Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 26 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Feb-26

2021-22 Vivo Pro Kabaddi League: ప్రొ కబడ్డీ ఎనిమిదో సీజన్‌లో చాంపియన్‌గా అవతరించిన జట్టు?

Dabang Delhi

2021–22 Pro Kabaddi League season: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో దబంగ్‌ ఢిల్లీ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఫిబ్రవరి 25న బెంగళూరు వేదికగా హోరాహోరీగా జరిగిన ఎనిమిదో సీజన్‌(2021–22 వివో ప్రొ కబడ్డీ లీగ్‌) ఫైనల్లో దబంగ్‌ ఢిల్లీ 37–36తో గతంలో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్‌ పట్నా జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.

బెస్ట్‌ డిఫెండర్‌గా మొహమ్మద్‌ రెజా..
పీకేఎల్‌ ఎనిమిదో సీజన్‌లో నవీన్‌ (ఢిల్లీ; రూ. 20 లక్షలు) ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌’గా, మోహిత్‌ గోయట్‌ (పుణేరి పల్టన్‌; రూ. 8 లక్షలు) ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌’గా, మొహమ్మద్‌ రెజా (పట్నా; రూ. 15 లక్షలు) ‘బెస్ట్‌ డిఫెండర్‌’గా, పవన్‌ సెహ్రావత్‌ (బెంగళూరు బుల్స్‌; రూ. 15 లక్షలు) ‘బెస్ట్‌ రెయిడర్‌’గా అవార్డులను సొంతం చేసుకున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రొ కబడ్డీ ఎనిమిదో సీజన్‌లో చాంపియన్‌గా అవతరించిన జట్టు?
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు    : దబంగ్‌ ఢిల్లీ జట్టు
ఎక్కడ  : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : ఫైనల్లో దబంగ్‌ ఢిల్లీ 37–36తో గతంలో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన పట్నా పైరేట్స్‌పై విజయం సాధించడంతో..

Commonwealth Games: మీరాబాయి చాను ఏ క్రీడలో సుప్రసిద్ధురాలు?

Mirabai Chanu

భారత మహిళా స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను (55 కేజీలు) సింగపూర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 86+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 105) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. 2022 జూలై–ఆగస్టులలో బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌కు సింగపూర్‌ టోర్నీకి క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌గా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో మీరాబాయి స్వర్ణపతక ప్రదర్శనతో కామన్వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించింది. భారత్‌కే చెందిన సంకేత్‌ సాగర్‌ (పురుషుల 55 కేజీలు–స్వర్ణం), రిషికాంత సింగ్‌ (55 కేజీలు–రజతం), బింద్యారాణి దేవి (మహిళల 59 కేజీలు–స్వర్ణం) కూడా కామన్వెల్త్‌ గేమ్స్‌ బెర్త్‌లను సాధించారు.

10 జట్లతో ఐపీఎల్‌ కొత్త తరహా షెడ్యూల్‌ విడుదల
ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల రాకతో 2022 సీజన్‌ మొత్తం 74 మ్యాచ్‌లతో కొత్తగా కనిపించనుంది. ఇప్పటి వరకు ప్రతీ జట్టు మిగతా 7 టీమ్‌లతో రెండు సార్లు తలపడి లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లు ఆడేది. ఇప్పుడు కూడా ఒక్కో జట్టు గరిష్టంగా 14 మ్యాచ్‌లే ఆడనుండగా, ఫార్మాట్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం లీగ్‌ మ్యాచ్‌ల సంఖ్య 70 కాగా, 4 ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లుంటాయి. 2022, మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్‌ నిర్వహిస్తారు. పది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు.

గ్రూప్‌ ‘ఎ’: ముంబై ఇండియన్స్‌ (సీడింగ్‌–1), కోల్‌కతా నైట్‌రైడర్స్‌(3), రాజస్తాన్‌ రాయల్స్‌ (5), ఢిల్లీ క్యాపిటల్స్‌ (7), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (9).

గ్రూప్‌ ‘బి’: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (4), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (6), పంజాబ్‌ కింగ్స్‌ (8), గుజరాత్‌ టైటాన్స్‌ (10).

Telangana: రాష్ట్రంలో అంతర్జాతీయ విత్తన పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?

Singireddy Niranjan Reddy at jayashankar agri versity

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రం ప్రారంభమైంది. ఫిబ్రవరి 25 తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా కొనసాగుతోందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తాజాగా ప్రారంభించిన కేంద్రం రాష్ట్రంలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని చెప్పారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
ఎక్కడ    : ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్‌
ఎందుకు : రాష్ట్రంలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని..

Odisha: రాష్ట్రంలో తొలి గిరిజన ముఖ్యమంత్రిగా పేరొందిన వ్యక్తి?

