Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 27 కరెంట్ అఫైర్స్
UNGA 76th Session: ఐరాస 76వ సెషన్ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న ప్రసంగించారు. అఫ్గాన్, కరోనా, ఇండోపసిఫిక్, అంతర్జాతీయ సవాళ్లు.. వంటి అనేక అంశాలను ప్రధాని తన సందేశంలో ప్రస్తావించారు. 2021, సెప్టెంబర్ 21న ప్రారంభమైన 76వ సెషన్ ఐరాస సర్వసభ్య సమావేశాలు సెప్టెంబర్ 27వ తేదీ వరకు జరగనున్నాయి. మాల్దీవులకు చెందిన అబ్దుల్లా షాహిద్ ఐరాస 76వ సెషన్స్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. షాహిద్ ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా 2021, సెప్టెంబర్ 14న బాధ్యతలు చేపట్టారు. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది(2020) సమావేశాలను వర్చువల్ విధానంలో నిర్వహించారు.
మోదీ ప్రసంగం–ముఖ్యాంశాలు
- ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా వాడే దేశాలు చివరకు అది తమను కూడా కబళిస్తుందని గ్రహించాలి.
- విస్తరణ, బహిష్కరణ పోటీల నుంచి సముద్రాలను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది.(ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా చర్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ...)
- అఫ్గాన్‌లో సున్నితమైన పరిస్థితులను ఏ దేశం కూడా తమకు అనుకూలంగా మలుచుకోకుండా చూడాలి.
- ఒక టీ అమ్ముకునే వ్యక్తి స్థాయి నుంచి ఐరాసలో భారత ప్రధానిగా ప్రసంగించేవరకు సాగిన నా జీవితం భారతీయ ప్రజాస్వామిక బలానికి నిదర్శనం. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లివంటిది. 2021, ఏడాది ఆగస్టు 15న ఇండియా 75వ స్వాతంత్య్రోత్సవాలు జరుపుకుంది.
- ఐరాస... తన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. కరోనా పుట్టుక, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాకింగులు, అంతర్జాతీయ సంస్థల పనితీరు వంటివి అనేక సంవత్సరాల ఐరాస కృషిని, ఐరాసపై నమ్మకాన్ని దెబ్బతీశాయి.
- ప్రపంచానికి తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా టీకాను భారత్ అందించింది. కరోనా నాసల్ టీకా అభివృద్ధిలో భారతీయ సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
- భారత్ వృద్ధి బాటలో పయనిస్తే ప్రపంచం కూడా అదే బాటలో పయనిస్తుంది.
ఐక్యరాజ్య సమితి (ఐరాస)
స్థాపన : అక్టోబర్ 24, 1945
ప్రధాన కార్యాలయం : న్యూయార్క్ (అమెరికా)
సభ్య దేశాల సంఖ్య : 193
భద్రతా మండలి సభ్యుల సంఖ్య : 15
భద్రతా మండలి శాశ్వత సభ్యుల సంఖ్య (వీటో అధికారం కలిగిన సభ్యులు) : 5 (చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్)
అంతర్జాతీయ న్యాయ స్థానం ప్రధాన కార్యాలయం : ది హేగ్ (నెదర్లాండ్స్)
ఐరాసలో భారత్ చేరిన సంవత్సరం : 1945
ఐరాస చిహ్నం : ఆలీవ్ కొమ్మ
ఐరాస పతాకంలో రంగులు : తెలుపు, లేత నీలం
Online Games: డిజిటల్ డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం?
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలైన చిన్నారులను వాటి నుంచి విడిపించేందుకు ‘‘డిజిటల్ డీ అడిక్షన్ సెంటర్లు’’ ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ కింద పునర్నిర్మించిన భవనాలను విజయన్ సెప్టెంబర్ 25న వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీ అడిక్షన్ సెంటర్ల గురించి ప్రకటన చేశారు. మరో 20 పోలీస్ స్టేషన్లను ‘చైల్డ్ ఫ్రెండ్లీ’గా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఏర్పాటైన మొత్తం చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ల సంఖ్య 126కు చేరుకుంది.
సాంస్కృతిక నివేదిక విడుదల...
కరోనా మహమ్మారి కారణంగా 2020, మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో సంస్థలోని ఉద్యోగులకు, పై అధికారులకు మధ్య సమన్వయం తగ్గుతోందని ‘2022 అంతర్జాతీయ సాంస్కృతిక నివేదిక’ అనే పరిశోధనలో తేలింది. ఓ సీ ట్యానర్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల నుంచి సేకరించిన సమాచారంతో ఈ పరిశోధన వెలువడింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : త్వరలో డిజిటల్ డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
ఎక్కడ : కేరళ రాష్ట్ర వ్యాప్తంగా...
