Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మార్చి 1 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Mar-1

Russia-Ukraine War: రష్యా–ఉక్రెయిన్‌ మధ్య చర్చలు జరిగిన ప్రాంతం?

Russia-Ukraine Talks

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఫిబ్రవరి 28న జరిగిన రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఇరు దేశాల అధికారులు బెలారస్‌ సరిహద్దులోని గోమెల్‌లో సమావేశమై తాజా సంక్షోభంపై చర్చించారు.. అయితే చర్చల్లో కీలక నిర్ణయాలేమీ జరగలేదు. మరోమారు సమావేశం కావాలని ఇరుపక్షాలు అంగీకరించాయని రష్యాకు చెందిన స్పుత్నిక్‌ మీడియా తెలిపింది. తమ దేశంతో పాటు క్రిమియా, డాన్‌బాస్‌ ప్రాంతాల నుంచి బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రష్యాను ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేసిందని తెలిపింది. చర్చలు రెండో దఫా చర్చలు పోలాండ్‌– బెలారస్‌ సరిహద్దుల్లో త్వరలో జరిగే అవకాశం ఉంది.

ఉక్రెయిన్‌ వలసలు 5 లక్షలు: ఐరాస 
రష్యా ఆక్రమణతో ఉక్రెయిన్‌ నుంచి ప్రజలు భారీగా వలస బాట పట్టారు. దేశం వీడి వెళ్లే వారితో సరిహద్దు పాయింట్లు రద్దీగా మారాయి. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్‌ నుంచి 5లక్షల మందికి పైగా ప్రజలు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి వలసల విభాగం(యూఎన్‌హెచ్‌సీఆర్‌) హై కమిషనర్‌ ఫిలిపో గ్రాండి చెప్పారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రష్యా–ఉక్రెయిన్‌ మధ్య చర్చలు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు    : రష్యా, ఉక్రెయిన్‌ దేశాల అధికారులు
ఎక్కడ    : గోమెల్, బెలారస్‌
ఎందుకు : రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ సక్షోభంపై చర్చించేందుకు..

Russia-Ukraine War: ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా విమానం ఏది?

Antonov-An-225-Mriya

ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా విమానంగా పేరొందిన ‘‘ఆంటోనోవ్‌ ఏఎన్‌–225 లేదా మ్రియా(స్వప్నం)’’ను రష్యా సైనికులు నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలోని హోస్టోమెల్‌ ఎయిర్‌బేస్‌లో మరమ్మతు కోసం నిలిపి ఉంచిన మ్రియాపై రష్యా జవాన్లు దాడికి పాల్పడ్డారని, విమానం చాలావరకు ధ్వంసమైందని ఉక్రెయిన్‌ అధికారులు ఫిబ్రవరి 28న ప్రకటించారు. బాహుబలి లాంటి మ్రియాను మళ్లీ నిర్మించుకుంటామని వెల్లడించారు.

ఏమిటీ మ్రియా?   

  • మ్రియా అని ముద్దుగా పిలుచుకునే ఆంటోనోవ్‌ ఏఎన్‌–225 విమానం వెడల్పు 290 అడుగులు. పొడవు 275 అడుగులు. ఎత్తు 59 అడుగులు.  
  • 1980వ దశకంలో సోవియట్‌ యూనియన్‌ హయాంలో కీవ్‌కు చెందిన ఆంటోనోవ్‌ కంపెనీ నిర్మించింది. 
  • అమెరికా, సోవియట్‌ యూనియన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అప్పటి అవసరాల కోసం ఈ విమానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 
  • సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత సరుకు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. ఇతర దేశాలు సైతం ప్రకృతి విపత్తుల సమయంలో మ్రియాను ఉపయోగించుకుంటున్నాయి. 
  • కొన్ని నెలల క్రితం కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో మ్రియా విమానంలో ఔషధాలు, వైద్య పరికరాలను చేరవేశారు. 1988 నుంచి నిరంతరాయంగా సేవలందిస్తూనే ఉంది.
  • వైమానిక రంగంలో ఉక్రెయిన్‌ శక్తిసామర్థ్యాలకు మ్రియాను ఒక ప్రతీకగా భావిస్తుంటారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా విమానంగా పేరొందిన ‘‘ఆంటోనోవ్‌ ఏఎన్‌–225 లేదా మ్రియాపై దాడి 
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు    : రష్యా సైనికులు
ఎక్కడ    : కీవ్, ఉక్రెయిన్‌
ఎందుకు : రష్యాపై ఉక్రెయిన్‌ దాడి నేపథ్యంలో..

