Skip to main content

పద్మభూషణ్‌ అవార్డీ, ఆయుర్వేద గురువు వారియర్‌ కన్నుమూత

ఆయుర్వేదంలో గురుతుల్యుడు, పద్మభూషణ్‌ అవార్డీ, కొట్టక్కల్‌ ఆర్య వైద్యశాల(కేఏఎస్‌) మేనేజింగ్‌ ట్రస్టీ అయిన డాక్టర్‌ పి.కె.వారియర్‌(100) కన్నుమూశారు.
ఇటీవలే వందో జన్మదిన వేడుకలు జరుపుకున్న వారియర్‌ జూలై 10న కేరళలోని మలప్పురంలో తుదిశ్వాస విడిచారు. శ్రీధరన్‌ నంబూద్రి, పన్నియంపిల్లి కున్హి వారియర్‌ దంపతులకు 1921 జూన్‌ 5వ తేదీన... పన్నియంపిల్లి కృష్ణకుట్టి వారియర్‌(పీకే వారియర్‌) జన్మించారు. కొట్టక్కల్‌లో విద్యాభ్యాసం చేసిన ఆయన 20 ఏళ్ల వయస్సులో కేఏఎస్‌లో చేరారు.

రాజకీయాలు సరిపోవని...
దేశ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితుడైన వారియర్‌.. ఆయుర్వేద అధ్యయనానికి స్వస్తి చెప్పి పోరాటబాట పట్టారు. అయితే, క్రియాశీల రాజకీయాలు తనకు సరిపోవని గ్రహించి అనంతరం ఆయుర్వేదం అధ్యయనానికే అంకితమయ్యారు. చదువు పూర్తయ్యాక 24 ఏళ్ల వయస్సులో కేఏఎస్‌ ట్రస్టీగా చేరారు. 119 ఏళ్ల కేఏఎస్‌ ట్రస్ట్‌ను ఆరు దశాబ్దాలపాటు నడిపి, అత్యుత్తమ సంస్థగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. జీవిత కాలంలో ఆయన దేశ, విదేశాలకు చెందిన పలువురు మాజీ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు సహా ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి చికిత్స అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1999లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్‌తో గౌరవించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : పద్మభూషణ్‌ అవార్డీ, ఆయుర్వేద గురువు, కేఏఎస్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కన్నుమూత
ఎప్పుడు : జూలై 10
ఎవరు : డాక్టర్‌ పీకే వారియర్‌(100)
ఎక్కడ : మలప్పురం, కేరళ
ఎందుకు : వయోభారం కారణంగా...
Published date : 13 Jul 2021 05:10PM

Photo Stories