Daily Current Affairs in Telugu: 2022, జనవరి 31 కరెంట్ అఫైర్స్
Cyber Weapon: పెగసస్ స్పైవేర్‌పై కథనం ప్రచురించిన అమెరికన్ పత్రిక?
భారత్‌లో 2021 ఏడాది ప్రకంపనలు సృష్టించిన పెగసస్ స్పైవేర్‌ను 2017లో ఇజ్రాయెల్ నుంచి స్వయంగా భారత ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యంత ఆధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థతో పాటు పెగసస్ స్పైవేర్‌ని భారత్ కొనుగోలు చేసిందని ‘‘ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ సైబర్‌వెపన్’’ పేరుతో ప్రచురించిన ఆ కథనం ఆరోపించింది. 200 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో (రూ.15 వేల కోట్లు) భాగంగా పెగసస్‌ను కూడా కొనుగోలు చేసినట్టు పేర్కొంది. ఏడాది పాటు పరిశోధన చేసి, ఎన్నో దేశాలకు చెందిన ప్రభుత్వ, ఇంటెలిజెన్స్ అధికారుల, సైబర్ నిపుణుల్ని ఇంటర్వ్యూలు చేసి ఈ విషయాన్ని రూఢి చేసుకున్నామని వెల్లడించింది.
కథనంలోని ముఖ్యాంశాలు..
- ఇజ్రాయెల్‌కు చెందిన భద్రతా సంస్థ ఎన్‌ఎస్‌ఒఓ గ్రూప్ గత దశాబ్దాకాలంగా పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థని ప్రపంచ దేశాలకు విక్రయిస్తోంది.
- భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 జులైలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు పెగసస్ స్పైవేర్‌పై ఒప్పందం కుదిరింది. ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం అదే తొలిసారి.
- అమెరికాకు చెందిన ఎఫ్‌బిఐ కూడా పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసినప్పటికీ దానిని ఎవరి మీద వినియోగించకూడదని నిర్ణయించింది.
- 2011లో ఇజ్రాయెల్ ప్రపంచ మార్కెట్‌లో పెగసస్‌ని ప్రవేశపెట్టిన తర్వాత పలు యూరప్ దేశాలు ఉగ్రవాదుల ఉనికి కనిపెట్టడానికి దీనిని వినియోగించాయి.
- ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరస్తులు దగ్గర అత్యంత ఆధునికమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని డీక్రిప్ట్ (డీకోడ్) చేయగలిగే సామర్థ్యం పెగసస్‌కి ఉండటంతో విధ్వంసకారుల గుట్లు తెలిసేవి. కానీ దీనిని కొనుగోలు చేసిన దేశాలు హక్కుల సంఘాలపై కూడా ప్రయోగించాయి.
వివాదం ఇదే..
భారత్‌లో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సహా విపక్ష నాయకులు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఈ పెగసస్ స్పైవేర్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగించినట్టుగా 2021, జులైలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్‌తో పాటు మరికొన్ని దేశ ప్రభుత్వాలు ఈ నిఘా వ్యవస్థని వాడినట్టుగా ఆరోపణలు రావడంతో సమాజంలో వివిధ వర్గాల గోప్యత ప్రశ్నార్థకంగా మారింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెగసస్ స్పైవేర్‌పై ‘‘ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ సైబర్‌వెపన్’’ పేరుతో కథనం ప్రచురించిన అమెరికన్ పత్రిక?
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : న్యూయార్క్ టైమ్స్ పత్రిక
ఎందుకు : పెగసస్ స్పైవేర్‌కు సంబంధించి పలు కీలక అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు..
తీవ్రమైన ఆహార సంక్షోభంలో అఫ్గానిస్తాన్: డబ్ల్యూఎఫ్‌పీ
World Food Programme: ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన అఫ్గానిస్తాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లాక... ఆర్థిక సంక్షోభం, కరువు వేధిస్తోంది. అమెరికా తమ ఫెడరల్ బ్యాంకు నుంచి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అఫ్గాన్ అందాల్సిన నిధులను స్తంభింపజేయడంతో... ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆహార సంక్షోభంతో ఆకలిచావులు పెరిగిపోయాయని.. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) చీఫ్ డేవిడ్ బేస్లీ ఆందోళన వ్యక్తం చేశారు.
శరీర భాగాల విక్రయం..
యురోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నార్వే, యూకే, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు, ప్రత్యేక రాయబారులతో జనవరి 24న నార్వే రాజధాని నగరం ఓస్లోలో సమావేశమైన డబ్ల్యూఎఫ్‌పీ చీఫ్ డేవిడ్ బేస్లీ.. ఆఫ్గన్ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఆఫ్ఘన్ ప్రజలు మనుగడ కోసం తమ పిల్లలను, వారి శరీర భాగాలను విక్రయిస్తున్నారు. దేశంలో సగానికి పైగా జనాభా ఆకలితో అలమటిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఆఫ్గానిస్తాన్‌కు సహాయాన్ని వేగవంతం చేయాలి’ అని ఆయన కోరారు. 2022 ఏడాది జనాభాలో 97 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడిపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్ల్యూఎఫ్‌పీ.. నోబెల్ శాంతి బహుమతి..
డబ్ల్యూఎఫ్‌పీ ప్రధాన కార్యాలయం ఇటలీ రాజధాని నగరం రోమ్‌లో ఉంది. ఈ సంస్థకు 2020 ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి డబ్ల్యూఎఫ్‌పీ చేస్తున్న విశేష కృషికి ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తీవ్రమైన ఆహార సంక్షోభంలో అఫ్గానిస్తాన్
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) చీఫ్ డేవిడ్ బేస్లీ
ఎందుకు : ఆర్థిక సంక్షోభం, కరువు కారణంగా..
Grandmaster: టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నీ టైటిల్ గెలిచిన భారతీయుడు?
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్–2022లో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ విజేతగా అవతరించాడు. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ వేదికగా జనవరి 30న జరిగిన చివరిదైన 13వ రౌండ్ గేమ్‌లో 18 ఏళ్ల అర్జున్ 62 ఎత్తుల్లో మార్క్ మౌరిజి (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఎనిమిది గేముల్లో నెగ్గిన అర్జున్ ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని 10.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. చాలెంజర్స్ టోర్నీ విజేత హోదాలో అర్జున్ 2022 ఏడాది జరిగే టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీకి అర్హత పొందాడు. పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్ తర్వాత టాటా స్టీల్ చాలెంజర్స్ టోర్నీ టైటిల్ గెలిచిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్–2022లో టైటిల్ గెలిచిన భారతీయుడు?
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్
ఎక్కడ : విక్ ఆన్ జీ, నెదర్లాండ్స్
ఎందుకు : చివరిదైన 13వ రౌండ్ గేమ్‌లో అర్జున్ 62 ఎత్తుల్లో మార్క్ మౌరిజి (ఫ్రాన్స్)పై గెలిచినందున..
Tennis Tournament: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విజేత?
ఆస్ట్రేలియన్ ఓపెన్–2022 మహిళల సింగిల్స్ విభాగంలో ఆసీస్ క్రీడాకారిణి యాష్లే బార్టీ విజేతగా అవతరించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జనవరి 29న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ 87 నిమిషాల్లో 6–3, 7–6 (7/2)తో 27వ సీడ్ డానియెల్ కొలిన్స్ (అమెరికా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన యాష్లే బార్టీకి 28 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 15 కోట్ల 9 లక్షలు)... రన్నరప్ కొలిన్స్‌కు 15 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 8 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
44 ఏళ్ల తర్వాత..
తాజా విజయంతో.. 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన ఆసీస్ క్రీడా కారిణిగా బార్టీ గుర్తింపు పొందింది. 1978లో చివరిసారి ఆస్ట్రేలియా తరఫున ఈ టైటిల్ గెలిచిన ప్లేయర్‌గా క్రిస్టినా ఒనీల్ నిలిచింది. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ (2019), వింబుల్డన్ ఓపెన్ (2021) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన బార్టీ యూఎస్ ఓపెన్ టైటిల్ కూడా సాధిస్తే ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకుంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్–2022 మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ గెలిచిని క్రీడాకారిణి?
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : ఆసీస్ క్రీడాకారిణి యాష్లే బార్టీ
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
ఎందుకు : మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ 87 నిమిషాల్లో 6–3, 7–6 (7/2)తో 27వ సీడ్ డానియెల్ కొలిన్స్ (అమెరికా)పై విజయం సాధించినందున..
Anti Vaccine Protest: ఏ దేశ ప్రధానిని రహస్య ప్రదేశంలోకి తరలించారు?
