Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 28 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Feb-28

Boxing: స్ట్రాండ్‌జా టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారతీయురాలు?

Nikhat Zareen(Left); Nitu(Right)

స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం సాధించింది. బల్గేరియా రాజధాని సోఫియాలో ఫిబ్రవరి 27న ముగిసిన ఈ టోర్నీలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నిఖత్‌ 52 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో నిఖత్‌ 4–1తో తెతియానా కోబ్‌ (ఉక్రెయిన్‌)పై విజయం సాధించింది. తద్వారా 73 ఏళ్ల చరిత్ర కలిగిన స్ట్రాండ్‌జా టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా నిఖత్‌ గుర్తింపు పొందింది. 2019లోనూ నిఖత్‌ బంగారు పతకం సాధించింది.

48 కేజీల విభాగంలో.. నీతూకు స్వర్ణం..
స్ట్రాండ్‌జా స్మారక టోర్నీలోనే మహిళల 48 కేజీల విభాగంలోనూ భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. హరియాణాకు చెందిన నీతూ ఫైనల్లో 5–0తో ఎరికా ప్రిసియాండ్రో (ఇటలీ)పై గెలిచింది. పసిడి పతకాలు నెగ్గిన నిఖత్, నీతూలకు 4 వేల డాలర్ల (రూ. 3 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో  స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ మహిళలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు    : నిఖత్‌ జరీన్‌(52 కేజీల విభాగం), నీతూ(48 కేజీల విభాగం) 
ఎక్కడ    : సోఫియా, బల్గేరియా
ఎందుకు : ఫైనల్లో నిఖత్‌ 4–1తో తెతియానా కోబ్‌ (ఉక్రెయిన్‌)పై, నీతూ 5–0తో ఎరికా ప్రిసియాండ్రో (ఇటలీ)పై విజయం సాధించినందున..

PVL 2022: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో చాంపియన్‌గా అవతరించిన జట్టు?

PVL 2022 Winners

2022 ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) టోర్నమెంట్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌ జట్టు చాంపియన్‌గా అవతరించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఫిబ్రవరి 27న జరిగిన ఫైనల్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌ 3–0 (15–13, 15–10, 15–12)తో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ జట్టును ఓడించింది. కోల్‌కతా ఆటగాడు వినీత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ అవార్డును దక్కించుకున్నాడు. వినీత్‌ ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌’ గా... ఎస్‌వీ గురుప్రశాంత్‌ (హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌) ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌’గా... అంగముత్తు (అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌) ‘బెస్ట్‌ స్పైకర్‌ ఆఫ్‌ ద సీజన్‌’గా... జాన్‌ జోసెఫ్‌ (హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌) ‘బెస్ట్‌ బ్లాకర్‌ ఆఫ్‌ ద సీజన్‌’గా... షాన్‌ జాన్‌ (అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌) ‘ఫాంటసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌’గా అవార్డులు గెల్చుకున్నారు. ప్రముఖ సినీ నటుడు విజయ్‌ దేవరకొండ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్టుకు ట్రోఫీని అందజేశాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022 ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు    : కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌
ఎక్కడ    : గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం, హైదరాబాద్‌
ఎందుకు : ఫైనల్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌ జట్టు 3–0 (15–13, 15–10, 15–12)తో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ జట్టుపై విజయం సాధించినందున..

Tennis: అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత జోడీ?

Shravya Shivani-Sharmada Balu

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య మహిళల టోర్నమెంట్‌ డబుల్స్‌ విభాగంలో చిలకలపూడి శ్రావ్య శివాని–షర్మదా బాలు (భారత్‌) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫిబ్రవరి 26న జరిగిన డబుల్స్‌ ఫైనల్లో శ్రావ్య శివాని–షర్మదా బాలు ద్వయం 3–6, 1–6తో రెండో సీడ్‌ పునిన్‌ (థాయ్‌లాండ్‌)–అనా ఉరెకె (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది.