European Union: ఈయూలో తమకు సభ్యత్వమివ్వాలని విజ్ఞప్తి చేసిన దేశం?

ukraine flag

యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో తక్షణమే తమకు సభ్యత్వమివ్వాలని ఉక్రెయిన్‌ విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక విధానంతో కూటమిలో తమకు వెంటనే చోటు కల్పించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫిబ్రవరి 28న ఈయూను కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. యూరోపియన్లతో కలిసి ఉండడమే తమ లక్ష్యమని, ముఖ్యంగా సమానత్వ సాధన అవసరమని చెప్పారు. రష్యా దాడిలో ఉక్రెయిన్‌ పిల్లలు 16 మంది చనిపోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ ప్రతిదాడిలో దాదాపు 4,500 మంది రష్యా సైనికులు మరణించారన్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌ మధ్య భారీ యుధ్దం జరుగుతున్న విషయం విదితమే.

యుద్ధ రంగంలోకి మాజీ ‘మిస్‌ ఉక్రెయిన్‌’
తమ దేశంపై దండెత్తిన రష్యా దళాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ ప్రజలు వీరోచిత పోరాటం సాగిస్తున్నారు. ఉక్రెయిన్‌ సైన్యానికి తోడుగా వేలాది మంది ఆయుధాలు ధరించి, రణభూమిలోకి ప్రవేశిస్తున్నారు. ప్రముఖ మోడల్, మాజీ ‘మిస్‌ ఉక్రెయిన్‌’ అనస్టాసియా లెన్నా కూడా ఆయుధం చేబూనారు.

ఈయూలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య? చెక్‌ రిపబ్లిక్‌ దేశ రాజధాని?
ఐరోపా దేశాల సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలిగిన తర్వాత.... ఈయూలో 27 దేశాలు సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈయూ దేశాల ఉమ్మడి కరెన్సీ: యూరో

ఈయూలోని27 సభ్య దేశాలు...

సంఖ్య

దేశం

రాజధాని

1

ఆస్ట్రియా

వియన్నా

2

బెల్జియం

బ్ర‌స్సెల్స్

3

బల్గేరియా

సోఫియా

4

క్రొయేషియా

జాగ్రెబ్

5

సైప్రస్

నికోసియా

6

చెక్ రిపబ్లిక్

ప్రాగ్

7

డెన్మార్క్

కోపెన్‌హాగన్

8

ఎస్టోనియా

తల్లిన్‌‌న

9

ఫిన్లాండ్

హెల్సింకీ

10

ఫ్రాన్స్

పారిస్

11

జర్మనీ

బెర్లిన్

12

గ్రీస్

ఏథెన్స్

13

హంగేరి

బుడాపెస్ట్

14

ఐర్లాండ్

డబ్లిన్

15

ఇటలీ

రోమ్

16

లాట్వియా

రీగా

17

లిథువేనియా

విల్నియస్

18

లక్సెంబర్గ్

లక్సెంబర్గ్ సిటీ

19

మాల్టా

వలెట్టా

20

నెదర్లాండ్స్

ఆమ్‌స్టర్‌డ్యామ్

21

పోలాండ్

వార్సా

22

పోర్చుగల్

లిస్బన్

23

రొమానియా

బుకారెస్ట్

24

స్లొవేకియా

బ్రాటిస్లావా

25

స్లొవేనియా

ల్యుబ్‌ల్యానా

26

స్పెయిన్

మాడ్రిడ్

27

స్వీడన్

స్టాక్‌హోమ్

 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో తమకు సభ్యత్వమివ్వాలని విజ్ఞప్తి చేసిన దేశాధ్యక్షుడు?
ఎప్పుడు    : ఫిబ్రవరి 28
ఎవరు    : ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 
ఎందుకు    : యూరోపియన్లతో కలిసి ఉండడమే తమ లక్ష్యమని, ముఖ్యంగా సమానత్వ సాధన అవసరమని..

Tennis: ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకున్న ఆటగాడు?

Daniil Medvedev

అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ఫిబ్రవరి 28న ప్రకటించిన ప్రపంచ తాజా ర్యాంకింగ్స్‌లో రష్యా టెన్నిస్‌ స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ నంబర్‌వన్‌ స్థానాన్ని అధిరోహించాడు. 2020 ఫిబ్రవరి నుంచి టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్న సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ను రెండో స్థానానికి నెట్టేసి మెద్వెదెవ్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2022 ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్‌ 8,615 పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. జొకోవిచ్‌ 8,465 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు.

27వ ప్లేయర్‌..

  • 1996, ఫిబ్రవరి 11న మాస్కోలో జన్మించిన మెద్వెదెవ్‌ 2014లో ప్రొఫెషనల్‌గా మారాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదెవ్‌ 2016 నవంబర్‌లో తొలిసారి టాప్‌–100లోకి వచ్చాడు. అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆరేళ్ల వ్యవధిలో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు.
  • ఇప్పటివరకు మెద్వెదెవ్‌ మొత్తం 13 సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించాడు. ఇందులో ఒక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (యూఎస్‌ ఓపెన్‌–2021), నాలుగు మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్, సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్‌ (2020) ఉన్నాయి.
  • 1973 ఆగస్టులో ఏటీపీ ర్యాంకింగ్స్‌ ప్రవేశపెట్టాక వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకున్న 27వ ప్లేయర్‌ మెద్వెదెవ్‌ కావడం విశేషం.

