Skip to main content

జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీశ్

జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము, లదాఖ్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కే మాథుర్ నియమితులయ్యారు.
ఈ మేరకు అక్టోబర్ 25న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జమ్మూకశ్మీర్ ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను గోవా గవర్నర్‌గా కేంద్ర బదిలీ చేసింది. అలాగే లక్షద్వీప్ పరిపాలనాధికారిగా మాజీ ఐబీ చీఫ్ దినేశ్వర్ శర్మను, మిజోరం గవర్నర్‌గా బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లైను నియమించింది.

గిరీశ్ చందర్ ముర్ము
1985వ బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన గిరీశ్ చందర్ ముర్ము ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం అడిషనల్ ప్రిన్స్ పల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆర్థిక శాఖలో సెక్రటరీగా ఉన్నారు. ఒడిశాకు చెందిన ముర్ము జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అక్టోబర్ 31న శ్రీనగర్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఆర్‌కే మాథుర్
1977 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆర్‌కే మాథుర్(రాధాకృష్ణ మాథుర్) రక్షణశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ప్రధాన సమాచార కమిషనర్‌గా పనిచేసి 2018లో రిటైర్ అయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాథుర్ లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అక్టోబర్ 31న లేహ్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్ట్ 5న కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2019, అక్టోబర్ 31 నుంచి జమ్మూకశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పరిపాలన కొనసాగిస్తుంది.
Published date : 26 Oct 2019 05:50PM

Photo Stories