Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 25 కరెంట్‌ అఫైర్స్‌

C-295 aircrafts

Defence Deal: సీ–295 విమానాల కొనుగోలుకు భారత్‌ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?

అత్యాధునిక సీ–295 సైనిక రవాణా విమానాల కొనుగోలు కోసం భారత రక్షణ శాఖ... ప్రఖ్యాత ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ సంస్థతో సెప్టెంబర్‌ 24న ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు రూ.20వేల కోట్లతో 56 విమానాలను కొనుగోలుచేయనుంది. అవ్రో–748 ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్థానంలో సీ–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రవేశపెట్టనున్నారు.

టీఏఎస్‌ఎల్‌ భాగస్వామ్యంతో...
ఒప్పందంలో భాగంగా... ఎయిర్‌బస్‌ సంస్థ మొదట 16 విమానాలను స్పెయిన్‌లోని సెవిల్లేలో తయారు చేసి, ‘ఫ్లై–అవే’ కండీషన్‌లో భారత రక్షణ శాఖకు అప్పగిస్తుంది. మిగిలిన 40 విమానాలను భారత్‌లో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌(టీఏఎస్‌ఎల్‌) భాగస్వామ్యంతో తయారు చేస్తుంది. ఒక ప్రైవేట్‌ సంస్థ భారత్‌లో మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తుండడం ఇదే తొలిసారి. 16 ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారత రక్షణ శాఖకు అందజేస్తామని ఎయిర్‌బస్‌ ప్రకటించింది. భారత్‌లోనే అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సూట్‌(ఈడబ్ల్యూఎస్‌)ను అన్ని విమానాల్లో అమర్చనున్నట్లు తెలిపింది.

ఏరోస్పేస్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి...
భారత్‌లో ఏరోస్పేస్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి తాజా ఒప్పందం మద్దతుగా నిలుస్తుందని ఎయిర్‌బస్‌ సీఈఓ మిఖాయిల్‌ షోయిల్‌హర్న్‌ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో భారత్‌లో వచ్చే పదేళ్లలో 15,000 మందికి ప్రత్యక్షంగా, మరో 10,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.

ఏమిటీ సీ–295?
సైనికుల చేరవేతకు, ఆయుధాలు, సైనిక సామగ్రి రవాణా కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. ఈ విమానాల నుంచి పారచూట్ల ద్వారా సైనికులను, సరుకులను నేలపైకి క్షేమంగా దింపవచ్చు. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలతోపాటు సముద్రాలపై పెట్రోలింగ్‌ కోసం వాడొచ్చు. యుగోస్లావియా, అఫ్గానిస్తాన్, ఇరాక్, లెబనాన్‌ తదితర దేశాల్లో కీలక ఆపరేషన్లలో ఈ విమానాలు పాల్గొన్నాయి. ప్రపంచంలో ఈ విమానాల 35వ ఆపరేటర్‌గా భారత వైమానిక దళం రికార్డుకెక్కనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 56 సీ–295 సైనిక రవాణా విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ సంస్థతో ఒప్పందం 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 24
ఎవరు    : భారత రక్షణ శాఖ
ఎందుకు  : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు...


India-USA: నరేంద్ర మోదీ, జో బైడెన్‌ తొలిసారి ఏ నగరంలో సమావేశమయ్యారు?

Modi-Biden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌లో సెప్టెంబర్‌ 24న జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక బంధాల బలోపేతం, ఇండో–పసిఫిక్, వాతావరణ మార్పు, వాణిజ్యం, కోవిడ్‌తో సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. గతంలో బైడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒకసారి మోదీతో భేటీ అయ్యారు. ఆయన అధ్యక్షుడయ్యాక పలుమార్లు ఫోన్లలో, ఆన్‌లైన్‌ సమావేశాల్లో సంభాషించుకున్నా, ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. ప్రధాని పదవి స్వీకరించాక మోదీ అమెరికా సందర్శించడం ఇది ఏడవసారి.

