Skip to main content

మైకేల్ షుమాకర్ రికార్డును సమం చేసిన బ్రిటన్ డ్రైవర్?

టర్కీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్(బ్రిటన్) నిలిచాడు.
Current Affairs

టర్కీలోని ఇస్తాంబుల్‌లో నవంబర్ 15న జరిగిన ఈ రేసులో నిర్ణీత 58 ల్యాప్‌ల దూరాన్ని ఆరో స్థానం నుంచి ప్రారంభించిన హామిల్టన్ అందరికంటే వేగంగా గంటా 42 నిమిషాల 19.313 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. ఈ గెలుపుతో సీజన్‌లో మరో మూడు రేసులు మిగిలి ఉండగానే 35 ఏళ్ల హామిల్టన్ ‘‘ఎఫ్1 డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్’’నూ సొంతం చేసుకున్నాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది ఏడో ప్రపంచ టైటిల్. తద్వారా ఏడు ప్రపంచ టైటిల్స్‌తో మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును హామిల్టన్ సమం చేశాడు.

అత్యధికసార్లు ఎఫ్1 రేసుల్లో విజేతగా...
2020 ఎఫ్1 సీజన్‌లో హామిల్టన్‌కి టర్కీ గ్రాండ్‌ప్రి టైటిల్ పదో విజయంకాగా... కెరీర్‌లో 94వ విజయం.

  • టర్కీ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ తర్వాత సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్) రెండో స్థానంలో... సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు.
  • మొత్తం 17 రేసుల 2020 సీజన్‌లో 14 రేసులు పూర్తయ్యాక... హామిల్టన్ 307 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.
  • 197 పాయింట్లతో బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానంలో... 170 పాయింట్లతో వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో ఉన్నారు.
  • సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి నవంబర్ 29న జరుగుతుంది.
  • ఇటీవలే అత్యధికసార్లు ఎఫ్1 రేసుల్లో విజేతగా నిలిచిన షుమాకర్ (91 సార్లు) రికార్డును హామిల్టన్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.


అత్యధిక ఎఫ్1 ప్రపంచ టైటిల్స్ నెగ్గిన డ్రైవర్లు...

  • హామిల్టన్ (బ్రిటన్-7): 2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020
  • షుమాకర్ (జర్మనీ-7) : 1994, 1995, 2000, 2001, 2002, 2003, 2004
  • ఫాంగియో (అర్జెంటీనా-5): 1951, 1954, 1955, 1956, 1957
  • అలైన్ ప్రాస్ట్ (ఫ్రాన్స్-4) : 1985, 1986, 1989, 1993
  • సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ-4): 2010, 2011, 2012, 2013

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఏడు ఎఫ్1 ప్రపంచ టైటిల్స్‌తో మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : ఇస్తాంబుల్, టర్కీ
Published date : 16 Nov 2020 05:54PM

Photo Stories