18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత..
పురుషుల టెన్నిస్‌లో ‘బిగ్‌ ఫోర్‌’గా పేరొందిన రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), నోవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్‌)లలో ఎవరో ఒకరు 2004 ఫిబ్రవరి 2 నుంచి ఇప్పటి వరకు ‘టాప్‌’ ర్యాంక్‌లో కొనసాగుతూ వస్తున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నలుగురు కాకుండా మెద్వెదెవ్‌ రూపంలో మరో ప్లేయర్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆటగాడు?
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు    : రష్యా టెన్నిస్‌ స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ 
ఎందుకు : 2022 ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి.. 8,615 పాయింట్లతో కొనసాగుతున్నందున..

International Olympic Committee: ఐఓసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

IOC

అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాతో పాటు ఆ దేశ మిలిటరీ చర్యకు సాయం చేస్తున్న బెలారస్‌పై అంతర్జాతీయ క్రీడా సమాజం నిషేధం విధించాలని గట్టిగా కోరింది. ఐఓసీ ప్రధాన కార్యాలయం స్విట్జర్‌ల్యాండ్‌లోని లూసానే నగరంలో ఉంది. ప్రస్తుతం ఐఓసీ ప్రెసిడెంట్‌గా థామస్‌ బాచ్‌ ఉన్నారు. మరోవైపు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య  రష్యా, బెలారస్‌లకు కేటాయించిన బ్యాడ్మింటన్‌ టోర్నీలన్నీ రద్దు చేసింది. అంతర్జాతీయ అక్వాటిక్స్‌ సమాఖ్య 2022, ఆగస్టులో రష్యాలో నిర్వహించాల్సిన ప్రపంచ జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ను రద్దు చేసింది.

ఎలీనా స్వితోలినా ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
ఉక్రెయిన్‌ టెన్నిస్‌ స్టార్, ప్రపంచ 15వ ర్యాంకర్‌ ఎలీనా స్వితోలినా ఇకపై మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీల్లో గెలిచిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తమ సైన్యానికి విరాళంగా ఇస్తానని ఫిబ్రవరి 28న ప్రకటించింది. ఆమె ఈ వారం మాంటేరి సహా, ఇండియన్‌ వెల్స్, మయామి టోర్నీల్లో పాల్గొననుంది. రష్యా యుద్ధంతో ప్రస్తుతం ఉక్రెయిన్‌ అంతటా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

పంజాబ్‌ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా ఎంపికైన ఆటగాడు?
ఐపీఎల్‌–2022 సీజన్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్‌ను ప్రకటించింది. టీమ్‌లో కీలక ఆటగాడైన ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు పంజాబ్‌ సారథ్య బాధ్యతలు అప్పగించింది. మయాంక్‌ 2018 నుంచి పంజాబ్‌కు ఆడుతున్నాడు. పంజాబ్‌కు ముందు లీగ్‌లో మయాంక్‌ ఢిల్లీ, పుణే, బెంగళూరు జట్ల తరఫున ఆడాడు. ఓవరాల్‌గా అతను 11 సీజన్ల ఐపీఎల్‌లో 135.47 స్ట్రయిక్‌రేట్‌తో 2,131 పరుగులు చేశాడు. 

SEBI: సెబీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ?

Madhabi Puri Buch

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ–ఎస్‌ఈబీఐ) నూతన చైర్‌పర్సన్‌గా మాజీ బ్యాంకర్‌ మాధవీ పురీ బుచ్‌ ఎంపికయ్యారు. దీంతో సెబీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా మాధవీ నిలవనున్నారు. సెబీ నిర్వహణకు ప్రైవేట్‌ రంగం నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా కూడా మాధవి గుర్తింపు పొందారు. సెబీకి పూర్తికాలపు తొలి మహిళా సభ్యురాలిగా కూడా మాధవి సేవలందించారు. సెబీ ప్రస్తుత చైర్మన్‌ అజయ్‌ త్యాగి ఐదేళ్ల పదవీకాలం 2022, ఫిబ్రవరి 28న ముగిసింది. దీంతో 2022, మార్చి1వ తేదీ నుంచి 57 ఏళ్ల మాధవి బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలిగా మూడేళ్లపాటు సెబీ చీఫ్‌గా వ్యవహరించనున్నారు.

అహ్మదాబాద్‌ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన మాధవీ పురీ బుచ్‌.. 1989లో ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కెరీర్‌ను ప్రారంభించారు. ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ ఎండీ–సీఈవోగా సేవలందించారు. 2011లో పీఈ కంపెనీ గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ ఎల్‌ఎల్‌పీలో చేరేందుకు సింగపూర్‌ వెళ్లారు. తదుపరి బ్రిక్స్‌ దేశాలు షాంఘైలో ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లో కన్సల్టెంట్‌గా సేవలందించారు. అగోరా అడ్వయిజరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.