కమలకు తాతయ్య జ్ఞాపకం
ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అరుదైన జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చారు. కమల తాతయ్య, తమిళనాడుకు చెందిన పి.వి. గోపాలన్‌కు సంబంధించిన ఒక పాత నోటిఫికేషన్‌ను హస్తకళా నిపుణులు తయారు చేసిన కలప ఫ్రేమ్‌లో పెట్టి బహుమానంగా ఇచ్చారు.

జపాన్‌ ప్రధాని సుగాతో ముఖాముఖి
భారత ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగాతో వాషింగ్టన్‌లో సెప్టెంబర్‌ 24న ముఖాముఖి చర్చలు జరిపారు. అఫ్గానిస్తాన్‌ సంక్షోభం, ఇండో పసిఫిక్‌ ప్రాంతం, రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకారం వంటి అంశాలపై వారు చర్చించారు. క్వాడ్‌ సదస్సులో పాల్గోనేందుకు ఇరువురు నేతలు వాషింగ్టన్‌ వచ్చిన విషయం తెల్సిందే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 24
ఎవరు    : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు  : ద్వైపాక్షిక బంధాల బలోపేతం, ఇండో–పసిఫిక్, వాతావరణ మార్పు, వాణిజ్యం, కోవిడ్‌తో సహా పలు అంశాలపై చర్చలు జరిపేందుకు...


ABC: ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్యులేషన్స్‌ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?

Debabrata Mukherjee

2021–2022 ఏడాదికిగాను ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్యులేషన్స్‌(ఏబీసీ) చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌కు చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనరల్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, సేల్స్‌ ఆపరేషన్స్, బిజినెస్‌ స్ట్రాటజీ, ఇన్నోవేషన్‌ ఇలా పలు విభాగాల్లో ఆయనకు 27 ఏళ్లకుపైగా సుదీర్ఘ అనుభవం ఉంది. మరోవైపు ఏబీసీ కౌన్సిల్‌ పబ్లిషర్‌ సభ్యులైన ప్రతాప్‌ జి. పవార్‌.. ఏబీసీ డెప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఏబీసీ సెక్రటరీ జనరల్‌గా హార్ముజ్‌ మాసాని కొనసాగనున్నారు.

దేశంలోని వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లతో సహా ప్రధాన ప్రచురణల సర్క్యులేషన్‌లను ధృవీకరించడం, ఆడిట్‌ చేయడం వంటి పనులను ఏబీసీ నిర్వహిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : 2021–2022 ఏడాదికిగాను ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్యులేషన్స్‌(ఏబీసీ) చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్‌ 24
ఎవరు : యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌కు చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ దేబబ్రత ముఖర్జీ
ఎందుకు  : ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్యులేషన్స్‌(ఏబీసీ) కార్యాకలాపాల నిర్వహణ కోసం...


Daikin Company: రాష్ట్రంలోని ఏ జిల్లాలో డైకిన్‌ యూనిట్‌ ఏర్పాటు కానుంది?

Daikin Company

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐఎస్‌–ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌) కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి జపాన్‌ ముందుకొచ్చింది. ఆ దేశానికి చెందిన డైకిన్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ డైకిన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో ఎయిర్‌ కండిషనింగ్, విడిభాగాల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు నిర్ణయించింది.

చిత్తూరు జిల్లా శ్రీసిటీలో...
చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని పారిశ్రామికవాడ శ్రీసిటీలో 75.5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో డైకిన్‌ యూనిట్‌ ఏర్పాటుకానుంది. ఈ మేరకు అక్కడ భూమి కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. శ్రీసిటీలో సెప్టెంబర్‌ 24న జరిగిన కార్యక్రమంలో డైకిన్‌ ఇండియా ఎండీ, సీఈఓ కన్వల్‌జీత్‌ జావాతోపాటు శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

తొలి కంపెనీగా... 
పీఎల్‌ఐ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చిన తొలి కంపెనీగా డైకిన్‌ రికార్డు సృష్టించింది. ఎయిర్‌ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్‌ రంగంలో డైకిన్‌ గ్రూప్‌ ప్రపంచ ఖ్యాతి పొందింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఎయిర్‌ కండిషనింగ్, విడిభాగాల తయారీ యూనిట్‌ ఏర్పాటు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 24
ఎవరు    : జపాన్‌కి చెందిన డైకిన్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ డైకిన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌  
ఎక్కడ     : శ్రీసిటీ, తిరుపతికి సమీపం, చిత్తూరు జిల్లా,  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం


Stock Market: మార్కెట్‌ విలువలో భారతదేశ స్థానం ఎంత?

