Skip to main content

స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అతి పెద్ద యుద్ధ నౌక?

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్‌ (ఇండిజినస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌–ఐఏసీ) సేవలందించేందుకు సిద్ధమవుతోంది.
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ సమీపంలో ఆగస్టు 4న నిర్వహించిన సీట్రయల్స్‌ విజయవంతం అయ్యాయి. దీంతో సొంతంగా విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాల సరసన భారత్‌ నిలిచింది. అన్ని స్థాయిల్లో సామర్థ్య పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్నాక 2022 మార్చినాటికల్లా తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్‌ సేవలందించనుంది. భారత్‌లో నిర్మించిన అతి పెద్ద, అనేక ప్రత్యేకతలున్న యుద్ధనౌక ఇదే.

విక్రాంత్‌ నౌక పేరునే...
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్‌ క్లాస్‌ నౌక ఇది. 1997లో విక్రాంత్‌ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో విక్రాంత్‌ యుద్ధ విమాన వాహక నౌక సన్నద్ధమైంది. ఈ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 1999లో ఇండియన్‌ నేవీకి చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ సంస్థ నౌక డిజైన్‌ మొదలు పెట్టగా.. కొచ్చి షిప్‌యార్డులో 2009లోనే కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్‌ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్‌ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ఏడాది క్రితం బేసిన్‌ ట్రయల్స్‌ పూర్తి చేశారు.

‘విక్రాంత్‌’ విశ్వరూపం
  • పొడవు : 262 మీటర్లు
  • వెడల్పు : 62 మీటర్లు
  • ఎత్తు : 59 మీటర్లు
  • బరువు : దాదాపు 40వేల టన్నులు
  • నిర్మాణశైలి : 5 సూపర్‌స్ట్రక్చర్లు, 14 డెక్‌లు
  • ఓడలో కంపార్ట్‌మెంట్‌లు : 2,300
  • మహిళా క్యాబిన్‌ : 2
  • సిబ్బంది : 1,700 మందికి పైగా
  • రన్‌వేలు : 2 రన్‌వేలు
  • ల్యాండింగ్‌ స్ట్రిప్‌ : ఒకటి
  • వేగం : 28 నాటికల్‌ మైళ్ల సామర్థ్యం; 18 నాటికల్‌ మైళ్ల వేగంతో 7,500 నాటికల్‌ మైళ్లు
  • సత్తా ఎంత : 30 విమానాలను మోసుకెళ్లగలదు
  • నిర్మాణంలో పాలుపంచుకున్నవారు : 14,000 మంది సిబ్బంది, ఉద్యోగులు
  • ఏఏ విమానాలుంటాయి : 26 వరకూ మిగ్‌–29కే యుద్ధ విమానాలు, కమోవ్‌ విమానాలు/హెలికాప్లర్లను ఏకకాలంలో తీసుకెళ్లగలదు.
  • టర్బైన్లు : 4 ఎల్‌ఎం2,500ప్లస్‌ గ్యాస్‌ టర్బైన్లు
  • టర్బైన్ల సామర్థ్యం : 80 మెగావాట్లు
  • నిర్మాణ వ్యయం : దాదాపు రూ. 23 వేల కోట్లు
  • ప్రత్యేకత : మిగ్‌29కే విమానాలకు అనువైన డెక్‌
  • మరో ప్రత్యేకత: చిన్న నగరానికి సరిపడా విద్యుత్‌ని ఉత్పత్తి చెయ్యగల టర్బైన్లు
Published date : 05 Aug 2021 06:02PM

Photo Stories