అజయ్‌ త్యాగి ఐదేళ్లు..
1984 బ్యాచ్‌ హిమాచల్‌ కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అజయ్‌ త్యాగి 2017 మార్చి 1న సెబీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. తొలుత మూడేళ్లు బాధ్యతలు నిర్వహించాక తదుపరి ఆరు నెలలపాటు, ఆపై మరో 18 నెలలపాటు చైర్మన్‌ పదవీ నిర్వహణకు గడువును పొందారు. సెబీ చట్ట ప్రకారం చైర్మన్‌ పదవికి అభ్యర్థుల ఎంపికలో గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ పనిచేసేందుకు వీలుంటుంది. పూర్తికాలపు సభ్యురాలిగా మాధవి ప్రస్తుత చైర్మన్‌ త్యాగితో కలసి 2017 ఏప్రిల్‌ 5 నుంచి 2021 అక్టోబర్‌ 4 వరకూ పలు కీలక విధులను నిర్వర్తించారు. సెబీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సెబీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ?
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు    : మాజీ బ్యాంకర్‌ మాధవీ పురీ బుచ్‌
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : సెబీ ప్రస్తుత చైర్మన్‌ అజయ్‌ త్యాగి పదవీకాలం 2022, ఫిబ్రవరి 28న ముగిసిన నేపథ్యంలో..

Indian Navy: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి అణు జలాంతర్గామి?

Indian Warship

తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం సముద్ర జలాల్లో ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ–2022(పీఎఫ్‌ఆర్‌–2022)ను భారత నావికాదళం నిర్వహించింది. భారతదేశ చరిత్రలో పన్నెండవది అయిన ఈ ఫ్లీట్‌ రివ్యూలో త్రివిధ దళాధిపతి హోదాలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొన్నారు. భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో ప్రయాణిస్తూ.. లంగరు వేసిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ఆయన సమీక్షించారు. మొత్తం 60 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, 55 యుద్ధ విమానాలు పీఎఫ్‌ఆర్‌–2022లో పాల్గొన్నాయి. వీటిలో ముఖ్యమైన వార్‌షిప్స్, సబ్‌మెరైన్స్‌ విశేషాలు ఇలా..

ఐఎన్‌ఎస్‌ రాణా..
రాజ్‌పుత్‌ క్లాస్‌ డిస్ట్రాయర్‌ లో మరో నౌక ఐఎన్‌ఎస్‌ రాణా. 1982 జూన్‌ 28 నుంచి విధులు ప్రారంభించింది. 4,974 టన్నుల బరువు, 482 అడుగుల పొడవు, 52 అడుగుల బీమ్, 16 అడుగుల డ్రాట్, 4 గ్యాస్‌ టర్బైన్‌ ఇంజిన్లతో గంటకు 30 నాటికల్‌ మైళ్ల వేగంతో వెళ్తే.. 4,200 కిలోమీటర్లు వరకూ ఏకధాటిగా సముద్ర జలాల్లో దూసుకుపోగల సత్తా రాణా సొంతం. 4 ఎస్‌ఎస్‌ ఎన్‌2డీ మిసైళ్లు, 2 ఎస్‌–125ఎం మిసైళ్లు, 1 మెయిన్‌ గన్, 4 ఎకే–230 గన్స్,  ఒక యాంటీ సబ్‌మెరైన్‌ టార్పెడో, 2 యాంటీ సబ్‌మెరైన్‌ మోటర్స్, ఒక హాల్‌ ఛేతక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఐఎన్‌ఎస్‌ రాణా సామర్థ్యం.

ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి..
సహ్యాద్రి నౌక శివాలిక్‌ క్లాస్‌కు చెందినది. ముంబైలోని మజ్‌గావ్‌డాక్‌లో పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సహ్యాద్రి.. 2012 జూలై 21న కమిషన్‌ అయ్యింది. నేలపై ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇందులో పెంపొందించారు. 6,200 టన్నుల బరువుతో 142.5 మీటర్ల పొడవు, 16.9 మీటర్ల వెడల్పు, 4.5 మీటర్ల  డ్రాఫ్ట్‌తో 2 డీజిల్‌ ఇంజిన్లతో రూపొందించిన ఈ నౌక.. గంటకు 32 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకుపోగలదు. 35 అధికారులు సహా మొత్తం 257 మంది సిబ్బంది సహ్యాద్రిలో ఉంటారు. ఒక బరాక్‌ మిసైల్, 24 మీడియం రేంజ్‌ మిసైల్స్, 8 యాంటీ షిప్‌ క్రూయిజ్‌ మిసైల్స్, 8 ల్యాండ్‌ ఎటాక్‌ క్రూయిజ్‌ మిసైల్స్, 1 నేవల్‌ గన్, 2 యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌లు, 2 టార్పెడో లాంచర్లు, 2 రాకెట్‌ లాంచర్లు, 2 ఎయిర్‌క్రాఫ్ట్‌లు తీసుకెళ్లగల సామర్థ్యం ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి సొంతం.

ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌..
సోవియట్‌ రష్యాకు చెందిన కషిన్‌ క్లాస్‌ నౌకల ఆధారంగా రాజ్‌పుత్‌ క్లాస్‌ నౌకలు నిర్మించారు. ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ ఈ తరగతికి చెందిన యుద్ధ నౌక. బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణులను మొదటిసారిగా ఈ నౌకకే అమర్చారు. 1980 సెప్టెంబర్‌ 30న భారత అమ్ముల పొదిలో చేరింది. 4,974 టన్నుల బరువు, 482 అడుగుల పొడవు, 52 అడుగుల బీమ్, 16 అడుగుల డ్రాట్, 4 గ్యాస్‌ టర్బైన్‌ ఇంజిన్లతో గంటకు 35 నాటికల్‌ మైళ్ల వేగంతో సముద్ర జలాల్లో దూసుకుపోగల సత్తా రాజ్‌పుత్‌ సొంతం. 35 అధికారులు సహా 350 మంది సిబ్బంది రాజ్‌పుత్‌లో విధులు నిర్వర్తిస్తుంటారు. 4 బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ మిసైళ్లు, 2 సాధారణ మిసైల్స్, ఒక ధనుష్‌ బాలిస్టిక్‌ మిసైల్, ఒక మెయిన్‌ గన్, 4 ఏకే–230 గన్స్, ఒక యాంటీ సబ్‌మెరైన్‌ టార్పెడో, 2 యాంటీ సబ్‌మెరైన్‌ మోటర్స్, ఒక చేతక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌లో ఉన్నాయి.

ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్ర..
బ్రహ్మపుత్ర క్లాస్‌ నౌకల్లో మొదటి నౌక ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్ర. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, హెలికాఫ్టర్లను తీసుకెళ్లే సామర్థ్యం బ్రహ్మపుత్ర యుద్ధ నౌక సొంతం. 3,850 టన్నుల బరువు, 126.4 మీటర్ల పొడవు, 14.5 మీ. బీమ్‌తో 2 స్టీమ్‌ టర్బైన్లుతో ఉన్న బ్రహ్మపుత్ర గంటకు 30 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకుపోగలదు. 40 అధికారులు, 13 ఎయిర్‌క్రూ సహా 440 నుంచి 450 మంది సిబ్బంది ఈ నౌకలో విధులు నిర్వర్తిస్తుంటారు.

ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం..
ఆత్మ నిర్భర్‌ భారత్‌ లో భాగంగా ప్రాజెక్ట్‌–15బీ పేరుతో తయారు చేస్తున్న నాలుగు  స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ యుద్ధ నౌకల్లో మొదటిది ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం. ఈ యుద్ధ నౌకకు తొలి ఫ్లీట్‌ రివ్యూ ఇదే కావడం విశేషం. ఇది సముద్ర ఉపరితలంపైనే ఉంటుంది.. కానీ.. ఎక్కడ శత్రువుకు సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. 7400 టన్నులు బరువుతో 163 మీటర్ల పొడవు, 17.4 మీటర్ల బీమ్‌తో రూపొందించిన ఈ యుద్ధ నౌక గంటకు 30 నాటికల్‌ మైళ్లు వేగంతో దూసుకెళ్తుంది. ఏకధాటిగా 4 వేల నాటికల్‌ మైళ్లు ప్రయాణం చేయగల సత్తా దీని సొంతం. ఇందులో 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది ఉంటారు. మల్టీ ఫంక్షన్‌ రాడార్, ఎయిర్‌ సెర్చ్‌ రాడార్‌ వ్యవస్థలున్న ఐఎన్‌ఎస్‌ విశాఖలో 32 బరాక్‌ ఎయిర్‌ క్షిపణులు, 16 బ్రహ్మోస్‌ యాంటీషిప్, ల్యాండ్‌ అటాక్‌ క్షిపణులు, 76 ఎంఎం సూపర్‌ రాపిడ్‌ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్‌ లాంచర్స్‌ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్‌ లాంచర్లు వంటి ఆయుధ సంపత్తి ఉంటుంది. రెండు వెస్ట్‌ల్యాండ్‌ సీ కింగ్‌ విమానాలు లేదు రెండు హెచ్‌ఏఎల్‌ ధృవ్‌ విమానాలు తీసుకెళ్లగలదు. రెండు రోజుల క్రితమే ఐఎన్‌ఎస్‌ విశాఖ నుంచి బ్రహ్మోస్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం విశేషం.

