Skip to main content

కీలక పాలసీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 35 బేసిస్ పాయింట్లను తగ్గించింది.
దీంతో రెపో రేటు 5.40 శాతానికి, రివర్స్ రెపో 5.15 శాతానికి దిగొచ్చాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న జరిగిన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపుతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గడంతోపాటు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం కూడా తగ్గనుంది.

పాలసీ ముఖ్యాంశాలు...
  • రెపో రేటు 5.75 శాతం నుంచి 5.40 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 5.50 శాతం నుంచి 5.15 శాతానికి తగ్గింపు.
  • జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గింపు.
  • నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు 5.65 శాతంగా ఉన్నాయి.
  • ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో ఇద్దరు 25 బేసిస్ పాయింట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేయగా, నలుగురు 35 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపారు.
  • వినియోగధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ త్రైమాసికానికి 3.1 శాతంగా, ఆ తర్వాత రెండు త్రైమాసికాల్లో 3.5-3.7 శాతం మధ్య ఉండొచ్చని ఎంపీసీ అంచనా వేసింది. మొత్తం మీద 12 నెలల కాలానికి 4 శాతం లక్ష్యం పరిధిలోనే ద్రవ్యోల్బణం ఉంటుందని పేర్కొంది.
  • చెల్లింపుల మోసాల సమాచారాన్ని తెలియజేసేందుకు కేంద్రీకృత రిజిస్ట్రీ ఏర్పాటుకు నిర్ణయం. ఆర్థిక మోసాలు జరిగితే ఇది సత్వరమే స్పందిస్తుంది.
  • గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆర్‌బీఐ 1.1% రెపో రేటును తగ్గించడం విశేషం.
  • 2010 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఇంత తక్కువ స్థాయికి రావడం ఇదే తొలిసారి.
  • 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా నాలుగు సార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి.
  • దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే ఉన్నాయి. అంతర్జాతీయ మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వృద్ధి తగ్గే రిస్క్‌ను పెంచుతున్నాయి.

Current Affairs


ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటు తగ్గింపు
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ
Published date : 08 Aug 2019 05:52PM

Photo Stories