BSE
ఫైల్ ఫొటో

భారత స్టాక్‌ మార్కెట్లో సెప్టెంబర్‌ 24న సరికొత్త రికార్డు నమోదైంది. సెన్సెక్స్‌ సూచీ తన 42 ఏళ్లలో సుధీర్ఘ ప్రయాణంలో తొలిసారి 60 వేల మైలురాయిని అధిగమించింది. సెప్టెంబర్‌ 24న... సెన్సెక్స్‌ 163 పాయింట్ల లాభంతో 60,048 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 17,853 వద్ద స్థిరపడింది. ఈ విషయమై బీఎస్‌ఈ ఎండీ, సీఈవో అశిష్‌కుమార్‌ చౌహాన్‌ మాట్లాడుతూ... ‘‘సెన్సెక్స్‌ 60,000 స్థాయిని అందుకోవడమనేది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోంది. కోవిడ్‌ సమయంలో సంపన్న దేశాలు అనుసరించిన సరళీకృత ద్రవ్యపాలసీ విధాన వైఖరి, వడ్డీరేట్ల సడలింపు తదితర అవకాశాలను అందిపుచ్చుకున్న భారత్‌ ప్రపంచంలో ఆర్థిక అగ్రగామి రాజ్యంగా ఎదుగుతోంది.’’ అని పేర్కొన్నారు.

మార్కెట్‌ విలువలో ఆరో స్థానానికి భారత్‌
అమెరికా     51 ట్రిలియన్‌ డాలర్లు
చైనా 12 ట్రిలియన్‌ డాలర్లు
జపాన్‌     7 ట్రిలియన్‌ డాలర్లు
హాంకాంగ్‌ 6 ట్రిలియన్‌ డాలర్లు
బ్రిటన్‌     3.6 ట్రిలియన్‌ డాలర్లు
భారత్‌ 3.54 ట్రిలియన్‌ డాలర్లు
ప్రాన్స్‌ 3.41 ట్రిలియన్‌ డాలర్లు


Quad Summit 2021: ప్రస్తుతం జపాన్‌ దేశ ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు?

అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌లో సెప్టెంబర్‌ 24న క్వాడ్‌(Quadrilateral Security Dialogue-Quad) శిఖరాగ్ర సదస్సు–2021 జరిగింది. నాలుగు దేశాల కూటమైన (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) క్వాడ్‌ సదస్సులో... స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్‌ విధానంపై, అంతర్జాతీయ భద్రత, వాతావరణ మార్పులు, కోవిడ్‌పై పోరాటం, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం వంటి కీలకం అంశాలపై చర్చలు జరిపారు. సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగా పాల్గొన్నారు.

ప్రస్తుతం దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
గత వైరి వైషమ్యాలను పక్కనబెట్టి స్నేహభావంతో ముందుకొస్తే దక్షిణ కొరియా చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ సెప్టెంబర్‌ 24న ప్రకటించారు. ఉభయ కొరియాలపై ఇకనైనా యుద్ధమేఘాలు తొలగిపోయి శాంతి కపోతాలు ఎగరాలని తాజా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ద.కొరియా అధ్యక్షుడు మూన్‌ జె ఇన్‌ వ్యాఖ్యానించడంతో ఉ.కొరియా తాజాగా స్పందించింది.

దక్షిణ కొరియా...
రాజధాని: సియోల్‌; కరెన్సీ: సౌత్‌ కొరియన్‌ వన్‌

ఉత్తర కొరియా...
రాజధాని: ప్యాంగ్‌ యాంగ్‌; కరెన్సీ: నార్త్‌ కొరియన్‌ వన్‌

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : క్వాడ్‌(Quadrilateral Security Dialogue-Quad) శిఖరాగ్ర సదస్సు–2021
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 24
ఎవరు    : భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగా
ఎక్కడ  : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్‌ విధానంపై, అంతర్జాతీయ భద్రత, వాతావరణ మార్పులు, కోవిడ్‌పై పోరాటం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు...