ఐఎన్‌ఎస్‌ సాత్పురా..
శివాలిక్‌ క్లాస్‌కు చెందిన యుద్ధ నౌక ఇది. ముంబైలోని మజ్‌గావ్‌డాక్‌లో పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సాత్పురా.. 2011 ఆగస్ట్‌ 20న నౌకాదళం అమ్ములపొదిలో చేరింది. సంకల్పం, ఆత్మగౌరవం, ధైర్యం అనే నినాదంతో సాత్పురా సాగర జలాల్లో దూసుకుపోతోంది. 6,200 టన్నుల బరువుతో 468 అడుగుల పొడవు, 55 అడుగుల వెడల్పు, 15 అడుగుల డ్రాఫ్ట్‌తో రూపొందించిన ఈ నౌక గంటకు 32 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకుపోగలదు. 35 అధికారులు సహా మొత్తం 257 మంది సిబ్బంది సాత్పురాలో ఉంటారు. 24 మీడియం రేంజ్‌ మిసైల్స్, 8 యాంటీ షిప్‌ క్రూయిజ్‌ మిసైల్స్, 8 ల్యాండ్‌ ఎటాక్‌ క్రూయిజ్‌ మిసైల్స్, 1 నేవల్‌ గన్, 2 యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌లు, 2 టార్పెడో లాంచర్లు, 2 రాకెట్‌ లాంచర్లు, 2 ఎయిర్‌క్రాఫ్ట్‌లు తీసుకెళ్లగల సామర్థ్యం ఐఎన్‌ఎస్‌ సాత్పురా సొంతం.

ఐఎన్‌ఎస్‌ ఘరియాల్‌..
హిందూస్థాన్‌ షిప్‌యార్డులో నిర్మించిన నౌక ఇది. 1997 ఫిబ్రవరి 14న ఐఎన్‌ఎస్‌ ఘరియాల్‌... తూర్పు నౌకాదళంలో చేరింది. 5,665 టన్నుల బరువు, 120మీ. పొడవు, 17.5 మీ. బీమ్, 4 మీ. డ్రాఫ్ట్, 2 సస్టైన్డ్‌ డీజిల్‌ ఇంజిన్లతో గంటకు నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకుపోగల సత్తా ఘరియాల్‌ సొంతం. 4 ఎల్‌సీవీపీ బోట్లు, 500 ట్రూప్‌లు, 15 ట్యాంకులు, 8 ఎపీసీలు ఘరియాల్‌లో ఇమిడి ఉన్నాయి. 16 ఆఫీసర్లతో సహా మొత్తం 136 మంది సిబ్బంది ఈ నౌకలో విధులు నిర్వర్తిస్తున్నారు. 4 బోఫోర్స్‌ గన్స్, 2 మల్టీపుల్‌ బారెల్‌ రాకెట్‌ లాంచర్లు, ఒక సీకింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్, 2 హెలికాఫ్టర్‌ ప్లాట్‌ఫామ్‌లు ఘరియాల్‌ సామర్థ్యానికి నిదర్శనం

ఐఎన్‌ఎస్‌ కిర్చి..
కోరా క్లాస్‌ యుద్ధ నౌకలో ప్రధానమైనది ఐఎన్‌ఎస్‌ కిర్చి. మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డింగ్‌లో రూపొందిన కిర్చి.. 2001 జనవరి 22న భారత నౌకాదళ అమ్ముల పొదిలో చేరింది. 1400 టన్నుల బరువుతో 299 అడుగుల పొడవు, 34 అడుగుల బీమ్, 15 అడుగుల డ్రాట్, 2 డీజిల్‌ మోటార్స్‌తో గంటకు 25 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకు పోగల సామర్థ్యం కిర్చి సొంతం. 14 మంది అధికారులు సహా 134 మంది సెయిలర్స్‌ ఐఎన్‌ఎస్‌ కిర్చిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక ఎంఆర్‌ 352 పాజిటివ్‌ ఈ– రాడార్, భారత్‌ 1245 నేవిగేషన్‌ రాడార్, ఐపీఎన్‌–10 కాంబాట్‌ డేటా సిస్టమ్‌ వంటి ఆధునిక సాంకేతిక కిర్చిలో పొందుపరిచారు. 16 కెహెచ్‌–35 ఆయుధాలు, 2 స్ట్రెలా–2ఎం మిసైల్స్, ఒక ఓటీఓ గన్, రెండు 30ఎంఎం ఎకె–630 గన్స్‌తో పాటు ఒక హాల్‌ చేతక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఐఎన్‌ఎస్‌ కిర్చి సామర్థ్యం.

ఐఎన్‌ఎస్‌ కద్మత్‌..
కమోర్తా క్లాస్‌లో పీ–29 వార్‌ఫేర్‌ రెండో నౌక ఐఎన్‌ఎస్‌ కద్మత్‌. 2016 జనవరి 7న భారత నౌకాదళంలో చేరిన కద్మత్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ నౌక. 3,300 టన్నుల బరువు, 109 మీటర్ల పొడవు, 12.8 మీటర్ల బీమ్‌ తో 4 డీజిల్‌ ఇంజిన్లతో గంటకు 25 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. 13 మంది ఆఫీసర్లతో పాటు 180 మంది సెయిలర్స్‌ ఈ నౌకలో విధులు నిర్వర్తిస్తుంటారు. కద్మత్‌లో ఉన్న సప్రెషన్‌ సిస్టమ్‌ నౌకలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. న్యూక్లియర్, కెమికల్, బయోలాజికల్‌ వార్‌ థియేటర్లలోనూ పనిచేసే సామర్థ్యం కద్మత్‌ సొంతం.

