Skip to main content

ఆసియాన్-ఇండియా సమావేశంలో మోదీ

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ సమీపంలోని నొంతబురిలో నవంబర్ 3న జరిగిన ఆసియాన్-ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ... ఆసియాన్‌తో సంబంధాలను మరింత విసృ్తతం చేసుకునేందుకు భారత్ సానుకూలంగా ఉందని తెలిపారు. ఆసియాన్‌లోని 10 దేశాలతో భూ, వాయు, సముద్ర అనుసంధానత పెంపు ద్వారా ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక ప్రగతి గణనీయంగా మెరుగవుతాయన్నారు. డిజిటల్ అనుసంధానత కూడా చాలా కీలకమైందన్నారు. బ్యాంకాక్‌లో నవంబర్ 2న భారత సంతతి ప్రజలతోనూ మోదీ బేటీ అయ్యారు.

ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి
భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత విసృ్తతం చేసుకోవడంతోపాటు ఉగ్రవాదం వంటి పెను సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆసియాన్ నిర్ణయించిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ తెలిపారు. దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా ఆసియాన్ చర్చించిందని తెలిపారు.

ఆసియాన్ గురించి..
ఆసియాన్(అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ - ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య) 1967 ఆగస్టు 8న ‘‘వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ’’ అనే నినాదంతో ఏర్పడింది. పరస్పర సహకారంతో ప్రాంతీయంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి సాధించడమే సమాఖ్య ముఖ్య ఉద్దేశం. ఆసియాన్ ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది. ఇందులో పది సభ్యదేశాలున్నాయి.

ఆసియాన్ సభ్యదేశాలు
ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆసియాన్-ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎక్కడ : నొంతబురి, బ్యాంకాక్, థాయ్‌లాండ్
Published date : 04 Nov 2019 05:52PM

Photo Stories