Dav Whatmore: విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ ఏ క్రీడకు చెందినది?

Dav Whatmore

వచ్చే దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ కోసం బరోడా జట్టు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, విఖ్యాత కోచ్‌ డేవ్‌ వాట్‌మోర్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని బరోడా క్రికెట్‌ సంఘం సెప్టెంబర్‌ 24న ధ్రువీకరించారు. 67 ఏళ్ల వాట్‌మోర్‌ 1996 వన్డే ప్రపంచకప్‌ సాధించిన శ్రీలంక జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, సింగపూర్, నేపాల్‌ జాతీయ జట్లకు... భారత్‌లో కేరళ రంజీ జట్టుకు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.

కొన్ని క్రికెట్‌ టోర్నమెంట్‌ల పేర్లు...
రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ, దేవ్‌ధర్‌ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ, ఎన్‌కేపీ సాల్వే ట్రోఫీ, కల్నల్‌ సి.కె.నాయుడు ట్రోఫీ, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌), ఐసీసీ క్రికెట్‌ ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, చాంపియన్స్‌ లీగ్‌ టీ20, చాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్, యాషెస్, కూచ్‌ బిహార్‌ ట్రోఫీ, మెయినుద్దౌలా కప్, విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ, విజ్జీ ట్రోఫీ, శీష్‌ మహల్‌ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : బరోడా క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా నియామకం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 24
ఎవరు    : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, విఖ్యాత కోచ్‌ డేవ్‌ వాట్‌మోర్‌ 
ఎందుకు : వచ్చే దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ కోసం...


MeitY-AISPL: కేంద్ర ఐటీ శాఖతో ఒప్పందం చేసుకున్న సంస్థ?

Startup HUB

దేశీయంగా సాంకేతిక ఆవిష్కరణలకు, స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) స్టార్టప్‌ హబ్‌తో అమెజాన్‌ ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ (ఏఐఎస్‌పీఎల్‌) జట్టు కట్టింది. అధునాతన టెక్నాలజీ సామర్థ్యాలు ఉన్న స్టార్టప్‌లను గుర్తించి, సమాజానికి ఉపయోగపడే సొల్యూషన్స్‌ను రూపొందించడంలో వాటికి సహాయపడేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. దీని కింద స్టార్టప్‌లకు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) సేవలు, నిపుణుల సలహాలు, సాంకేతిక శిక్షణ మొదలైనవి లభిస్తాయి. ప్రస్తుతం మెయిటీ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్‌ ఉన్నారు.

వరల్డ్‌ ఐజీబీసీ ఏపీఎన్‌కు వైస్‌ చైర్మన్‌గా ఆనంద్‌ 
ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ)కు చెందిన ఎం. ఆనంద్‌... వరల్డ్‌ ఐజీబీసీ ఏసియా పసిఫిక్‌ రీజినల్‌ నెట్‌వర్క్‌ (ఏపీఎన్‌) కు వైస్‌ చైర్మన్‌కు నియమితులయ్యారు. కాలుష్యరహిత, పర్యావరణానుకూల భవన నిర్మాణాలను ప్రోత్సహించడంలో వరల్డ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

బిగ్‌–సి అంబాసిడర్‌గా మహేశ్‌... 
మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ బిగ్‌–సి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేశ్‌ బాబు నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారని బిగ్‌–సి సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) స్టార్టప్‌ హబ్‌తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 24
ఎవరు    : అమెజాన్‌ ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ (ఏఐఎస్‌పీఎల్‌)
ఎందుకు : అధునాతన టెక్నాలజీ సామర్థ్యాలు ఉన్న స్టార్టప్‌లను గుర్తించి, సమాజానికి ఉపయోగపడే సొల్యూషన్స్‌ను రూపొందించడంలో వాటికి సహాయపడేందుకు...

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 24 కరెంట్‌ అఫైర్స్‌

 

Published date : 25 Sep 2021 07:12PM

Photo Stories