ఐఎన్‌ఎస్‌ శక్తి..
భారత నౌకాదళాల్లో ఉన్న నౌకల్లో అతి పెద్ద నౌకలో ఒకటి ఐఎన్‌ఎస్‌ శక్తి. దీపక్‌ క్లాస్‌ ఫ్లీట్‌ ట్యాంకర్‌ క్లాస్‌కు చెందిన శక్తి.. 2011 అక్టోబర్‌ 1న నౌకాదళ అమ్ముల పొదిలో చేరింది. 27,550 టన్నుల భారీ బరువుతో 574 అడుగుల పొడవు, 82 అడుగుల బీమ్, 30 అడుగుల డ్రాట్, సముద్ర జలాల్లో 63 అడుగుల డెప్త్‌ ఉన్న ఐఎన్‌ఎస్‌ శక్తిపై 10 డెక్‌లు ఉన్నాయి. 19.2 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 2 డీజిల్‌ ఇంజిన్లతో గంటకు 20 నాటికల్‌ మైళ్ల వేగంతో సముద్ర జలాల్లో దూసుకుపోగల సామర్థ్యం ఉంది. శక్తిలో 20 మంది అధికారులు, 180 మంది సెయిలర్స్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. 4 ఎకె–630 క్లోజ్‌ఇన్‌ వెపన్‌ సిస్టమ్‌ ఉంది. దీని ద్వారా నిమిషానికి 4,000 నుంచి 10,000 రౌండ్లు ఫైర్‌ చెయ్యగలదు. వివిధ రకాల హెలికాఫ్టర్లు, దీంతో పాటు 17,900 టన్నుల కార్గో కెపాసిటీ ఐఎన్‌ఎస్‌ శక్తిలో ఉంది.

ఐఎన్‌ఎస్‌ కమోర్తా..
దేశంలో ప్రాజెక్టు–28 కింద నాలుగు కమోర్తా క్లాస్‌ యాంటీ సబ్‌మెరైన్‌ యుద్ధ నౌకలను నిర్మించారు. అందులో మొదటిది ఐఎన్‌ఎస్‌ కమోర్తా. 2014 ఆగస్టు 23న తూర్పు నౌకాదళంలో చేరింది. 3,500 టన్నుల బరువుతో 109.1 మీట్‌ పొడవు, 13.7 మీటర్ల బీమ్, 4 డీజిల్‌ ఇంజిన్లు సామర్థ్యం ఉన్న కమోర్తా గంటకు 32 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకుపోగల సత్తా కమోర్తా సొంతం. 13 మంది ఆఫీసర్లతో పాటు 180 మంది సెయిలర్స్‌ ఈ నౌకలో విధులు నిర్వర్తిస్తుంటారు. ఫైర్‌ కంట్రోల్‌ రాడార్, గిగా బైట్‌ యాంటెన్నా కమ్యునికేషన్‌ గ్రిడ్, బాంబర్‌ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సిస్టమ్‌తో శక్తిమంతమైన నౌకగా కమోర్తా ఉంది. 2 యాంటీ సబ్‌మెరైన్‌ రాకెట్‌ లాంఛర్లు, 4 టార్పెడో ట్యూబ్‌లు, 1 వెస్ట్‌లాండ్‌ సీ కింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు కమోర్తాలో ఉన్నాయి.

ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌..
శార్దూల్‌ క్లాస్‌ యాంఫిబియాస్‌ వార్‌ ఫేర్‌కు చెందిన ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ నౌక 2009 మే 19న నౌకాదళంలో చేరి సేవలు ప్రారంభించింది. 410 అడుగుల పొడవు, 57 అడుగుల బీమ్, 13 అడుగుల డ్రాట్‌తో పీఏ–6 ఎస్‌టీసీ ఇంజిన్ల సామర్థ్యంతో 16 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకుపోతుందీ ఐరావత్‌. 11 ఎంబీటీ సామర్థ్యం, 10 ఇన్‌ఫాంట్రీ ట్రక్స్, 500 ట్రూప్స్‌ ఐరావత్‌ సామర్థ్యం. ఈ నౌకలో 11 మంది ఆఫీసర్లు, 145 మంది సెయిలర్స్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. 2 లాకెట్‌ లాంఛర్లు, 4 నేవల్‌ 30ఎంఎం మేడక్‌ గన్స్, ఒక వెస్ట్‌ల్యాండ్‌ సీ కింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ఐరావత్‌ బలం.

ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌..

INS Arihant

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి అణు జలాంతర్గామిగా ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ సబ్‌మెరైన్‌ చరిత్రలో నిలిచిపోయింది. అరి హంత్‌ అంటే.. శత్రు వినాశని అని అర్థం. ఈపేరు చెబితే శత్రువుల కంటి మీద కునుకు ఉండదు. విశాఖ షిప్‌యార్డులో తయారు చేసిన 6 వేల టన్నుల బరువుతో ఉన్న  అరిహంత్‌ సబ్‌మెరైన్‌లో 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగలిగే 4 క్షిపణులతో పాటు 12 సాగరిక క్షిపణులు, 4 ఇతర క్షిపణులున్నాయి. 111 మీటర్ల పొడవు, 15 మీటర్ల బీమ్, 11మీ డ్రాట్‌తో 83 మెగావాట్ల రియాక్టర్‌తో రూపొందించారు.