కెనడా రాజధాని నగరం ఒట్టోవాలోని అధికారిక నివాసం నుంచి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన కుటుంబాన్ని భద్రతా బలగాలు రహస్య ప్రాంతానికి తరలించాయి. దేశంలో కరోనా టీకా తప్పనిసరి నిబంధనలు, ప్రజారోగ్య నిబంధనలను వ్యతిరేకించే నిరసనకారులు భారీగా రాజధాని ఒట్టోవాకు చేరుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా అధికారులు ప్రధానిని, ఆయన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి పంపారు. ‘‘ఫ్రీడం కాన్వాయ్’’ పేరిట జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా పలువురు ట్రక్కు డ్రైవర్లు భారీ ట్రక్కులతో రాజధానికి ర్యాలీగా బయలుదేరారు. వీరంతా జనవరి 29న భారీ సంఖ్యలో రాజధానికి చేరారు.
సరిహద్దుల నుంచి దేశంలోకి వచ్చే ట్రక్కు డ్రైవర్లకు తప్పక టీకా సర్టిఫికెట్ ఉండాలని కెనెడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పలువురు ట్రక్కు డ్రైవర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా నిబంధనలను వ్యతిరేకించేవారు ఈ ట్రక్కర్లకు మద్దతునిస్తున్నారు.
కెనడా..
రాజధాని: ఒట్టోవా; కరెన్సీ: కెనడియన్ డాలర్
అధికార భాషలు: ఇంగ్లిష్, ఫ్రెంచ్
ప్రస్తుత ప్రధానమంత్రి: జస్టిన్ ట్రూడో
క్విక్ రివ్యూ :
ఏమిటి : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలింపు
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : కెనడా భద్రతా బలగాలు
ఎందుకు : టీకా టీకా తప్పనిసరి నిబంధనలు, ప్రజారోగ్య నిబంధనలను వ్యతిరేకించే నిరసనకారులు భారీగా దేశ రాజధాని ఒట్టోవాకు చేరుతున్న నేపథ్యంలో..
Australian Open 2022: టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడు?
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్–2022 పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ విజేతగా అవతరించాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జనవరి 30న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ రాఫెల్ నాదల్ 2–6, 6–7 (5/7), 6–4, 6–4, 7–5తో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచి, టైటిల్ కైవసం చేసుకున్నాడు. టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్‌లు కోల్పోయాక కూడా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్ నాదల్. విజేతగా నిలిచిన నాదల్‌కు 28 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 15 కోట్ల 9 లక్షలు)... రన్నరప్ మెద్వెదెవ్‌కు 15 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 8 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడు..
తాజా విజయంతో రాఫెల్ నాదల్.. తన కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నట్లయింది. అలాగే రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలవడంతోపాటు పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా కొత్త చరిత్రను లిఖించాడు. ఈ టోర్నీకి ముందు ‘దిగ్గజ త్రయం’ రాఫెల్ నాదల్, రోజర్ ఫెడరర్, నోవాక్ జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సమఉజ్జీగా ఉన్నారు. తాజా విజయంతో ఫెడరర్, జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి 35 ఏళ్ల నాదల్ ముందుకొచ్చాడు. సమీప భవిష్యత్‌లో నాదల్‌ను అధిగమించే అవకాశం కేవలం 34 ఏళ్ల జొకోవిచ్‌కు మాత్రమే ఉంది. గాయాలతో సతమతమవుతున్న 40 ఏళ్ల ఫెడరర్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది.
నాదల్ 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్
- ఆస్ట్రేలియన్ ఓపెన్: 2009, 2022
- ఫ్రెంచ్ ఓపెన్: 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020
- వింబుల్డన్: 2008, 2010
- యూఎస్ ఓపెన్: 2010, 2013, 2017, 2019
గ్రాండ్‌స్లామ్ ఆధిక్యం మారిన వేళ..
- 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్: 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో జొకోవిచ్, ఫెడరర్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన నాదల్ 21వ ‘గ్రాండ్’ టైటిల్‌తో ఒంటరిగా ఆధిక్యంలోకి వచ్చాడు.
- 2009 వింబుల్డన్: 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ ఫెడరర్ 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు.
- 2000 వింబుల్డన్: 12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రాయ్ ఎమర్సన్ పేరిట ఉన్న రికార్డును సవరిస్తూ సంప్రాస్ 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు.
