Skip to main content

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్‌కు 63వ స్థానం

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకుల్లో భారత్ 14 స్థానాలు ఎగబాకి 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఈ మేరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి సంబంధించి రూపొందించిన నివేదికను ప్రపంచ బ్యాంక్ అక్టోబర్ 24న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల జాబితాలో న్యూజిలాండ్ తొలి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో సింగపూర్(2), హాంకాంగ్(3), డెన్మార్క్(4), కొరియా(5), అమెరికా(6) ఉన్నాయి.

ప్రపంచ బ్యాంక్ నివేదిక-ముఖ్యాంశాలు
  • 2019, మే 1తో ముగిసిన 12 నెలల కాలానికి మొత్తం 190 దేశాల్లో 10 వ్యాపార కార్యకలాపాల అమలు తీరును పరిగణనలోకి తీసుకుని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను రూపొందించారు.
  • అత్యుత్తమ పనితీరు కనబరిచిన టాప్-10 దేశాల్లో భారత్(తొమ్మిదో స్థానం) వరుసగా మూడోసారి స్థానం సంపాదించింది.
  • 2019 ఏడాదికి టాప్ 10 పెర్‌ఫార్మర్స్ జాబితాలో భారత్‌తోపాటు సౌదీ అరేబియా (62), జోర్డాన్ (75), టాగో (97), బహ్రెయిన్ (43), తజకిస్తాన్ (106), పాకిస్తాన్ (108), కువైట్ (83), చైనా (31), నైజీరియా (131) ఉన్నాయి.
  • దివాలా, పన్నులు, ఇతర విభాగాల్లో చేపట్టిన సంస్కరణలు భారత్ పనితీరు మెరుగుపడటానికి దోహదపడ్డాయి.

భారత్‌పై ప్రశంసలు
భారత్ చేపట్టిన సంస్కరణలపై ప్రపంచబ్యాంకు ప్రశంసలు కురిపించింది. ‘‘వ్యాపార నిర్వహణలోని టాప్ 10 దేశాల్లో భారత్ వరుసగా మూడోసారి స్థానం దక్కించుకుంది. గత 20 ఏళ్ల కాలంలో కొన్ని దేశాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి’’ అని వరల్డ్ బ్యాంక్ డెరైక్టర్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ సిమియన్ జంకోవ్ కొనియాడారు. వచ్చే రెండేళ్లలో టాప్ 50 వ్యాపార సులభతర దేశాల జాబితాలోకి చేరాలన్న భారత్ లక్ష్యానికి అనుకూలంగా ఇక్కడి వాతావరణం మారుతోందన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ ర్యాంకు

సంవత్సరం

ర్యాంకు

2014

142

2015

130

2016

130

2017

100

2018

77

2019

63

Published date : 25 Oct 2019 05:37PM

Photo Stories