Skip to main content

ఏపీ దిశ యాక్ట్-2019 బిల్లుకు మంత్రివర్గం ఆమోదం

మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా.. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ డిసెంబర్ 11న ఆమోదం తెలిపింది.
Current Affairs మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి ఇక జీవితం ఉండదనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019 (ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్)ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంలో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఏపీ దిశ చట్టంతో పాటు మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఇండియన్ పీనల్ కోడ్‌లో అదనంగా 354(ఇ), 354 (ఎఫ్) సెక్షన్లను చేర్చే ముసాయిదా బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు
  • కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం. సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్ యూనివర్శిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పంగూరు గ్రామంలో 15.28 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి కేటాయింపునకు మంత్రివర్గం అనుమతి.
  • ఏపీ స్టేట్ యూనివర్శిటీ యాక్ట్‌లో సవరణలకు కేబినెట్ పచ్చజెండా. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లేదా ఆయన నియమించిన వ్యక్తి అన్ని యూనివర్శిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటారు.
  • కడప జిల్లాలో వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్‌‌ట్స యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. యూనివర్శిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్‌‌ట్స ఏర్పాటు. రెండు కాలేజీల్లో ఐదు విభాగాలు.
  • ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగం కమిషన్ చైర్మన్‌గా వంగపండు ఉష నియామకానికి కేబినెట్ ఆమోదం.
  • ఆంధ్రప్రదేశ్ టాక్స్ ఆన్ ప్రొఫెషన్‌‌స, ట్రేడ్‌‌స, కాలింగ్‌‌స అండ్ ఎంప్లాయిమెంట్ సవరణ ముసాయిదా బిల్లు-2019 కు ఆమోదం
  • వీఓఏ/సంఘమిత్ర/యానిమేటర్ల జీతాల పెంపుదలకు మంత్రివర్గం అంగీకారం. జీతాలు రూ.10వేలకు పెంచుతూ ఇటీవలే నిర్ణయం.
  • ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఏపీసీఎస్) చట్టం 1964లో సెక్షన్ 21-ఎ (1) (ఇ) సవరణకు కేబినెట్ ఆమోదం.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ దిశ యాక్ట్-2019 బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా
Published date : 12 Dec 2019 07:05PM

Photo Stories