Skip to main content

మిజోరం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఏపీ బీజేపీ నేత?

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ సీనియర్‌ నేత డాక్టర్‌ కంభంపాటి హరిబాబు మిజోరం రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు.

Current Affairs

ఈ మేరకు మిజోరం సహా 8 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జూలై 6న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు గవర్నర్లుగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం...

పిళ్లై స్థానంలో కంభంపాటి...
మిజోరం ప్రస్తుత గవర్నర్‌ శ్రీధరన్‌ పిళ్లై స్థానంలో కంభంపాటి హరిబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో 1953 జూన్‌ 15న జన్మించిన కంభంపాటి... విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ పూర్తి చేశారు. ఏయూ నుంచే పీహెచ్‌డీ పట్టా పొంది అక్కడే అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1993లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. 1993–2003 మధ్య బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 1999లో విశాఖ–1 (ప్రస్తుతం విశాఖ దక్షిణ నియోజకవర్గం) నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీగా గెలుపొందారు.

కర్ణాటక గవర్నర్‌గా గెహ్లాట్‌...
కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో... కేంద్ర సామాజిక న్యాయమంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. వాజుభాయ్‌ వాలా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్య సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న గెహ్లాట్‌ రాజ్యసభలో సభా నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.

హిమాచల్‌ గవర్నర్‌గా రాజేంద్ర...
హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ నియమితులయ్యారు. బండారు దత్తాత్రేయ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన గోవా బీజేపీ నేత. ఆ రాష్ట్ర మంత్రిగా, శాసనసభ సభాపతిగా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడిగా ఉన్న 67 ఏళ్ల అర్లేకర్‌ 1989లో బీజేపీలోకి వచ్చి క్రియాశీలకంగా ఉన్నారు.

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఛగన్‌భాయ్‌..
గుజరాత్‌ మాజీ మంత్రి, గిరిజన నేతగా ఉన్న మంగూభాయ్‌ ఛగన్‌భాయ్‌ పటేల్‌ మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న పటేల్‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. యూపీ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్‌ పటేల్‌ ఇప్పటివరకు అదనంగా మధ్యప్రదేశ్‌ బాధ్యతలు నిర్వహించారు.

హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ...
  • ఇప్పటివరకు హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయకు స్థానచలనం కలిగింది. ఆయన హరియాణా గవర్నర్‌గా నియమితుల య్యారు.
  • హరియాణా గవర్నర్‌గా ఉన్న సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్యను త్రిపుర గవర్నర్‌గా నియమించారు.
  • త్రిపుర గవర్నర్‌గా ఉన్న రమేశ్‌ బియాస్‌ను జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమించారు.
  • ఇప్పటివరకు మిజోరం గవర్నర్‌గా ఉన్న శ్రీధరన్‌ పిళ్లైని గోవా గవర్నర్‌గా నియమించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : మిజోరం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఏపీ బీజేపీ నేత?
ఎప్పుడు : జూలై 6
ఎవరు : డాక్టర్‌ కంభంపాటి హరిబాబు
ఎందుకు : ఇప్పటివరకు మిజోరం గవర్నర్‌గా ఉన్న శ్రీధరన్‌ పిళ్లైని గోవా గవర్నర్‌గా నియమితులవడంతో...
Published date : 07 Jul 2021 05:22PM

Photo Stories