జగనన్న తోడు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తొలుత 2020, నవంబర్ 25న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులతో పాటు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, బొబ్బిలి వీణ, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు. అధిక వడ్డీ రేట్లతో ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారులకు సహాయం చేయడమే జగనన్న తోడు పథకం ముఖ్య లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులు ఉంటారని అంచనా.
రుణం తీర్చిన వారికి మళ్లీ రుణం..
జగనన్న తోడు పథకం కింద రుణం తీసుకొని... ఆ రుణం మొత్తాన్ని వడ్డీతో సహా సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తే, ఆ వడ్డీని లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా జమ చేస్తుంది. ప్రభుత్వం ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. రుణం మొత్తం తీర్చిన వారికి బ్యాంకులు మళ్లీ రుణాలు మంజూరు చేస్తాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అర్హులకు రుణాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జగనన్న తోడు పథకం మూడో విడత కింద.. 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లు విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు..
Telangana: రాష్ట్ర నూతన పీసీసీఎఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)గా, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్‌వోఎఫ్‌ఎఫ్)గా సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీఎఫ్ ఆర్.శోభ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎం డోబ్రియల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డోబ్రియల్ సోషల్ ఫారెస్ట్రీ పీసీసీఎఫ్ గా, హరితహారం రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన డోబ్రియల్ 1987లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చేరారు. శిక్షణ తర్వాత 1989లో పాల్వంచ సబ్ డీఎఫ్‌ఓగా మొదటి పోస్టింగ్ పొందారు. తర్వాతి కాలంలో భద్రాచలం, వరంగల్, బెల్లంపల్లి డివిజన్లలో ఫారెస్ట్ అధికారిగా పనిచేశారు. కన్జర్వేటర్‌గా పదోన్నతి పొందాక అదనపు కార్యదర్శి హోదాలో సచివాలయంలో వ్యవసాయ శాఖ, ఉన్నత విద్యాశాఖల్లో డిప్యుటేషన్ పై పనిచేశారు. అనంతరం స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా వివిధ యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు.
హరితహారం నోడల్ ఆఫీసర్‌గా..
తెలంగాణ ఏర్పడ్డాక 2015లో అదనపు పీసీసీఎఫ్ హోదాలో తిరిగి అటవీ శాఖలో చేరిన రాకేశ్ మోహన్ విజిలెన్స్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ విధులు నిర్వహించారు. 2016 నుంచి హరితహారం నోడల్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. 2020లో పీసీసీఎఫ్ ర్యాంకు పొందారు. 2025 ఏప్రిల్ వరకు ఆయన సర్వీసులో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)గా నియమితులైన అధికారి?
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్
ఎందుకు : ఇప్పటివరకు రాష్ట్ర పీసీసీఎఫ్‌గా ఉన్న ఆర్.శోభ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..
Healthcare Industry: వయాట్రిస్ బయోసిమిలర్స్‌ను కైవసం చేసుకున్న సంస్థ?
ఔషధాలు, ఆరోగ్య సేవల రంగంలో భారీ డీల్‌కు బయోకాన్ బయోలాజిక్స్ తెరలేపింది. యూఎస్‌కు చెందిన హెల్త్‌కేర్ కంపెనీ వయాట్రిస్ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బయోకాన్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ.25,140 కోట్లు. ఇందులో నగదుతోపాటు బయోకాన్ బయోలాజిక్స్‌కు చెందిన రూ.7,550 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్‌ను వయాట్రిస్‌కు జారీ చేస్తారు. కంపెనీలో ఇది 12.9 శాతం ఈక్విటీకి సమానం. రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డు ఈ లావాదేవీని ఆమోదించింది. 2022 జూలై–డిసెంబర్ మధ్య డీల్ పూర్తి కానుంది.
తాజా ఒప్పందంలో భాగంగా వయాట్రిస్ అంతర్జాతీయ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని బయోకాన్ బయోలాజిక్స్ దక్కించుకుంటుంది. దానితో పాటు లైసెన్స్ పొందిన బయోసిమిలర్స్ ఆస్తుల పోర్ట్‌ఫోలియో కూడా చేజిక్కించుకుంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎస్‌కు చెందిన హెల్త్‌కేర్ కంపెనీ వయాట్రిస్ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయనున్న సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : బయోకాన్ బయోలాజిక్స్
ఎందుకు : వయాట్రిస్ బయోసిమిలర్స్, బయోకాన్ బయోలాజిక్స్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు..
Telangana: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు?
తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ హోదాలో ఆమె రెండేళ్లపాటు కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల అటవీశాఖల్లో ఇలాంటి నియామకం ఇదే తొలిసారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
మూడవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది?
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) చైర్మన్‌గా హస్ముఖ్ ఆధియా తిరిగి నామినేట్ అయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బీఓబీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగి నియమించాలన్న ఆర్థిక సేవల శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ వ్యవహారాల కేంద్ర కమిటీ ఆమోదముద్ర వేసింది. దీనితో ఆయన పదవీకాలం 2022, మార్చి 1వ తేదీ నుంచి మరో రెండేళ్లు కొనసాగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాత మూడవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా బీఓబీ ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమితులైన అధికారి?
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఐఎఫ్‌ఎస్ అధికారి ఆర్.శోభ
ఎందుకు : తాజాగా తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) హోదాలో పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, మార్చి 1 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్