ఎందుకు : ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలైన చిన్నారులను వాటి నుంచి విడిపించేందుకు....
Jyothi Surekha: ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు సాధించిన క్రీడాకారిణి?
అమెరికాలోని యాంక్టన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. సెప్టెంబర్ 25న జరిగిన కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ భారత్‌కు మూడు రజత పతకాలను అందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్ విభాగంలో, మహిళల టీమ్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.
వ్యక్తిగత విభాగంలో...
కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో సురేఖ 144–146 పాయింట్ల తేడాతో సారా లోపెజ్ (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. ఫలితంగా రజతం దక్కించుకుంది.
ప్రపంచ రికార్డు...
కాంపౌండ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో సురేఖ 150–144తో అమందా మ్లినారిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. 150కి 150 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో లిండా అండర్సన్ (అమెరికా; 2018లో), సారా లోపెజ్ (కొలంబియా; 2013, 2021లో) మాత్రమే 150కి 150 పాయింట్లు స్కోరు చేశారు.
టీమ్ విభాగం ఫైనల్లో...
కాంపౌండ్ మహిళల టీమ్ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్‌లతో కూడిన భారత జట్టు 224–229 పాయింట్ల తేడాతో సారా లోపెజ్, అలెజాంద్రా ఉస్కియానో, నోరా వాల్దెజ్‌లతో కూడిన కొలంబియా జట్టు చేతిలో ఓటమి చవిచూసింది.
మిక్స్‌డ్ ఫైనల్లో...
కాంపౌండ్ మిక్స్‌డ్ ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జంట ఫైనల్లో 150–154 పాయింట్ల తేడాతో సారా లోపెజ్–డానియల్ మునోజ్ (కొలంబియా) జోడీ చేతిలో పరాజయంపాలైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు సాధించిన భారత క్రీడాకారిణి?
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : వెన్నం జ్యోతి సురేఖ
ఎక్కడ : యాంక్టన్, అమెరికా
Tennis: ఒస్ట్రావా ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జోడి?
భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2021 ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. చెక్ రిపబ్లిక్‌లోని ఒస్ట్రావా నగరంలో సెప్టెంబర్ 26న ముగిసిన ఒస్ట్రావా ఓపెన్ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–500 టోర్నీలో చైనా భాగస్వామి ష్వై జాంగ్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్ సానియా–ష్వై జాంగ్ ద్వయం 6–2, 6–2తో మూడో సీడ్ కైట్లిన్ క్రిస్టియన్ (అమెరికా)–ఎరిన్ రౌట్లిఫ్ (న్యూజిలాండ్) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా –ష్వై జాంగ్ జోడీకి 25,230 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 62 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
తాజా విజయంతో 34 ఏళ్ల సానియా తన కెరీర్‌లో 43వ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. చివరిసారి 2020 జనవరిలో హోబర్ట్ ఓపెన్‌లో నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి టైటిల్ నెగ్గిన సానియా ఖాతాలో చేరిన మరో డబుల్స్ టైటిల్ ఇదే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒస్ట్రావా ఓపెన్ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–500 టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన జోడి?
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : సానియా మీర్జా(భారత్), ష్వై జాంగ్(చైనా)
ఎక్కడ : ఒస్ట్రావా, చెక్ రిపబ్లిక్
ఎందుకు : ఫైనల్లో రెండో సీడ్ సానియా–ష్వై జాంగ్ ద్వయం 6–2, 6–2తో మూడో సీడ్ కైట్లిన్ క్రిస్టియన్ (అమెరికా)–ఎరిన్ రౌట్లిఫ్ (న్యూజిలాండ్) జంటపై విజయం సాధించినందున...
Formula One Race: రష్యా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్?
2021 ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌లో 15 రేసు ‘‘రష్యా గ్రాండ్‌ప్రి’’లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. రష్యాలోని సోచిలో సెప్టెంబర్ 26న జరిగిన ఈ రేసులో 53 ల్యాప్‌ల ప్రధాన రేసును హామిల్టన్ గంటా 30 నిమిషాల 41.001 సెకన్లలో పూర్తి చేసి చాంపియన్‌గా అవతరించాడు. దీంతో హామిల్టన్ తన కెరీర్‌లో 100వ రేసు విజయాన్ని అందుకున్నాడు. రెండో స్థానంలో వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్)... మూడో స్థానంలో కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) నిలిచారు.
బిగ్‌బాష్ లీగ్ ఏ క్రీడకు సంబంధించింది?
మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్‌లో భారత క్రికెటర్లు స్మృతి మంధాన, ఆల్‌రౌండర్
దీప్తి శర్మ డిఫెండింగ్ చాంపియన్ ‘సిడ్నీ థండర్’ తరఫున ఆడనున్నారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న ఇంగ్లండ్ ప్లేయర్లు హీతర్ నైట్, టామీ బీమండ్ స్థానాల్లో వీరికి చోటు దక్కింది. ఆస్ట్రేలియా దేశానికి చెందిన బిగ్‌బాష్ టి20 లీగ్‌ను 2011 ఏడాదిలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రష్యా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్?
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : సోచి, రష్యా
Cyclone Gulab: తీవ్ర తుపాను ‘గులాబ్’ తీరం దాటిన ప్రాంతం?
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 25న ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘గులాబ్’ తుపానుగా మారింది. ఈ తుపాను పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరప్రాంతాల్లోని కలింగపట్నం, గోపాల్‌పూర్ మధ్యలో సెప్టెంబర్ 26న తీరం దాటింది. తీరాన్ని తాకిన తుపాన్ అనంతరం కళింగపట్నానికి పశ్చిమంగా ఒడిశా వైపు పయనిస్తూ తీరం దాటింది. ఈ తుపాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహించే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో కలింగపట్నం ఉండగా, ఒడిశాలోని గంజాం జిల్లాలో గోపాల్‌పూర్ ఉంది.
- హుద్‌హుద్ తుపాను వేగం గంటకు 215 కి.మీ
- తిత్లీ తుపాను వేగం గంటకు 195 కి.మీ
- గులాబ్ తుపాను వేగం గంటకు 90 కి.మీ
చైనాలో ఏర్పడే తపాన్లను ఏమిని పిలుస్తారు?
అమెరికాలో తుపాన్లను టోర్నెడోలని, చైనాలో ఏర్పడే వాటిని టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే వాటిని సైక్లోన్స్ అని పిలుస్తారు. అలాగే ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుపాన్లను విల్లీవిల్లీస్, వెస్ట్ ఇండీస్ దీవుల్లోని తుపాన్లను హరికేన్స్ అంటారు.
Artefacts & Antiquities: 157 పురాతన కళాఖండాలను భారత్‌కు అప్పగించిన దేశం?
భారత్‌కు చెందిన 157 పురాతన కళాఖండాలను అమెరికా ప్రభుత్వం... భారత్‌కు అప్పగించింది. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి సెప్టెంబర్ 25న వీటిని అందించింది. పురాతన వస్తువుల దొంగతనం, అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని, ప్రయత్నాలను బలోపేతం చేద్దామని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నారు.
లోహ, రాతి విగ్రహాలు...
అమెరికా అప్పటించిన కళాఖండాల్లో 71 భారత ప్రాచీన సంస్కృతికి చెందినవి కాగా, 60 హిందూమతానికి, 16 బౌద్ధమతానికి, 9 జైనమతానికి చెందినవి ఉన్నాయి. అక్రమరవాణాదారులు వీటిని గతంలో భారత్‌లో దొంగిలించి, అంతర్జాతీయ స్మగ్లర్లకు అమ్మేశారు. పలువురి చేతులు మారి చివరకు అమెరికాకు చేరుకున్నాయి. ఇందులో 10వ, 11వ శతాబ్దానికి చెందిన విలువైన లోహ, రాతి విగ్రహాలు సైతం ఉన్నాయి.
మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (యూఎన్‌ఎస్‌సీ) భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ అంశంలో భారత్‌కు అమెరికా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పారు. భారత్‌ను న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో (ఎన్‌ఎస్‌జీ)లో చేర్చాలని అన్నారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
Tourism Excellence Awards: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కృషిచేస్తున్న ఆ రంగ భాగస్వాములకు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 27న టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులను అందించనున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. 2021 సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 26న పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించారు.
ఏటా సెప్టెంబర్ 27న...
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 27న పాటిస్తారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు 1980 ఏడాది నుంచి పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ సమాజంలో పర్యాటక పాత్ర మీద అవగాహన పెంచడం మరియు అది ప్రపంచవ్యాప్తంగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను ఎలా ప్రభావితం చేసిందో చూపటమే ప్రపంచ పర్యాటక దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
ఏఎన్‌యూకి గ్రీన్ యూనివర్సిటీ అవార్డు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి గ్రీన్ యూనివర్సిటీ అవార్డు లభించింది. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా సెప్టెంబర్ 25న వర్చువల్ విధానంలో జరిగిన ఐదో ఎన్‌వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో ఏఎన్‌యూకి అవార్డును ప్రకటించారు. భారతదేశం నుంచి ఐదు యూనివర్సిటీలు ఈ అవార్డును పొందాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సెప్టెంబర్ 27న టీఎస్ టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : తెలంగాణ పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఎందుకు : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని...
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 25 కరెంట్ అఫైర్స్