Skip to main content

బోయింగ్-737కు బ్రేక్

బోయింగ్- 737 మ్యాక్స్ రకం విమానాల సేవలు నిలిచిపోయాయి. ఈ తరహా విమానాలను మార్చి 13 సాయంత్రం నాలుగు గంటలకు నేలకు దించేయాలని డీజీసీఏ ఆదేశించడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఈ రకం విమానాలను తక్షణమే విమానాశ్రయాలకు పరిమితం చేయాలన్న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయానికి కొనసాగింపుగా.. తాజాగా సేవల్ని నిలిపివేయాల్సిన సమయాన్ని కూడా ప్రకటించింది. ఇటీవల ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో ప్రపంచంలోని పలు దేశాలు ఈ రకం విమానాలను నిషేధించాయి. ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు బోయింగ్ 737 మ్యాక్స్ రకానికి చెందిన విమానాలు ప్రమాదానికి గురవడం తెలిసిందే. దీంతో వాటి భద్రతా ప్రమాణాలపై సర్వత్రా అనుమానాలు వ్యక్త మవువుతున్నాయి. మనదేశంలో స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్ సంస్థలు ఈ రకం విమానాలు కలిగి ఉన్నాయి. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే ధ్యేయంగా బోయింగ్ 737 మ్యాక్స్ రకం విమానాల సేవల్ని రద్దు చేస్తున్నట్లు స్పైస్‌జెట్ ఇప్పటికే ప్రకటించింది. కాగా డీజీసీఏ నిర్ణయంతో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్కు చెందిన రెండు బోయింగ్-737 మ్యాక్స్ విమానాలను సంబంధిత అధికా రులు బుధవారం రద్దు చేశారు.

అసలు సమస్య ఇదే ...
బోయింగ్ విమాన ప్రమాదాలకు ప్రధానంగా ది మనూవరింగ్ కేరెక్టరిస్టిక్ అగ్మెంటేషన్ సిస్టమ్(ఎంసీఏఎస్) వ్యవస్థ కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. పైలట్లకు సాయం చేసేందుకు పలు ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్లు ఇప్పుడు విమానాల్లో ఉంటున్నాయి. అటువంటిదే ఇది కూడా. విమానం ప్రయాణించేటప్పుడు కొన్ని సందర్భాల్లో తోకభాగం మరీ కిందకు వెళ్లి.. ముక్కు భాగం పైకి లేచి ప్రయాణిస్తుంటాయి. దీనిని స్టాలింగ్ అంటారు. ఈ సమయంలో పైలట్లు చాకచక్యంగా ముక్కు భాగాన్ని కిందికి దించుతారు. అప్పుడు తోకభాగం కూడా పైకి లేచి విమానానికి స్థిరత్వం లభిస్తుంది. ఇదే పనిని ఆటోమేటిక్‌గా చేసేందుకు బోయింగ్ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. విమానం పరిస్థితిని అర్థం చేసుకొని ఇది ఆటోమేటిక్‌గా ముక్కు భాగాన్ని కిందకు దించి తోకభాగం పైకి లేచేలా చేస్తుంది. అయితే ఈ అప్‌డేషన్ గురించి పైలట్లకు పూర్తిగా అవగాహన లేదు. స్టాలింగ్ సమయంలో సాఫ్ట్‌వేర్ దానంతట అదే విమానం ముక్కును కిందకు దింపుతుంది. ఈ విషయం తెలియక పైలట్లు కూడా మాన్యూవల్‌గా ముక్కును కిందకు దించడంతో విమానం ఒక్కసారిగా భూమివైపు దూసుకెళుతుంది. దీంతో పైలట్లు కంగారుపడి పరిస్థితిని చక్కదిద్దేలోపే ప్రమాదం చోటుచేసుకొంటోంది. లయన్ ఎయిర్‌లైన్స్ విమానం విషయంలో ఇదే జరిగింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : బోయింగ్-737 నిషేదం
ఎందుకు : ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో ప్రపంచంలోని పలు దేశాలు ఈ రకం విమానాలను నిషేధించాయి
ఎప్పుడు : మార్చి 13
ఎక్కడ : భారతదేశంలో
Published date : 14 Mar 2019 07:58PM

Photo Stories