Skip to main content

ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ జాయెద్ పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని యూఏఈ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’తో గౌరవించారు.
యూఏఈ రాజధాని అబుధాబిలో ఆగస్టు 24న జరిగిన కార్యక్రమంలో మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నడూ లేనంత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసిన మోదీని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యూఏఈ రాజు అల్ నహ్యాన్ 2019, ఏప్రిల్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, దేశాధినేతలు, రాజులకు ఈ అవార్డును బహుకరిస్తారు.

రూపే కార్డు ప్రారంభం : యూఏఈలో ప్రధాని మోదీ భారతీయ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం రూపే కార్డును ప్రారంభించారు. దీనివల్ల ఏటా యూఏ ఈ సందర్శించే 30 లక్షల మంది భారతీయులకు లాభం కలగనుంది.

అల్ నహ్యాన్‌తో చర్చలు : యూఏఈ యువరాజు అల్ నహ్యాన్‌తో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై మోదీ చర్చించారు. యూఏఈలో మోదీ పర్యటనను పురస్కరించుకుని ‘మరోసారి రెండో సొంతింటికి వస్తున్నందుకు నా సోదరుడికి కృతజ్ఞతలు’ అని నహ్యాన్ పేర్కొన్నారు.

భారతీయులతో సమావేశం
: అబుధాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. రాజకీయ స్థిరత్వం, సానుకూల విధానాల కారణంగానే భారత్ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని ఈ సందర్భంగా మోదీ అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్డర్ ఆఫ్ జాయెద్ పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : యూఏఈ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
ఎక్కడ : అబుధాబి, యూఏఈ
ఎందుకు : రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి కృషి చేసినందుకు
Published date : 26 Aug 2019 06:15PM

Photo Stories