Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మార్చి 16 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Mar-16

హిజాబ్‌ ధరించడం తప్పనిసరి కాదు: కర్ణాటక హైకోర్టు​​​​​​​

Hijab Issue

Karnataka Hijab Issue: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇస్లాం ప్రకారం హిజాబ్‌ ధరించడం తప్పనిసరేమీ కాదని ప్రకటించింది. విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థీ, జస్టిస్‌ కృష్ణ ఎస్‌.దీక్షిత్, జస్టిస్‌ జైబున్నీసా ఎం.వాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మార్చి 15న ఈ మేరకు 129 పేజీలు తీర్పు వెలువరించింది. తీర్పును సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.

11 రోజుల విచారణ 
కర్ణాటక రాష్ట్రంలో 2022, జనవరిలో మొదలైన హిజాబ్‌ వివాదం రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీయడం తెలిసిందే. హిజాబ్‌కు పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించడంతో వివాదం మరింత రాజుకుంది. దాంతో రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలు సంఘాలతో పాటు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ ధరించేందుకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వ జీవోను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. కేసును స్వీకరించిన త్రిసభ్య ధర్మాసనం 11 రోజులు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసి.. తాజాగా వెల్లడించింది.

2022 Players Championship: క్రీడల్లో అత్యధిక బహుమతి మొత్తం గెలిచిన భారతీయుడు?​​​​​​​

Anirban Lahiri

భారత గోల్ఫర్‌ అనిర్బన్‌ లాహిరి ప్రైజ్‌మనీ విషయంలో అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక గోల్ఫ్‌ టోర్నీ ‘ప్లేయర్స్‌ చాంపియన్‌షిప్‌–2022’లో అతను రన్నరప్‌గా నిలిచాడు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న పొంటె వెడ్రా బీచ్‌లో జరిగిన ఈ టోర్నీలో లాహిరి ఒక్క షాట్‌ తేడాతో విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోగా... ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్‌ స్మిత్‌ టైటిల్‌ సాధించాడు. రన్నరప్‌గా నిలవడం ద్వారా లాహిరికి 2.18 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.16.66 కోట్లు) బహుమతిగా లభించాయి. భారత క్రీడల చరిత్రలో ఏ క్రీడాంశంలోనైనా వ్యక్తిగత విభాగంలో ఒక ఆటగాడు సాధించిన అత్యధిక బహుమతి మొత్తం ఇదే కావడం విశేషం. గతంలో విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రపంచ విజేతగా నిలిచిన రెండు సందర్భాల్లో 1.68 మిలియన్‌ డాలర్లు, 1.53 మిలియన్‌ డాలర్లు చొప్పున అందుకున్నాడు.

షేన్‌ వాట్సన్‌ ఏ క్రీడకు చెందినవాడు?
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 41 ఏళ్ల వాట్సన్‌ కోచింగ్‌లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. ఢిల్లీ హెడ్‌ కోచ్‌ పాంటింగ్‌తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్‌ కోచ్‌లు అమ్రే, అగార్కర్‌లతో కలిసి అతను పని చేస్తాడు. 2008నుంచి 2020 వరకు రాజస్తాన్, బెంగళూరు, చెన్నై జట్ల తరఫున వాట్సన్‌ మొత్తం 145 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఏ క్రీడాంశంలోనైనా వ్యక్తిగత విభాగంలో అత్యధిక బహుమతి మొత్తం సాధించిన భారతీయ ఆటగాడు?
ఎప్పుడు : మార్చి 15
ఎవరు    : భారత గోల్ఫర్‌ అనిర్బన్‌ లాహిరి
ఎక్కడ    : పొంటె వెడ్రా బీచ్, ఫ్లోరిడా, అమెరికా
ఎందుకు : ప్లేయర్స్‌ చాంపియన్‌షిప్‌–2022లో లాహిరి రన్నరప్‌గా నిలిచి 2.18 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.16.66 కోట్లు) బహుమతిగా పొందినందున..​​​​​​​

Dredging Corporation of India: డీసీఐ డ్రెడ్జ్‌ బ్రహ్మపుత్రను ఎక్కడ తయారు చేయనున్నారు?​​​​​​​

Dredger

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) చేతికి భారీ డ్రెడ్జర్‌ రానుంది. 12 వేల క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యం గల ట్రెయిలింగ్‌ సక్షన్‌ హాపర్‌ డ్రెడ్జర్‌ (టీఎస్‌హెచ్‌డీ) కొనుగోలు చేయాలని డీసీఐ నిర్ణయించింది. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుకానున్న ఈ డ్రెడ్జర్‌ను కొచ్చి షిప్‌యార్డులో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి కొచ్చి షిప్‌యార్డుతో డీసీఐ ఒప్పందం చేసుకోనుంది. ఈ భారీ డ్రెడ్జర్‌కు ‘డీసీఐ డ్రెడ్జ్‌ బ్రహ్మపుత్ర’ అని నామకరణం చేశారు. ఈ తరహా భారీ డ్రెడ్జర్‌ ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేదు. కొత్తగా భారీ డ్రెడ్జర్లు అవసరమైన నేపథ్యంలో ఈ భారీ డ్రెడ్జర్‌ను కొనుగోలు చేయాలని డీసీఐ నిర్ణయించింది. దీని కొనుగోలుకు సుమారు రూ.వెయ్యి కోట్లు వెచ్చించనున్నారు. 1976, మార్చి 29న ఏర్పాటైన డీసీఐ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డీసీఐ డ్రెడ్జ్‌ బ్రహ్మపుత్రను ఎక్కడ తయారు చేయనున్నారు?
ఎప్పుడు : మార్చి 15
ఎవరు    : కొచ్చి షిప్‌యార్డు
ఎక్కడ    : కొచ్చి షిప్‌యార్డు, కొచ్చి, కేరళ
ఎందుకు : కొత్తగా భారీ డ్రెడ్జర్లు అవసరమైన నేపథ్యంలో..

