Skip to main content

రాజ్యసభ 250వ సమావేశాలు ప్రారంభం

రాజ్యసభ 250వ సమావేశాలు నవంబర్ 18న ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన ప్రత్యేక చర్చలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా రాజ్యసభ పనితీరు లేదని వెంకయ్య అన్నారు. రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం, రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం వంటి అంశాల్లో రాజ్యసభకు విశేష అధికారాల్ని కట్టబెట్టాలని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
 
అద్వితీయ సభ
భారత సమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మవంటిదని, అదే ఎప్పటికీ శాశ్వతమని మోదీ అన్నారు. రాజ్యసభ సభ పేరుకే ద్వితీయ సభే కావొచ్చు. కానీ అదొక అద్వితీయ సభ అని వాజ్‌పేయి అన్న వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావించారు. ‘ఎన్సీపీ, బీజేడీ పార్టీల సభ్యులు ఎప్పుడూ వెల్‌లోకి దూసుకువెళ్లలేదు. వారు చెప్పదలచుకున్నదేదో అద్భుతంగా, సమర్థవంతంగా చెబుతారు. వారి నుంచి అన్ని పార్టీలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’ అని ఎన్సీపీ, బీజేడీ పార్టీలపై మోదీ ప్రశంసలు కురిపించారు.
 
మార్షల్స్ డ్రెస్ మారింది
రాజ్యసభ చారిత్రక 250వ సెషన్లను పురస్కరించుకొని సభలో చైర్మన్‌కు ఇరువైపులా నిలబడే మార్షల్స్ యూనిఫామ్‌ను మార్చారు. ఎప్పుడూ తెల్లటి సంప్రదాయ దుస్తులు, తలపాగాతో కనిపించే మార్షల్స్ ఈ సమావేశాల సందర్భంగా మిలటరీ దుస్తుల్ని తలపించే యూనిఫామ్ వేసుకున్నారు. ఈ దుస్తుల్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ డిజైన్ చేసింది. వేసవి కాలం సమావేశాల్లో తెల్ల రంగు యూనిఫామ్‌లోనే మార్షల్స్ కనిపిస్తారు.

పెద్దల సభ ప్రయాణం ఎలా సాగిందంటే...
  • 1952లో ఏర్పాటైన రాజ్యసభ 250 సెషన్లతో చరిత్ర సృష్టించింది.
  • ఇప్పటివరకు మొత్తం సభ్యుల సంఖ్య - 2,282
  • అత్యధిక కాలం కొనసాగిన సభ్యులు: జేడీ (యూ) సభ్యుడు మహేంద్ర ప్రసాద్ (ఏడోసారి), కాంగ్రెస్ సభ్యుడు మన్మోహన్ సింగ్ (ఆరోసారి)
  • 249 సెషన్లలో సభ జరిగిన రోజులు - 5,466
  • రాజ్యసభ ఆమోదించిన బిల్లులు - 3,817
  • పెండింగ్‌లో ఉన్న బిల్లులు - 38
  • రాజ్యసభలో వెనక్కి తీసుకున్న బిల్లులు - 104
  • రాజ్యసభ ఆమోదించినా, లోక్‌సభలో వీగిన బిల్లులు - 60
  • లోక్‌సభ ఆమోదించిన బిల్లులకు రాజ్యసభ సవరణ చేసిన బిల్లులు - 120

మహిళా సభ్యుల ప్రాతినిధ్యం
1952లో 15 మంది మహిళా సభ్యులుంటే (6.94%) 2014 నాటికి వారి సంఖ్య 31కి (12.76%) చేరుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 250 మంది సభ్యులకు గాను 26 మంది మహిళలు (10.83%)

చారిత్రక ఘట్టాలు
  • రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకే ఒక్కసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1991 ఆగస్టు 5న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలంటూ విపక్షాలు పెట్టిన తీర్మానం 39-39 ఓట్లతో టై అయింది. అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఓటు వేయడంతో ప్రతిపక్షాలు విజయం సాధించాయి.
  • రాష్ట్రపతి పాలన గడువు పెంచిన చరిత్ర కూడా పెద్దల సభకుంది. 1977లో తమిళనాడు, నాగాలాండ్, 1991లో హరియాణాలో రాజ్యసభ రాష్ట్రపతి పాలనను పొడిగించింది. అప్పట్లో లోక్‌సభ మనుగడలో లేదు.
  • రాజ్యసభ ఇప్పటికి ముగ్గురు సభ్యులను బహిష్కరించింది. 1976లో సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నారంటూ సుబ్రమణ్య స్వామిని. 2005లోప్రశ్నలకు ముడుపులు కేసులో ఛత్రపాల్ సింగ్‌ను, ఎంపీలాడ్‌‌సలో అవకతవకలకు 2006లో సాక్షి మహరాజ్‌ను సభ నుంచి బహిష్కరించింది.
Published date : 19 Nov 2019 05:01PM

Photo Stories