Hemananda Biswal

ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్‌(82) ఇకలేరు. పలు అనారోగ్య సమస్యలతో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 25న తుదిశ్వాస విడిచారు. ఒడిశా రాష్ట్ర, ఝార్సుగుడ జిల్లా, ఠకురొపొడా గ్రామంలో 1939 డిసెంబర్‌ 1వ తేదీన జన్మించిన హేమానంద ఒడిశా రాష్ట్రంలో తొలి గిరిజన ముఖ్యమంత్రిగా పేరొందాడు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తొలుత 1989 డిసెంబర్‌ 7వ తేదీ నుంచి 1990 మార్చి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. రెండోసారి 1999 డిసెంబర్‌ 6వ తేదీ నుంచి 2000 మార్చి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు  : ఫిబ్రవరి 25
ఎవరు    : హేమానంద బిశ్వాల్‌(82)
ఎక్కడ    : భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు : అనారోగ్య సమస్యలతో..

నర్సిరెడ్డికి చాంపియన్‌ ఆఫ్‌ ఛేంజ్‌ తెలంగాణ అవార్డు
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా ఎండీ పోశం నర్సిరెడ్డిని చాంపియన్‌ ఆఫ్‌ ఛేంజ్‌ తెలంగాణ అవార్డ్‌ వరించింది. సుప్రీంకోర్టు్ట మాజీ న్యాయమూర్తి, ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌ కేజీ బాలక్రిష్ణన్‌ చేతుల మీదుగా ఈ ఆయన ఈ అవార్డను అందుకున్నారు. ధైర్యం, సమాజ సేవ, సమ్మిళిత సామాజిక అభివృద్ధి విలువలను ప్రోత్స హించడంలో వ్యక్తులు, సంస్థ లు చేసిన కృషికి గుర్తింపుగా చాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ నేషనల్‌ అవార్డ్‌లను ప్రదానం చేస్తుంటుంది. నిర్మాణ రంగం నుంచి మైహోమ్‌ గ్రూప్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావుకు కూడా అవార్డ్‌ దక్కింది.

ఫ్రెంచ్‌ బిజినెస్‌ స్కూల్‌తో ఎస్‌ఆర్‌ఎం ఒప్పందం
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రెన్నెస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఫ్రెంచ్‌), ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల మధ్య ఫిబ్రవరి 25న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) జరిగింది. విద్యార్థుల మార్పిడి, అకడమిక్‌ కోర్సుల నిర్వహణ, ఇంటర్న్‌ షిప్, సెమిస్టర్‌ ప్రోగ్రామ్స్‌ కొనసాగించేందుకు పరస్పర సహకారం అందించుకునేలా వాటిమధ్య అంగీకారం కుదిరింది.

Farmers: రైతుబంధు ద్వారా ఎంత మొత్తాన్ని పెట్టుబడి సాయంగా అందజేస్తున్నారు?

Farmers

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం లబ్ధిదారుల్లో సన్నకారు రైతులే ఎక్కువని ఫిబ్రవరి 23న విడుదలైన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో వెల్లడైంది. 2018, మే 10వ తేదీన ప్రారంభమైన రైతుబంధు కింద సంవత్సరానికి ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయంగా (రెండు విడతల్లో) ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజా నివేదిక ప్రకారం..

 • రైతుబంధు పథకంలో 2.47 ఎకరాల లోపు ఉన్న 43,70,837 మంది సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతోంది. తర్వాత 2.48 ఎకరాల నుంచి 4.94 ఎకరాల వరకున్న చిన్న రైతుల కేటగిరీలో 11,53,096 మంది ఉండగా, 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాల వరకు సెమీ మీడియం కేటగిరీలో 4,89,097 మంది రైతులున్నారు.
 • ఇక 9.89 ఎకరాల నుంచి 24.78 ఎకరాల లోపు గల మధ్యతరహా రైతులు 88,708 మందికి రైతుబంధు లబ్ధి చేకూరుతుండగా, 24.78 ఎకరాలు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పెద్ద రైతులు 6,024 మంది ఉన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో పెద్దరైతుల సంఖ్య 0.1 శాతంగా ప్రభుత్వం పేర్కొంది.
 • రైతుబంధు పథకం ప్రారంభించిన 2018 నుంచి 2021 వరకు ఏడు దఫాల్లో రూ.43,054.39 కోట్లు మొత్తం లబ్ధిదారులకు అందింది.

రైతుబీమా కింద రూ.3,259.3 కోట్లు
చనిపోయిన 59 సంవత్సరాల లోపు రైతు కుటుంబానికి రూ.5 లక్షలు బీమా మొత్తాన్ని అందించే రైతుబీమా పథకాన్ని కూడా ప్రభుత్వం 2018లోనే ప్రారంభించింది. ఈ పథకం కింద నమోదై చనిపోయిన రైతు కుటుంబాలకు ఇప్పటివరకు రూ.3,259.3 కోట్లు నేరుగా నామినీల ఖాతాల్లో జమయ్యాయి.