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాగాల వెంకట్‌ రాహుల్‌ ఏ క్రీడలో పేరొందాడు?
సింగపూర్‌ అంతర్జాతీయ టోర్నీలో 96 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌లిఫ్టర్‌ రాగాల వెంకట్‌ రాహుల్‌ కాంస్య పతకం గెలిచి, 2022 జూలై–ఆగస్టులో బర్మింగ్‌హమ్‌లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించాడు. రాహుల్‌ మొత్తం 328 కేజీలు (స్నాచ్‌లో 149+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 188) బరువెత్తాడు. భారత్‌కే చెందిన వికాస్‌ (339 కేజీలు) స్వర్ణం, బరెడో (ఆస్ట్రేలియా–336 కేజీలు) రజతం గెలిచారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య మహిళల టోర్నమెంట్‌ డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన భారత జోడీ?
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు    : చిలకలపూడి శ్రావ్య శివాని–షర్మదా బాలు (భారత్‌) జోడీ
ఎక్కడ    : అహ్మదాబాద్, గుజరాత్‌
ఎందుకు : ఫైనల్లో శ్రావ్య శివాని–షర్మదా బాలు ద్వయం 3–6, 1–6తో రెండో సీడ్‌ పునిన్‌ (థాయ్‌లాండ్‌)–అనా ఉరెకె (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైనందున..

Tennis: మెక్సికో ఓపెన్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన ఆటగాడు?

Rafel nadal

2022 మెక్సికో ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ విజేతగా అవతరించాడు. ఫిబ్రవరి 27న మెక్సికోలోని అకాపుల్కో నగరంలో జరిగిన  పురుషుల సింగిల్స్‌  ఫైనల్లో నాదల్‌ 6–4, 6–4తో కామెరాన్‌ నోరీ (బ్రిటన్‌)పై గెలిచాడు. చాంపియన్‌ నాదల్‌కు 3,14,455 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 36 లక్షలు)తోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. నాదల్‌ కెరీర్‌లో ఇది 91వ సింగిల్స్‌ టైటిల్‌కాగా... 2022 ఏడాది మూడోది. మెల్‌బోర్న్‌ ఓపెన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ నాదల్‌ విజేతగా నిలిచాడు. మెక్సికో రాజధాని నగరం పేరు మెక్సికో సిటీ.

బల్గేరియా రాజధాని నగరం పేరు?
బల్గేరియా రాజధాని సోఫియా వేదికగా ఫిబ్రవరి 27న ముగిసిన స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో భారత మహిళా బాక్సర్‌ నందిని కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చండీగఢ్‌కు చెందిన నందిని ప్లస్‌ 81 కేజీల సెమీఫైనల్లో 0–5తో లాజత్‌ కుంగిబయెవా (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022 మెక్సికో ఓపెన్‌లో టెన్నిస్‌ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించిన ఆటగాడు?
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు    : స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ 
ఎక్కడ    : అకాపుల్కో, మెక్సికో
ఎందుకు : పురుషుల సింగిల్స్‌  ఫైనల్లో నాదల్‌ 6–4, 6–4తో కామెరాన్‌ నోరీ (బ్రిటన్‌)పై గెలిచినందున..

Operation Ganga: ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు దేశాల‌కు కేంద్ర మంత్రులు

India-Ukraine Flags

ఉక్రెయిన్- రష్యా యుద్ధ పరిణామాలు, ముఖ్యంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల తరలింపే ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవ‌రి 28న అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం జ‌రిగింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలింపు ప్రక్రియను వేగ‌వంతం చేసేందుకు... కేంద్రమంత్రులు స్వయంగా ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు వెళ్లి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించాలని తాజా స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఈ మేరకు నలుగురు కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు హర్దీప్‌ సింగ్‌ పూరి, జ్యోతిరాదిత్య సింథియా, కిర‌ణ్ రిజిజు, జనరల్‌(రిటైర్డ్‌) వీకే సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు. వీళ్లు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగేరి, రొమేనియా, పోల్యాండ్‌, స్లొవేకియాల‌కు వెళ్తారు. అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తూ.. భారతీయుల తరలింపును వేగవంతం చేస్తారు. ఆపరేషన్‌ గంగ పేరుతో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. భారతీయులను సురక్షితంగా, త్వరగతిన స్వదేశానికి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా ఈ మిషన్‌ను కేంద్రం చేప‌ట్టింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు దేశాలు హంగేరి, రొమేనియా, పోల్యాండ్‌, స్లొవేకియాల‌కు వెళ్ల‌నున్న కేంద్రం మంత్రులు 
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు    : కేంద్ర మంత్రులు హర్దీప్‌ సింగ్‌ పూరి, జ్యోతిరాదిత్య సింథియా, కిర‌ణ్ రిజిజు, జనరల్‌(రిటైర్డ్‌) వీకే సింగ్
ఎందుకు : ఆపరేషన్‌ గంగలో భాగంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలింపు ప్రక్రియను వేగ‌వంతం చేసేందుకు..

