Skip to main content

ఎంపీల వేతనాల కోత ఆర్డినెన్స్ కు కేబినెట్‌ ఆమోదం

కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Current Affairs

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా పార్లమెంటు సభ్యులందరి వేతనంలో సంవత్సరం పాటు 30 శాతం కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఏప్రిల్ 6న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సంఘటిత నిధిలో చేరే ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటంలో వినియోగించనున్నారు. ఈ మేరకు ‘శాలరీ, అలవెన్సెస్‌ అండ్‌ పెన్షన్‌ ఆఫ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ యాక్ట్‌–1954’కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ రూపొందించామని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు. ఎంపీల వేతనానికి, ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల వేతనాలకు తేడా ఉంటుంది. ఎంపీలు నెలకు సుమారు రూ. లక్ష వేతనంతో పాటు, రూ. 70 వేలను నియోజకవర్గ అలవెన్స్‌గా పొందుతారు. మంత్రుల వేతనం కూడా దాదాపు అంతే ఉంటుంది కానీ వారికి వేరే అలవెన్సులు కూడా ఉంటాయి.


ఎంపీల్యాడ్ ప‌థ‌కం నిలిపివేత‌..

ఎంపీల్యాడ్‌(ఎంపీ లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌) ఫండ్‌ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని రెండు ఆర్థిక సంవత్సరాల(2020–21, 2021–22) పాటు నిలిపివేయనున్నారు. ఈ మొత్తాన్ని కూడా కోవిడ్‌–19పై పోరుకు వినియోగిస్తారు. లోక్‌సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. ఈ మొత్తం 788 మంది ఎంపీలకు ఎంపీల్యాడ్స్‌ కింద ఒక్కొక్కరికి ఏటా రూ. 5 కోట్ల చొప్పున ఇస్తారు. రెండేళ్లకు గానూ ఈ మొత్తం దాదాపు రూ. 7,880 కోట్లు అవుతుంది. అలాగే, ఎంపీల వేతనాల్లో కోత ద్వారా ఏటా రూ. 29 కోట్లు కరోనాపై పోరాటానికి జమ అవుతాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఎంపీల వేతనాల కోత ఆర్డినెన్స్ కు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : కేంద్ర కేబినెట్‌
ఎందుకు : కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా
Published date : 07 Apr 2020 06:08PM

Photo Stories