ఏపీ శాసనసభలో 16 కీలక బిల్లులకు ఆమోదం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ 16న చారిత్రక ఘట్టానికి వేదికైంది.
చదవండి : తొలి సమావేశాల్లో ఆమోదం పొందిన 19 బిల్లులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాల బోధన, ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడం, మద్యం అక్రమ విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టడం, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు వంటి 16 చరిత్రాత్మక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
శాసనసభ ఆమోదించిన 16 బిల్లులు..
శాసనసభ ఆమోదించిన 16 బిల్లులు..
- ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్-1982 సవరణ
ఉద్దేశం: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు భోదన.. ధనిక, మధ్యతరగతి, పేద అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం.. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదం చేయడం.. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం.
- ప్రభుత్వ సర్వీసుల్లోకి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు
ఉద్దేశం: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం.
- ఎస్సీ కమిషన్
ఉద్దేశం: ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం.
- ఎస్టీ కమిషన్
ఉద్దేశం: ఎస్టీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం.
- చిరుధాన్యాల(మిల్లెట్స్) బోర్డు ఏర్పాటు
ఉద్దేశం: చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం.
- పప్పుధాన్యాల(పల్సస్) బోర్డు ఏర్పాటు
ఉద్దేశం: పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ధరలు పెరగడకుండా నియంత్రించడం..ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం.
- ఆంధ్రప్రదేశ్ మద్యనిషేధ చట్టం-1995కు సవరణ
ఉద్దేశం: అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.రెండు లక్షల జరిమానా.. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.5 లక్షల జరిమానా.
- ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ చట్టం-1968కు సవరణ
ఉద్దేశం: బార్‌లలో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయం.. సరిహద్దుల నుంచి అక్రమ రవాణా.. ఇలాంటి నేరాలకు తొలిసారి పాల్పడితే హెచ్చరికతోపాటు లెసైన్స్ ఫీజుకు రెండు రెట్లు జరిమానా.. రెండోసారి పాల్పడితే బార్ లెసైన్స్ రద్దు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు.
- కర్నూలులో క్లస్టర్ యునివర్సిటీ ఏర్పాటు
ఉద్దేశం: కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీ, కేవీఆర్ ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేసి క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం.. విద్యార్థులకు ఉపాధి కల్పన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచేలా నాణ్యమైన విద్యను అందించడం.
- జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం చట్టం సవరణ
ఉద్దేశం: వైఎస్సార్ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం కడపలో ఏర్పాటు చేయడం.
- ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు
ఉద్దేశం:విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్/ప్రతినిధి ఎక్స్-అఫీషియో సభ్యునిగా నియామకం.
- ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల రెండో సవరణ బిల్లు
ఉద్దేశం: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్ (ఉప కులపతులు)ల నియామక నిబంధనల్లో మార్పులు
- ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల రెండో సవరణ బిల్లు
ఉద్దేశం: సహకార సంఘాల పాలక మండలి ఎన్నికల్లో కుష్టు వ్యాధిగ్రస్తులు, మూగ, చెవిటి వారికి పోటీ చేసే అవకాశం కల్పించడం.
- ఏపీ వృత్తిదారులు, వ్యాపారులు, ఉద్యోగుల వృత్తిపన్ను చట్టం సవరణ బిల్లు-2019
- ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు-2019
- ఏపీ మున్సిపల్ చట్టం సవరణ బిల్లు-2019
చదవండి : తొలి సమావేశాల్లో ఆమోదం పొందిన 19 బిల్లులు
Published date : 17 Dec 2019 05:55PM