Naval Exercise: 2022 మిలాన్‌ విన్యాసాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?

Milan 2022

నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్‌ (బహుపాక్షిక నావికా విన్యాసాలు)కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికైంది. విశాఖలోని ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరంలో మిలాన్‌–2022 విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 27న వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా హాజరై, ప్రసగించారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్‌ విశాఖను ఆయన జాతికి అంకితం చేయడంతో, కొత్తగా నావికాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని సందర్శించారు. అనంతరం ప్రసంగించారు. సీ ఫేజ్‌(ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు), హార్బర్‌ ఫేజ్‌(మార్చి 1 నుంచి 4 వరకు) అనే రెండు ఫేజ్‌లలో మిలాన్‌ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.

మిలాన్‌–202  థీమ్‌: స్నేహం – సమన్వయం – సహకారం(Camaraderie – Cohesion – Collaboration)

సీఎం ప్రసంగం–ముఖ్యాంశాలు..

  • మొట్టమొదటిసారిగా విశాఖ సాగర తీరంలో మిలాన్‌–2022 నిర్వహణ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోతుంది. తూర్పు నావికాదళంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ విశాఖ చేరడం మనకు గర్వకారణం.
  • వైజాగ్‌.. సిటీ ఆఫ్‌ డెస్టినీ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం. విశాఖ చరిత్రలో ఇది మైలురాయి. ఇది అరుదైన యుద్ధ నౌకల విన్యాసాల పండగ. ఈ మిలాన్‌లో 39 దేశాలు పాల్గొనడం గర్వకారణం.
  • పూర్తి స్వదేశీయంగా యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖ’ను రూపొందించడం ఎంతో సంతోషం. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌక కొద్ది నెలల క్రితం నావికాదళంలో చేరింది. ఇది విశాఖ ప్రజలకు గర్వకారణం. పీ 15 బీ క్లాసెస్‌ గైడెడ్‌ మిసైల్‌ స్టెల్త్‌ డిస్ట్రాయర్‌ సాంకేతికతో పనిచేసే ఈ యుద్ధ నౌక తూర్పు నావికాదళంలోకి చేరడం ఎంతో గర్వకారణం.
  • ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం పై భాగంలో మన విశాఖపట్నంలో ప్రకృతి ప్రసాదంగా ఏర్పడిన డాల్ఫిన్‌ నోస్‌ని.. రాష్ట్ర మృగం కృష్ణ జింకని ప్రత్యేకంగా ముద్రించారు.
  • స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి కూడా తూర్పు నావికాదళంలో చేరడంతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం ప్రారంభమైంది.
  • మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్‌ నేవీ సంయుక్త నిర్వహణలో మిలాన్‌ వేడుకలకు విశాఖ  కేంద్రం కావడం ఆనందంగా ఉంది.
  • భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌గుప్తా, ఈ వేడుకల్లో పాల్గొన్న అంబాసిడర్లు, అధికారులు, ఇతర దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు.

కోవిడ్‌ కారణంగా..
వాస్తవానికి 2020 మార్చి 19 నుంచి 27 వరకూ విశాఖ కేంద్రంగా మిలాన్‌ విన్యాసాలు జరగాల్సి ఉంది. కోవిడ్‌ కారణంగా వాయిదా వేశారు. 2021 మార్చిలో నిర్వహించాలని భావించినా కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరోమారు వాయిదా వేశారు.

సమావేశం అని అర్థం..
వివిధ దేశాల మధ్య సహద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు మిలాన్‌ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. మిలాన్‌ అంటే.. హిందీలో సమావేశం అని అర్థం.

1995లో తొలిసారి..