ఎస్‌సీఐ సబర్మతి..
షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌సీఐ) వినియోగిస్తున్న అత్యంత శక్తిమంతమైన డీఎస్‌ఆర్‌వీ(డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌) ఎస్‌సీఐ సబర్మతి ఆఫ్‌షోర్‌ సప్‌లై వెసల్‌. వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన నౌకల సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్లలో సబర్మతి ముఖ్య భూమిక పోషిస్తోంది. 78 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పుతో సబర్మతి షిప్‌ని 2013లో నిర్మించారు. కొలంబో డాక్‌యార్డులో తయారు చేసిన సబర్మతి 3306 టన్నుల బరువుంటుంది.

సాగర అన్వేషిక..
దేశంలో ఉన్న తీర పరిశోధన నౌకల్లో సాగర అన్వేషిక రెండోది. 2020లో ఈ నౌకని జాతికి అంకితం చేశారు.  ఇది నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఓటీ)కి చెందిన సంస్థ. 43 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల డ్రాఫ్ట్‌తో నిర్మితమైన ఈ నౌకలో 8 మంది శాస్త్రవేత్తలు, 12 మంది సిబ్బంది ఇందులో విధులు నిర్వర్తిస్తున్నారు. సముద్ర వనరులకు సంబంధించిన డేటాను సేకరించేందుకు హిందూ మహాసముద్రంలో 3 కిలోమీటర్ల లోతుకు వెళ్లి పరిశోధనలు చేసేలా పనిచేయగల సత్తా దీని సొంతం.

ఐఎన్‌ఎస్‌ జలాశ్వ..  
యూఎస్‌ నేవీ నుంచి కొనుగోలు చేసిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ.. ప్రస్తుతం అత్యంత కీలకమైన యుద్ధ నౌకగా వ్యవహరిస్తోంది. 2007లో భారత నౌకాదళంలో ప్రవేశించిన జలాశ్వ.. అనేక ఆపరేషన్లలో పాల్గొంది. ఆపరేషన్‌ సముద్రసేతులో భాగంగా.. లాక్‌ డౌన్‌ సమయంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా దేశానికి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించింది. 12 వేల టన్నుల బరువున్న భారీ యుద్ధ నౌక 173.7 మీటర్ల పొడవుంటుంది.

ఐఎన్‌ఎస్‌ చక్ర..
ఈ సబ్‌మెరైన్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. 2012లో భారత నౌకాదళంలో చక్ర సబ్‌మెరైన్‌ ప్రవేశించింది. సుమారు 12 వేల టన్నుల బరువు, 190 మెగావాట్ల రియాక్టర్‌ను కలిగి ఉంటుంది. గంటకు 30 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. చక్ర జలాంతర్గామిలో 80 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వ్యూహాత్మక క్షిపణులు, అగ్నిమాపక వ్యవస్థ, సోనార్‌ వ్యవస్థ, అత్యాధునిక పెరిస్కోప్‌ ఉన్నాయి. 300 కిమీ దూరంలో ఉన్న లక్ష్యాల్ని ఛేదించగల సామర్థ్యంతో ఒకేసారి 26 శతఘ్నుల్ని తీసుకుపోగలదు. సముద్ర జలాల్లో 520 మీటర్ల లోతులో ప్రయాణించగల సత్తా చక్ర సబ్‌మెరైన్‌ సొంతం. ఏకంగా 100 రోజుల పాటు సముద్ర జలాల్లో ప్రయాణించేందుకు అవసరమైన సౌకర్యాలన్నీ ఐఎన్‌ఎస్‌ చక్రలో ఉంటాయి.

ఐఎన్‌ఎస్‌ సింధుకీర్తి..
సింధుఘోష్‌ క్లాస్‌కు చెందిన ఎటాక్‌ సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ సింధుకీర్తి. 1990 జనవరి 4న నౌకాదళంలో ప్రవేశించిన సింధుకీర్తి.. జూన్‌ 2006 లో మరమ్మతులకు గురైంది. 2015 మే వరకూ పూర్తిస్థాయి మరమ్మతులు, ఆధునికీకరణ పనులు నిర్వర్తించి.. 2015 మే 23న తిరిగి తన సేవల్ని ప్రారంభించింది. 300 కిమీ దూరంలో ఉన్న లక్ష్యాన్ని అలవోకగా ఛేదించగలదు.  ఏడుగురు అధికారులతో పాటు 61 మంది í సింధుకీర్తిలో విధులు నిర్వర్తిస్తున్నారు.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 28 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 Mar 2022 11:23AM

Photo Stories