పురుషుల్లో.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారులు(కనీసం 10) |
|
క్రీడాకారుడి పేరు |
గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య |
రాఫెల్ నాదల్(స్పెయిన్) |
21 |
జొకోవిచ్(సెర్బియా) |
20 |
ఫెడరర్(స్విట్జర్లాండ్) |
20 |
పీట్ సంప్రాస్(అమెరికా) |
14 |
రాయ్ ఎమర్సన్(ఆస్ట్రేలియా) |
12 |
జాన్ బోర్గ్(స్వీడన్) |
11 |
రాడ్ లేవర్(ఆస్ట్రేలియా) |
11 |
బిల్ టిల్డెన్(అమెరికా) |
10 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్–2022 పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ గెలిచిని క్రీడాకారుడు?
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
ఎందుకు : పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ రాఫెల్ నాదల్ 2–6, 6–7 (5/7), 6–4, 6–4, 7–5తో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచినందున..
Azadi ka Amrit Mahotsav: వీర వనితలపై ఏ పేరుతో సచిత్ర కథలను వెలువరించారు?
75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల ‘అమృత మహోత్సవం’ అజ్ఞాత వీర వనితల చరిత్రను వెలికి తెస్తోంది. దేశం కోసం వీరోచిత పోరాటం చేసి జీవితాలు త్యాగం చేసిన, ప్రాణాలు అర్పించిన మహిళలు కొందరు వెలుగుకు నోచుకోలేదు. అలాంటి 20 మంది వీర వనితల సచిత్ర కథలను కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ‘అమర చిత్ర కథ’ సంస్థతో కలిసి ‘ఇండియాస్ విమెన్ అన్‌సంగ్ హీరోస్’ పేరుతో ఇటీవల వెలువరించింది. మాతంగిని అజ్రా, గులాబ్ కౌర్, చాకలి ఐలమ్మ, రాణి అబ్బక్క తదితరులను ఇప్పుడు దేశంలోని బాలలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచిన జంట?
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్–2022లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను థనాసి కొకినాకిస్–నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జనవరి 29న జరిగిన ఫైనల్లో కొకినాకిస్–కిరియోస్ ద్వయం 7–5, 6–4తో ఎబ్డెన్–పర్సెల్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమర చిత్ర కథ సంస్థతో కలిసి ఇండియాస్ విమెన్ అన్‌సంగ్ హీరోస్ పేరుతో సచిత్ర కథలను వెలువరించిన శాఖ?
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ
ఎందుకు : దేశం కోసం వీరోచిత పోరాటం చేసిన మహిళల గురించి దేశంలోని బాలలకు తెలియజేసేందుకు..
Parliament Budget Session 2022: లోక్‌సభలో 2021–2022 ఆర్థిక సర్వే
Parliament Budget Session 2022 Udates: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. తొలుత పార్లమెంట్ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే కీలకమైన 2021–22 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 31న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కేంద్ర ఆర్థికశాఖ ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి ఆర్థిక సర్వే 2022 వివరాలను వెల్లడించనుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 8–8.5 శాతంగా ఉండొచ్చని ప్రభుత్వ అంచనా.
సింగిల్ వాల్యూమ్‌గా ఆర్థిక సర్వేను విడుదల..
సాధారణంగా ప్రతి ఏటా ఈ సర్వేను రెండు విభాగాలుగా ప్రవేశపెట్టేవారు. తొలి విభాగంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రముఖంగా ప్రస్తావిస్తారు. రెండో విభాగంలో మాత్రం గత ఏడాదికి సంబంధించిన దేశ ఆర్థిక పనితీరును సవివరంగా పొందుపర్చేవారు. అయితే ఈ ఏడాది అన్ని వివరాలను ఒకే దాంట్లో కలిపి సింగిల్ వాల్యూమ్‌గా ఆర్థిక సర్వేను విడుదల చేశారు. బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఈ సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
ఆర్థిక సర్వే అంటే ఏంటి?
గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, పనితీరు ఎలా ఉందో ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది. భవిష్యత్ సవాళ్లు ఏంటివి? వీటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలు కూడా ఆర్థిక సర్వేలో ఉంటాయి. ఏటా బడ్జెట్‌కు ముందు ఈ సర్వేను విడుదల చేస్తారు.
ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు?
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ (డీఈఏ)లోని ఎకనమిక్ డివిజన్ ప్రతి ఏడాది ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. ప్రధాన ఆర్థిక సలహాదారు(చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్- సీఈఏ) నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. సర్వేను ఆర్థికమంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారు. తొలి ఆర్థిక సర్వేను 1950-51లో ఆవిష్కరించారు.
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, జనవరి 29 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్