Skip to main content

జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం

జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్ డిసెంబర్ 28న ప్రమాణస్వీకారం చేశారు.
Current Affairsజార్ఖండ్ రాజధాని రాంచీలోని మోరబడి మైదానంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు అలంఘీర్ ఆలమ్, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రామేశ్వర్ ఒరాయన్, ఆర్‌జేడీ ఎమ్మెల్యే సత్యానంద భోక్త కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌లు హాజరయ్యారు.

సీఎంగా రెండోసారి
జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన శిబూసోరెన్ వారసుడిగా హేమంత్ సోరెన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఆయన రాష్ర్ట పగ్గాలను చేపట్టడం ఇది రెండోసారి. సోరెన్ గతంలో ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే సీఎంగా కేవలం 14 నెలలు మాత్రమే ఉన్నారు.

హేమంత్ నేపథ్యం...
  • గిరిజన పోరాటయోధుడు బిర్సా ముండాయే తనకు స్ఫూర్తి అని చెప్పుకునే హేమంత్.. కేంద్ర మాజీ మంత్రి, మూడుసార్లు జార్ఖండ్ సీఎంగా పనిచేసిన ఆదివాసీ నేత శిబూ సోరెన్ కుమారుడు.
  • తల్లిదండ్రులు: రూపి, శిబూ సోరెన్
  • జననం: 1975 ఆగస్ట్ 10.
  • స్వస్థలం: రామ్‌గఢ్ జిల్లా నేమ్రా గ్రామం, జార్ఖండ్
  • విద్య: ఇంటర్, ఇంజినీరింగ్ (డిస్‌కంటిన్యూ)
  • హాబీలు: వంట చేయడం, క్రికెట్ ఆడటం
  • భార్య: కల్పనా సోరెన్

రాజకీయ ప్రవేశం
  • సోదరుడు దుర్గ హఠాన్మరణంతో హేమంత్ 2009లో జేఎంఎం పగ్గాలు చేపట్టారు.
  • 2005లో తొలిసారి దుమ్కా స్థానం నుంచి ఎన్నికల బరిలోకి. జేఎంఎం తిరుగుబాటు నేత స్టీఫెన్ మరాండీ చేతిలో ఓటమి.
  • 2009- 2010లో రాజ్యసభ సభ్యుడు.
  • 2010లో జార్ఖండ్ డెప్యూటీ సీఎంగా బాధ్యతలు.
  • 2013 జూలై 13న జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన ఎత్తివేసిన తరువాత కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో 2013 జూలై 15న సుమారు 38 ఏళ్లకే రాష్ట్రానికి అత్యంత చిన్న వయస్కుడైన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 డిసెంబర్ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.
  • 2014 డిసెంబర్ 23న బార్‌హైత్ ఎమ్మెల్యేగా ఎన్నిక.. ప్రతిపక్ష నేతగా ఎంపిక.
  • 2019 డిసెంబర్ 23న దుమ్కా ఎమ్మల్యేగా ఎన్నిక... ముఖ్యమంత్రిగా ప్రమాణం.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్
ఎక్కడ : మోరబడి మైదానం, రాంచీ, జార్ఖండ్
Published date : 30 Dec 2019 06:03PM

Photo Stories