3500 Year Old Menhir: ఇనుపయుగం నాటి భారీ మెన్హిర్‌ను ఎక్కడ గుర్తించారు?

Iron Age Menhir

తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్‌ జిల్లా, మరిపెడ మండలం, బీచురాజుపల్లి గ్రామ శివారులో మూడున్నర వేల ఏళ్ల క్రితం పాతిన ఓ భారీ మెన్హిర్‌ వెలుగు చూసింది. మరిపెడ–కురవి రహదారిపై ఉన్న ఈ మెన్హిర్‌ను చరిత్ర పరిశోధకులు, విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం అధికారి శ్యాంసుందర్‌రావుతో కలిసి గుర్తించారు. ఇది మూడడుగుల మందంతో తొమ్మిది అడుగుల ఎత్తుతో ఉంది. క్రీ.పూ.1500 సంవత్సరాల క్రితం ఇనుపయుగంలో ఏర్పాటు చేసిన ఈ అరుదైన మెన్హిర్‌ను కాపాడుకోవాలని, చరిత్ర పరిశోధనలో ఇవి కీలకమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.

మెన్హిర్‌ అంటే ఏమిటీ?
ఆదిమ మానవులు చనిపోయిన తర్వాత సమాధి చేసే కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రముఖులెవరైనా చనిపోతే... వారి సమాధి వద్ద స్మృతిచిహ్నంగా భారీ నిలువు రాళ్లను పాతేవారు. ఆ నిలువు రాళ్లనే మెన్హిర్‌గా పేర్కొంటారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అలాంటి మెన్హిర్‌లు గతంలో వెలుగుచూశాయి. స్థానికులకు వాటిమీద అవగాహన లేకపోవడంతో ఇవి అదృశ్యమయ్యాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
క్రీ.పూ.1500 సంవత్సరాల క్రితం ఇనుపయుగంలో ఏర్పాటు చేసిన భారీ మెన్హిర్‌ను ఎక్కడ గుర్తించారు?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు    : చరిత్ర పరిశోధకులు, విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం అధికారి శ్యాంసుందర్‌రావు
ఎక్కడ    : బీచురాజుపల్లి గ్రామం, మరిపెడ మండలం, మహబూబాబాద్‌ జిల్లా, తెలంగాణ రాష్ట్రం   

Starvation Deaths: ఆకలి కారణంగా నిమిషానికి ఎంత మంది మరణిస్తున్నారు?

Hungry

కరోనా, అంతర్గత అస్థిర రాజకీయ పరిస్థితులు, కరువు కాటకాలు వంటి వాటివల్ల ప్రపంచంలో చాలా దేశాలలో ఆకలి చావులు అధికంగా ఉన్నాయనీ, కరోనా వైరస్‌ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారాయనీ పేదరిక నిర్మూలన కోసం కృషి చేసే ‘ఆక్స్‌ఫామ్‌’ సంస్థ వెల్లడించింది. ఆకలి కార ణంగా ప్రపంచంలో ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువగా వుంది అని అంచనా వేసింది. ఈ మేరకు తాజగా ‘ది హంగర్‌ ముల్టిప్లయిస్‌’అనే పేరుతో నివేదికను విడుదల చేసింది. 2021 ఏడాదికిగాను రూపొందించిన ఈ నివేదికను పరిశీలిస్తే...

  • ప్రపంచ జనాభాలో 10 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరకడం లేదు.
  • అదనంగా 11 కోట్ల మంది ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థ వైఫల్యం, లోపభూయిష్ఠమైన ఆహారభద్రత విధానం, నిరుద్యోగం, ఆహార కొరతల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య అధికమైంది.
  • ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ స్వయం సమృద్ధి దశకు చేరినా పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా 2018లో 13.8 శాతం ఉండగా...  2020 నాటికి 15.3 శాతానికి పెరిగింది.
  • భారత్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించినప్పటికీ నిరుద్యోగం, పేదరికం వల్ల ప్రజల కొనుగోలు శక్తి ఆశించిన మేరకు పెరగలేదు. 
  • భారత్‌లో దాదాపు 14 శాతం ప్రజలు పోషకాహార లోపంతో, ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు 20 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. 15–49 ఏళ్ల లోపు మహిళల్లో 52 శాతం రక్తహీనతతో సతమతమౌతున్నారు.
  • – 2021 ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో 116 దేశాలను చేర్చారు. ఇందులో భారతదేశం అట్టడుగున 101వ స్థానంలో ఉంది. 2020లో భారతదేశం స్థానం 94 కాగా, 2021 నాటికి 101 స్థాయికి దిగజారింది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారు
ఎప్పుడు  : మార్చి 13
ఎవరు    : ఆక్స్‌ఫామ్‌ సంస్థ విడుదల చేసిన ది హంగర్‌ ముల్టిప్లయిస్‌ నివేదిక
ఎక్కడ    : ప్రపంచంలో..
ఎందుకు  : ఆకలి కారణంగా..