  • 1995లో తొలిసారి జరిగిన మిలాన్‌ విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. 
  • సాధారణంగా రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో 16 దేశాలు పాల్గొన్నాయి. 
  • 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద మిలాన్‌గా చరిత్రకెక్కింది. 2018లో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరిగిన విన్యాసాల్లోనూ 17 దేశాలు పాల్గొన్నాయి. తాజా 2022 ఏడాది విన్యాసాల్లో 39 దేశాలు పాల్గొంటున్నాయి.
  • 2005లో సునామీ రావడం వల్ల మిలాన్‌ విన్యాసాలు రద్దు చేయగా, 2001, 2016 సంవత్సరాల్లో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)లు నిర్వహించడం వల్ల మిలాన్‌ విన్యాసాలు జరగలేదు. 
  • మొత్తంగా ఇప్పటి వరకూ 10 సార్లు మిలాన్‌ విన్యాసాలు జరిగాయి. 

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మిలాన్‌–2022 విన్యాసాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు    : భారత నౌకాదళం
ఎక్కడ    : ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు.. 

SWIFT Payment System: స్విఫ్ట్‌ వ్యవస్థ నుంచి ఏ దేశాన్ని బహిష్కరించారు?

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యాపై పలు ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆర్థికంగా రష్యా రెక్కలు విరిచే చర్యలను అమెరికా, నాటో సభ్య దేశాలు ఒక్కొక్కటిగా అమల్లో పెడుతున్నాయి. పలు రష్యా బ్యాంకులను కీలకమైన స్విఫ్ట్‌ (ప్రపంచవ్యాప్త బ్యాంకుల ఆర్థిక సమాచార) వ్యవస్థ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అవి తాజాగా అమల్లోకి తెచ్చాయి. దాంతోపాటు రష్యా సెంట్రల్‌ బ్యాంకుపై విదేశీ రిజర్వులు అందకుండా దానిపై మరిన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. తమ దేశాల్లో రష్యా కంపెనీలు, కుబేరులకు ఉన్న ఆస్తులను గుర్తించి జప్తు చేసేందుకు ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని కూడా అమెరికా, యూరోపియన్‌ కమిషన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లండ్, కెనడా నిర్ణయించాయి.

11 వేలకు పైగా బ్యాంకులు..
అంతర్జాతీయ బ్యాంకింగ్‌ మెసేజింగ్‌ సేవల వ్యవస్థ అయిన స్విఫ్ట్‌ సేవలను భారత్‌తో పాటు 200 దేశాలకు చెందిన 11 వేలకు పైగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వినియోగించుకుంటున్నాయి. ఒక విధంగా రోజువారీ ప్రపంచ ఆర్థిక వ్యవహారాలన్నీ సాఫీగా సాగేలా చూడటంలో దీనిదే ప్రధాన పాత్ర. రష్యా తన కీలక చమురు, గ్యాస్‌ ఎగుమతుల చెల్లింపులు తదితరాల కోసం స్విఫ్ట్‌ వ్యవస్థపైనే ఆధారపడిన నేపథ్యంలో పలు బ్యాంకులకు దీని నుంచి తొలగించడం ఆ దేశంపై పెను ప్రభావమే చూపనుంది. స్విఫ్ట్‌ (Society for Worldwide Interbank Financial Telecommunication-SWIFT) ప్రధాన కార్యాలయం  బెల్జియంలోని లా హుల్పే పట్టణంలో ఉంది. 1973, మే 3న దీన్ని స్థాపించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
స్విఫ్ట్‌ (ప్రపంచవ్యాప్త బ్యాంకుల ఆర్థిక సమాచార) వ్యవస్థ నుంచి రష్యా బహిష్కరణ 
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు    : అమెరికా, నాటో సభ్య దేశాలు 
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో..

