Skip to main content

ఆసియా అథ్లెటిక్స్‌లో గోమతి, తేజిందర్‌లకు స్వర్ణాలు

23వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు గోమతి మరిముత్తు, తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్వర్ణ పతకాలను గెలుపొందారు.
ఖతార్ రాజధాని దోహాలో ఏప్రిల్ 22న జరిగిన మహిళల 800 మీటర్ల రేసులో గోమతి(చెన్నై) 2 నిమిషాల 02.70 సెకన్లలో గమ్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో 24 ఏళ్ల తేజిందర్(పంజాబ్) ఇనుప గుండును 20.22 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు.

మరోవైపు పురుషుల జావెలిన్ త్రోలో బరిలోకి దిగిన శివ్‌పాల్ సింగ్ రజతం దక్కించుకున్నాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో సరితాబెన్ గైక్వాడ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో జాబిర్, పురుషుల 10,000 మీటర్ల రేసులో మురళీ కుమార్ కాంస్యాలను సాధించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కి రెండు స్వర్ణాలు
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : గోమతి మరిముత్తు, తేజిందర్ పాల్ సింగ్ తూర్
ఎక్కడ: దోహా, ఖతార్
Published date : 23 Apr 2019 06:06PM

Photo Stories