Skip to main content

ఆర్థిక వృద్ధికి ఆర్‌బీఐ రెండో ప్యాకేజీ

కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు తీసుకొన్న నెలరోజుల్లోపే ఏప్రిల్ 17న మరో ప్యాకేజీని అందించింది.
Current Affairs

ముఖ్యంగా బ్యాంకులు మరింత ఉత్సాహంగా రుణాలు మంజూరు చేసేలా నిర్ణయాలు తీసుకుంది. రివర్స్‌ రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ... లిక్విడిటీ కవరేజీ రేషియోను 80 శాతానికి సవరించింది. బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ పెరిగేలా చర్యలు చేపట్టింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ రెండో ప్యాకేజీ నిర్ణయాలను ప్రకటించారు.


ఎన్‌పీఏల వర్గీకరణకు 180
రోజులు
రుణ చెల్లింపుల్లో విఫలమైతే 90 రోజుల తర్వాత దాన్ని వసూలు కాని ఎన్‌పీఏ వర్గీకరించాలన్నది ప్రస్తుత నిబంధన. అయితే లాక్‌డౌన్‌ కారణంగా రుణ చెల్లింపులపై 3 నెలల మారటోరియంను ఆర్‌బీఐ గతంలోనే ప్రకటించింది. ఫలితంగా మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్న ఖాతాలకు ఇది 180 రోజులుగా అమలు కానుంది. 2020, మార్చి 1 నాటికి చెల్లింపుల్లో విఫలం కాకుండా ఉన్న రుణ ఖాతాలకే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. మారటోరియం వెసులుబాటు ఎన్‌పీఏలకు దారితీయకూడదని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

రివర్స్‌ రెపో పావు శాతం కోత‌

రివర్స్‌ రెపో రేటును పావు శాతం తగ్గించి ప్రస్తుతమున్న 4 శాతం నుంచి 3.75 శాతానికి సవరించింది. రివర్స్‌ రెపో అంటే... బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులకు ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు. ఈ రేటు తగ్గటం వల్ల బ్యాంకులు తమ నిధుల్ని ఆర్‌బీఐ వద్ద డిపాజిట్‌ చేయడానికి బదులు రుణాలివ్వటానికే మొగ్గు చూపిస్తాయి. బెంచ్‌మార్క్‌ రెపో రేటు 4.40 శాతంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

ఎల్‌సీఆర్‌ కోత

లిక్విడిటీ కవరేజీ రేషియోను (ఎల్‌సీఆర్‌) 100 శాతం నుంచి 80 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. ఎల్‌సీఆర్‌ అంటే... ఏ క్షణంలోనైనా నగదుగా మార్చుకోగలిగే స్వల్పకాలిక ప్రభుత్వ బాండ్ల వంటి ఆస్తులు. 2020 అక్టోబర్‌ నాటికి తిరిగి దీనిని 90 శాతానికి, 2021, ఏప్రిల్‌ 1కి 100 శాతానికి తీసుకొస్తామని గ‌వర్నర్‌ శక్తికాంత దాస్ తెలిపారు.

రాష్ట్రాలకు మరిన్ని నిధులు..

వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం మేర అదనంగా ఆర్‌బీఐ నుంచి రుణాలను పొందేందుకు రిజర్వు బ్యాంకు అనుమతించింది. ఈ సదుపాయం 2020, సెప్టెంబర్‌ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాలను తాత్కాలికంగా సర్దుబాటు చేసుకునేందుకు ఏర్పాటు చేసిందే వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌.

ఆర్థిక సంస్థలకు మరో రూ.50
వేల కోట్లు
జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలైన నాబార్డ్, సిడ్బి, ఎన్‌హెచ్‌బీలకు మరో రూ.50,000 కోట్ల మేర రీఫైనాన్సింగ్‌ సదుపాయాన్ని ఆర్‌బీఐ కల్పించింది. ఈ సంస్థలు ఆర్‌బీఐ అనుమతించిన నిర్దేశిత సాధనాల ద్వారా మార్కెట్ల నుంచి నిధులను సమీకరించుకోవచ్చు. ఒక్క నాబార్డ్‌కే రూ.25,000 కోట్లు అందించనుంది. వీటిని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కోపరేటివ్‌ బ్యాంకులు, సూక్ష్మ రుణ నంస్థలకు నాబార్డ్‌ అందించనుంది.

వ్యవస్థలోకి రూ.1.2
లక్షల కోట్ల నగదు
మార్చి 1 – ఏప్రిల్‌ 14 మధ్య వ్యవస్థలోకి ఆర్‌బీఐ ఏకంగా రూ.1.2 లక్షల కోట్ల న‌గ‌దును విడుదల చేసింది. కరోనా వైరస్, లాక్‌డౌన్‌ కారణంగా వ్యవస్థలో నగదుకు డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేసి ఈ విధానాన్ని అనుసరించింది.

మ‌రికొన్ని నిర్ణయాలు..
  • ఎన్‌బీఎఫ్‌సీ, మైక్రో ఫైనాన్స్‌ రంగం నిధుల కొరత ఎదుర్కోవచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. దీంతో ఈ రంగం కోసం ల‌క్ష్యిత దీర్ఘకాల రెపో ఆపరేషన్స్‌ (టీఎల్‌టీఆర్‌వో 2.0) రూపంలో రూ.50,000 కోట్ల మేర నిధుల్ని ఆర్‌బీఐ అందించనుంది.
  • అన్ని వాణిజ్య, కో–ఆపరేటివ్‌ బ్యాంకులు తమ వాటాదారులకు, ప్రమోటర్లకు డివిడెండ్‌ చెల్లింపులు చేయకుండా ఆర్‌బీఐ నిషేధం విధించింది.
  • 2021–22 ఆర్థిక సంవత్సరంలో భార‌త వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుతుందని ఆర్‌బీఐ అంచ‌నా. 2019-20లో 1.9 శాతం వృద్ధి రేటు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది.
Published date : 18 Apr 2020 06:22PM

Photo Stories