Education: హైస్కూల్‌ స్థాయిలో అత్యధికంగా డ్రాపౌట్స్‌ ఉన్న జిల్లా?

విద్యపై పేదరికం తీవ్ర ప్రభావం చూపుతోందని ఫిబ్రవరి 23న విడుదలైన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 వెల్లడించింది. కొద్దిపాటి చదువుతోనే బడి మాన్పించే స్థితిగతులు తెలంగాణలో కన్పిస్తున్నాయని విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం.. అన్ని వర్గాల్లో పెరిగిన అవగాహన, బడుల సంఖ్య పెరగడం వల్ల 6–10 వయసు పిల్లలను ప్రతి ఒక్కరూ పాఠశాలకు పంపుతున్నారు. జనాభా లెక్కల్లో లేని వారు (వలసదారులు, సంచార తెగలు) కూడా ప్రాథమిక బడుల్లో చేరుస్తున్నారు.

జయశంకర్‌ జిల్లాలో అత్యధికం..
రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం 27,78,000 మంది 6–10 వయస్కులుంటే, 1–5 తరగతుల్లో చేరే విద్యార్థులు 31,10,154 మంది ఉన్నారు. కానీ 9, 10 తరగతులకొచ్చే సరికి కేవలం 10,92,039 మందే ఉంటున్నారు. ఇంటర్‌లో విద్యార్థుల సంఖ్య 4.32 లక్షలే ఉంటోంది. టెన్త్‌కొచ్చే సరికి డ్రాపౌట్స్‌ (స్కూల్‌ మానేసేవారు) 12.29 శాతం ఉంటోంది. జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లాలో అత్యధికంగా డ్రాపౌట్స్‌ (హైస్కూల్‌ స్థాయిలో 29.49%) ఉంటున్నారు. చదువు మధ్యలో మానేసే వారు ఎక్కువగా మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు.

వృద్ధులకు ఫించన్‌ ద్వారా నెలకు ఎంత మొత్తాన్ని అందిస్తున్నారు?
రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్ల కింద పలు కేటగిరీల్లో మొత్తం 38,80,922 మందికి నెలవారీ పెన్షన్లు ఇస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో రాష్ట్ర ప్రభుత్వం ఆయా వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం..
2020–21లో కేటగిరీల వారీగా..

 • వృద్ధాప్య పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 12,36,502 మంది
 • వితంతువుల పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 14,47,107 మంది
 • దివ్యాంగులకు పింఛన్లు నెలకు రూ.3,016 చొప్పున 4,90,630 మంది
 • చేనేత కార్మికులకు పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 37,264 మంది
 • కల్లుగీత కార్మికులకు పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 62,766 మంది
 • హెచ్‌ఐవీ పేషెంట్ల పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 33,198 మంది
 • బీడీ కార్మికుల పేషెంట్ల పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 4,22,246 మంది

Telangana: 2020–21లో రాష్ట్ర ఐటీ రంగ వృద్ధి ఎంత శాతంగా నమోదైంది?

IT Sector

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో దేశంలో కీలకంగా మారిన తెలంగాణలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధిరేటుతో ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి. ఉద్యోగాల కల్పనలోనూ 8 శాతం వృద్ధిరేటు సాధించగా, ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6.28 లక్షలకు చేరినట్లు రాష్ట్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో వెల్లడైంది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి రూ.57.25 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు, ఏటా పెరుగుతూ ఎనిమిదేళ్లలో రెండింతలు వృద్ధి సాధించి రూ.1.45 లక్షల కోట్లకు చేరాయని ఈ నివేదిక పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాల రేటు?
దేశ సగటుతో పోలిస్తే ఆరోగ్యపరంగా తెలంగాణ మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
సంవత్సరంలో ప్రతి 1000 మంది జనాభాకు గణాంకాలు ఇలా..

 • జననాల రేటు దేశంలో 19.7 ఉండగా, తెలంగాణలో 16.7
 • మరణాల రేటు దేశంలో 6, రాష్ట్రంలో 6.1 
 • సంవత్సరం లోపు శిశు మరణాల రేటు దేశంలో 30, రాష్ట్రంలో 23 
 • 28 రోజులలోపు నవజాత శిశువుల మరణాల రేటు దేశంలో 23 ఉండగా, రాష్ట్రంలో 19గా ఉంది.
 • ప్రసవ మరణాలు ప్రతి లక్ష మందికి దేశంలో 113 మంది ఉండగా, రాష్ట్రంలో 63గా ఉంది.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 25 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Feb 2022 05:29PM

Photo Stories