Skip to main content

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అస్తమయం

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత, స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణకు ఆద్యుడు అరుణ్ జైట్లీ (66) ఇకలేరు.
 కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఏయిమ్స్‌లో ఆగస్టు 24న కన్నుమూశారు. ఆగస్టు 25న ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జైట్లీ భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి.

ఢిల్లీలో 1952, డిసెంబర్ 28న మహరాజ్ కిషన్ జైట్లీ, రతన్ ప్రభ దంపతులకు అరుణ్ జైట్లీ జన్మించారు. ఆయన తండ్రికి ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులున్న న్యాయవాదిగా గుర్తింపుఉంది. చిన్నప్పటి నుంచి చర్చాగోష్టుల్లో పాల్గొనటాన్ని ఇష్టపడే అరుణ్ జైట్లీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేశారు. 1975లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పాల్గొన్నారు. దాదాపు 19 నెలలు జైల్లో ఉన్నారు. 1980లో జనసంఘ్(బీజేపీ)లో చేరారు. పార్టీ తరఫున ఎన్నో కేసులు వాదించారు. న్యాయపరమైన అంశాలపై ఎన్నో పుస్తకాలను రాశారు.

లోక్‌సభకు ఎన్నిక కాలేదు...
ఎంతో రాజకీయ అనుభవం ఉన్న జైట్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ నెగ్గలేదు. ఒక్కసారీ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కసారి పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్‌ను ఎదుర్కోలేక ఓడిపోయారు.

జైట్లీ పదవుల ప్రస్థానం
  • 1974లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ నేతగా ఎన్నిక
  • 1977లో ఏబీవీపీ యువమోర్చా కన్వీనర్.. ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా నియామకం.
  • 1989లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు
  • 1991 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు.
  • 1999లో వాజపేయి హయాంలో న్యాయశాఖ, సమాచార శాఖ, వాణిజ్యం కార్పొరేట్ వ్యవహారాల శాఖలను నిర్వహించారు.
  • 2009-14 మధ్య రాజ్యసభలో విపక్ష నేత
  • 2002 జూలైలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ కార్యదర్శిగా, ప్రధాన ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు.
  • 2003లో వాజ్‌పేయి మంత్రివర్గంలో చేరారు
  • 2014లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
  • 2014, 2017లో కొద్ది నెలల పాటు రక్షణ మంత్రిగా వ్యవహరించి రక్షణ రంగంలో ప్రైవేటీకరణ వంటి కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.
క్విక్ రివ్యూ   :
 ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
 ఎప్పుడు  : ఆగస్టు 24
 ఎవరు  : అరుణ్ జైట్లీ (66)
 ఎక్కడ  : ఎయిమ్స్, ఢిల్లీ
 ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 26 Aug 2019 05:50PM

Photo Stories