షెడ్యూల్ ప్రకారమే టి20 ప్రపంచకప్
షెడ్యూల్ ప్రకారమే (అక్టోబర్ 18 నుంచి) పొట్టి ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పుచేర్పులు లేవని ఐసీసీ ఏప్రిల్ 23న ప్రకటించింది. 12 మంది శాశ్వత సభ్య దేశాలు, 3 అసోసియేట్ బోర్డులకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో ఏప్రిల్ 23న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కరోనా నేపథ్యంలో క్రికెట్‌ను మళ్లీ దారిలో పెట్టేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడంపై ఇందులో చర్చ జరిగింది.
టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయం
కరోనా కారణంగా ఇప్పటికే వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి వాయిదా వేసే ప్రసక్తే లేదని ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ స్పష్టం చేశారు. 2021 ఏడాది జూలై 23వ తేదీనే ఒలింపిక్స్ ప్రారంభమవుతాయని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 వ్యాప్తి ఇప్పటికీ నియంత్రణలోకి రాకపోవడంతో 2021లోనూ ఈ మెగా ఈవెంట్ నిర్వహణ సాధ్యం కాదంటూ పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.