Skip to main content

రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది.
దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో 6 శాతానికి దిగొచ్చాయి. ఆర్‌బీఐ కొత్త గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి భేటీలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరవ ద్వైమాసిక సమావేశం) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయాలతో ఇంటి రుణాలు, ఇతర రుణాలు చౌకగా మారడంతోపాటు ఈఎంఐల భారం తగ్గనుంది. 18 నెలల తర్వాత మళ్లీ ఆర్‌బీఐ వడ్డీ రేటను తగ్గించడం ఇదే తొలిసారి.

పాలసీ ముఖ్యాంశాలు...
  • రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. బ్యాంకు రేటు 6.5 శాతం.
  • నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో ఎలాంటి మార్పుల్లేవు. 4 శాతంగానే కొనసాగుతుంది.
  • వడ్డీ రేట్ల తగ్గింపునకు శక్తికాంతదాస్ సహా నలుగురు ఎంపీసీ సభ్యులు అనుకూలంగా ఓటు. చేతన్‌ఘటే, విరాళ్ ఆచార్య యథాతథానికి ఓటు.
  • రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2019 జనవరి-మార్చి త్రైమాసికానికి 2.8 శాతానికి తగ్గింపు. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు(ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి) 3.2-3.4 శాతంగా అంచనా. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి అంచనా 3.9 శాతం.
  • జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా ఉండొచ్చు. 2019-20లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 7.2-7.4 శాతంగాను, అక్టోబర్-డిసెంబర్ కాలానికి 7.5 శాతంగానూ ఉండొచ్చు.
  • చమురు ధరల్లో అస్పష్టత ఉండొచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి.
  • వ్యవసాయ రుణాలు, ప్రాంతీయ అసమానత, కవరేజీ విసృ్తతికి ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు.
  • రూపాయి విలువలో స్థిరత్వానికి ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్ల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.
  • కార్పొరేట్ డెట్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో ఎఫ్‌పీఐలపై ఉన్న నియంత్రణలు ఎత్తివేత.
  • పేమెంట్ గేట్‌వే సర్వీసు ప్రొవైడర్లు, పేమెంట్ అగ్రిగేటర్లకు సంబంధించి త్వరలో చర్చా పత్రం విడుదల.
  • కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతమిస్తాయి.
  • ఎన్‌బీఎఫ్‌సీల సమన్వయానికి త్వరలో మార్గదర్శకాలు.
  • ఆర్‌బీఐ తదుపరి ఎంపీసీ భేటీ వచ్చే ఏప్రిల్ 2న జరగనుంది.
  • హామీల్లేకుండా వ్యవసాయానికి ఇచ్చే రుణాల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచుతూ ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది.
  • దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) పరిధిలోని కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)లో పాల్గొనే కంపెనీలు ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ) మార్గంలో నిధుల సమీకరణకు ఆర్‌బీఐ అవకాశం కల్పించింది.
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రెపో రేటు, రివర్స్ రెపో రేటు పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
Published date : 08 Feb 2019 06:04PM

Photo Stories