ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన ప్రకటన
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆర్థిక రంగానికి ఊతం అందించడానికి తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లను పావుశాతం తగ్గిస్తుందన్న అంచనాలకు భిన్నంగా గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. కీలక రేట్లను యథాతథంగా కొనసాగించాలని మూడు రోజుల పాటు జరిగిన సమావేశం ఆగస్టు 6న నిర్ణయించింది. అయితే వృద్ధికి ఊపును అందించే క్రమంలో సరళతర ఆర్థిక విధానాలకే మొగ్గుచూపుతున్నట్లూ ప్రకటించింది. 2020, జూన్‌లో ద్రవ్యోల్బణం 6.09 శాతం నమోదయ్యింది... 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొంది.
రెపో రేటు 4 శాతం...
రేట్లను యథాతథంగా కొనసాగిస్తుండడంతో రెపో రేటు (4 శాతం) 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. ఇక రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే అదనపు నిధులపై లభించే వడ్డీరేటు) 3.35 శాతంగా కొనసాగుతుంది. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన కనీస మొత్తం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) 3 శాతంగా కొనసాగనుంది.
90 శాతం రుణం..
కరోనా నేపథ్యంలో చిన్న సంస్థలు, వ్యాపారులు, మధ్య, సామాన్యుని కి ఊరట కల్పించే నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంది. దీనిప్రకారం... తన వద్ద ఉన్న పసిడిని బ్యాంకింగ్‌లో హామీగా పెట్టి రుణం తీసుకునే వ్యక్తులు ఇకపై ఆ విలువలో 90 శాతం రుణాన్ని పొందగలుగుతారు. తాజా నిర్ణయం 2021 మార్చి వరకూ అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకూ (పసిడి రుణాలకు లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి) ఇది 75 శాతంగా ఉంది.
నాబార్డ్ కు వెసులుబాటు
వ్యవసాయ రంగానికి సాయం అందించే క్రమంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)కు రూ.5,000 కోట్ల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ను ఆర్‌బీఐ కల్పించింది. అలాగే హౌసింగ్ సెక్టార్ విషయంలో ద్రవ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ)కి కూడా రూ.5,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌలభ్యత కల్పిస్తున్నట్లు పేర్కొంది. తద్వారా ఆయా రంగాలకు రుణాలను అందించే విషయంలో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ద్రవ్య లభ్యత విషయంలో కొంత వెసులుబాటు కలుగుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌బీఐద్రవ్యపరపతి విధాన ప్రకటన
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు :ఆర్‌బీఐద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ)
ఎందుకు:ఆర్థిక రంగానికి ఊతం అందించడానికి