Aam Aadmi Party Leader: పంజాబ్‌ నూతన సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?

AAP Leader Bhagwant Mann

పంజాబ్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత భగవంత్‌ సింగ్‌ మాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ స్వగ్రామమైన ఖట్కర్‌ కలన్‌లో మార్చి 16న జరిగిన కార్యక్రమంలో భగవంత్‌ సింగ్‌తో పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ  ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్‌ 92 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌ 18 స్థానాల్లో, శిరోమణి అకాలీదళ్‌ 3 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించగా.. బీఎస్పీ 1 సీటును కైవసం చేసుకుంది. ఇతరులు ఒక చోట గెలిచారు. సంగ్రూర్‌ జిల్లాలోని ధౌరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన భగవంత్‌ మాన్‌ 60వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పంజాబ్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మార్చి 16
ఎవరు    : ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత భగవంత్‌ సింగ్‌ మాన్‌ 
ఎక్కడ    : ఖట్కర్‌ కలన్, షాహిద్‌ భగత్‌ సింగ్‌ నగర్‌ జిల్లా, పంజాబ్‌ 
ఎందుకు : ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) విజయం సాధించినందున..

World Peace Center: దేశంలో తొలి ప్రపంచ శాంతి కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?

World Peace Center

దేశంలో మొట్టమొదటి ’ప్రపంచ శాంతి కేంద్రం(వరల్డ్‌ పీస్‌ సెంటర్‌)’ హరియాణ రాష్ట్రం, గురుగ్రామ్‌లో ఏర్పాటు కానుంది. శాంతి రాయబారి, ప్రముఖ జైనచార్యులు డాక్టర్‌ లోకేష్‌జీ స్థాపించిన ‘అహింస విశ్వ భారతి ఆర్గనైజేషన్‌’ ఈ ప్రపంచ శాంతి కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈ సెంటర్‌ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయమై హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు డాక్టర్‌ లోకేష్‌జీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలో శాంతి, సామరస్య స్థాపనకు ‘వరల్డ్‌ పీస్‌ సెంటర్‌’ కృషి చేస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రధాన ప్రపంచ స్థాయి కేంద్రంగా ఉండనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశంలో మొట్టమొదటి ’ప్రపంచ శాంతి కేంద్రం(వరల్డ్‌ పీస్‌ సెంటర్‌)’ ఏర్పాటు కానుంది
ఎప్పుడు : మార్చి 14
ఎవరు    : అహింస విశ్వ భారతి ఆర్గనైజేషన్‌
ఎక్కడ    : గురుగ్రామ్, హరియాణ
ఎందుకు : ప్రపంచంలో శాంతి, సామరస్య స్థాపనకు..

New Ambassador: చైనాలో భారత కొత్త రాయబారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

Pradeep Kumar Rawat

చైనాలో భారత కొత్త రాయబారిగా ప్రదీప్‌ కుమార్‌ రావత్‌ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 14న బీజింగ్‌లోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారని ప్రభుత్వం తెలిపింది. డిప్యూటీ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమితులైన మునుపటి రాయబారి విక్రమ్‌ మిస్రీ స్థానంలో ఆయన నియమితులయ్యారు. 1990 బ్యాచ్‌ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) అధికారి అయిన రావత్‌.. మాండరిన్‌ భాషలో అనర్గళంగా మాట్లాడతారు. చైనాకు రాకముందు నెదర్లాండ్స్‌లో భారత రాయబారిగా విధులు నిర్వర్తించారు.

నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ కొత్త చైర్మన్‌ నియమితులైన వ్యక్తి?
నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) చైర్మన్‌గా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే నియమితులయ్యారు ఈ మేరకు ఆయన నియామకానికి కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. కంపెనీల చట్టం–2013 ప్రకారం.. 2018 ఏడాదిలో ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ ఏర్పాటైంది. ఇది అకౌంటింగ్‌ ప్రమాణాలు మరియు విధానాలను పర్యవేక్షించే ఒక స్వతంత్ర సంస్థ. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
చైనాలో భారత కొత్త రాయబారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ఎప్పుడు : మార్చి 14
ఎవరు    : ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రదీప్‌ కుమార్‌ రావత్‌
ఎక్కడ    : బీజింగ్, చైనా
ఎందుకు : ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న విక్రమ్‌ మిస్రీ.. డిప్యూటీ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమితులైన నేపథ్యంలో..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 15 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Mar 2022 07:44PM

Photo Stories