Russia-UKraine War: రష్యా బృందంతో చర్చలకు ఉక్రెయిన్‌ అంగీకారం

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ సంక్షోభ నివారణకు రష్యా బృందంతో చర్చలకు సిద్ధమని ఫిబ్రవరి 27న ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలోకి రష్యా సేనలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు పక్షాలు బెలారస్‌ దేశ సరిహద్దులో ఏదో ఒక ప్రాంతంలో చర్చలు జరుపుతాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం తెలిపింది. ఏ సమయంలో చర్చలు జరిగేది వెల్లడించలేదు. అంతకుముందు చర్చలకు బెలారస్‌లోని గోమెల్‌ నగరానికి తమ బృందం వెళ్లిందని రష్యా తెలిపింది. నాటోలో చేరకపోవడం సహా కీలక డిమాండ్లపై చర్చలకు సిద్ధమని జెలెన్‌స్కీ ఫిబ్రవరి 25న ప్రకటించిన నేపథ్యంలో రష్యా ఈ బృందాన్ని పంపింది.

ఐరాస అత్యవసర భేటీ!
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణపై చర్చకు 193 మంది సభ్యులతో కూడిన ఐరాస సాధారణ అసెంబ్లీ ‘అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశం’ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భేటీ కోసం భద్రతా మండలిలో ఓటింగ్‌ జరగనుంది. భద్రతామండలి ‘‘పూర్తి సమావేశం’’లో శాశ్వత దేశాలు వీటో అధికారం ఉపయోగించే వీలు లేదు. దాడిపై భద్రతా మండలి తీర్మానాన్ని ఫిబ్రవరి 25న రష్యా వీటో చేయడం తెలిసిందే.

ఉక్రెయిన్‌పై ఐరాస తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్న దేశాలు?

UNSC

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ ఐరాస భద్రతా మండలి ముందుకొచ్చిన కీలక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. 67 దేశాల మద్దతుతో అమెరికా ప్రతిపాదించిన ఈ తీర్మానంపై ఫిబ్రవరి 25న ఓటింగ్‌ జరిగింది. 15 సభ్య దేశాల్లో అమెరికాతో పాటు 11 దేశాలు అనుకూలంగా ఓటేయగా భారత్, చైనా, యూఏఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. శాశ్వత సభ్య దేశమైన రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకుంది. వివాదాల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని భారత్‌ పేర్కొంది.

పుతిన్‌ వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు విధించిన దేశం?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గెయ్‌ లావ్‌రోవ్‌ వ్యక్తిగత ఆస్తులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రజాస్వామిక సార్వభౌమ రాజ్యమైన ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన ఈ దాడులకు పుతిన్, లావ్‌రోవ్‌ ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని అమెరికా పేర్కొంది. ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్, బెలారస్‌ అధ్యక్షుడు లూకాషెంకా, సిరియా అధ్యక్షుడు బషర్‌–అల్‌–అసద్‌పై ఇప్పటికే ఇలాంటి ఆంక్షలు అమలవుతున్నాయి.

International Space Station: ఐఎస్‌ఎస్‌ను నియంత్రించే ఇంజిన్లు ఏ దేశ ఆధీనంలో ఉన్నాయి?

ISS

ఉక్రెయిన్‌పై దాడులకు ప్రతిగా అమెరికా విధించిన తీవ్ర ఆంక్షలపై రష్యా అంతరిక్ష విభాగం (రోస్‌కాస్మోస్‌) డైరెక్టర్‌ జనరల్‌ దిమిత్రీ రొగోజిన్‌ తీవ్రంగా స్పందించారు. ‘మాకు సహకారాన్ని నిలిపివేస్తే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) అనియంత్రిత కక్ష్యలోకి వెళ్లి, అమెరికా–యూరప్‌పై పడితే ఎవరు రక్షిస్తారు? 500 టన్నుల బరువైన ఐఎస్‌ఎస్‌ భారత్, చైనాల పైనే పడేందుకు అవకాశముంది. ఇదే సాకుతో ఆ దేశాలను బెదిరించాలనుకుంటున్నారా? ఐఎస్‌ఎస్‌ రష్యా మీదుగా వెళ్లడం లేదు కాబట్టి, రిస్కంతా మీకే. ఇందుకు సిద్ధంగా ఉన్నారా?’అని అమెరికాను ప్రశ్నించారు. ఐఎస్‌ఎస్‌ కక్ష్య, అంతరిక్షంలో దాని స్థానాన్ని నియంత్రించే ఇంజిన్లు రష్యా అధీనంలో ఉన్నాయి.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 26 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Feb 2022 06:17PM

Photo Stories