Skip to main content

అల్ కాయిదా కీలక నేత అల్ రిమీ హతం

యెమెన్‌లో అమెరికా భద్రతా దళాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో అల్ కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) కీలక నేత ఖాసిం అల్ రిమీ (46) హతమయ్యాడు.
Current Affairsఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 6న ధ్రువీకరించారు. రిమీ మరణంతో అరేబియన్ ద్వీపకల్పంలో అల్‌కాయిదా మరింత బలహీనపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. తన ఆదేశాల మేరకు యెమెన్‌లోని అమెరికా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిపినట్లు వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్ ఎప్పుడు, ఎలా నిర్వహించారో వెల్లడించలేదు.

లాడెన్ కోసం...
రిమీ 1990ల్లో అల్‌కాయిదాలో చేరాడని, అఫ్గానిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్ కోసం పని చేశాడని ట్రంప్ తెలిపారు. రిమీ నేతృత్వంలో ఏక్యూఏపీ గ్రూపు యెమెన్‌లోని సాధారణ పౌరులపై హింసాకాండ జరిపిందని పేర్కొన్నారు.

డిసెంబర్ 6న...
2019, డిసెంబర్ 6న ఫ్లోరిడాలోని అమెరికా నావల్ బేస్‌లో జరిగిన కాల్పులకు రిమీ నేతృత్వంలోని గ్రూపు తమదే బాధ్యత అని ప్రకటించింది. ఈ ఘటనలో ఓ సౌదీ వాయుసేన అధికారి ముగ్గురు అమెరికా నావికులను చంపాడు. రిమీకి సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి కోటి డాలర్లు (10 మిలియన్ డాలర్లు) ఇస్తామని అమెరికా గతంలో ప్రకటించింది. అల్‌కాయిదాకు అల్‌జవహరి వారసుడు రిమీ అనుకుంటారు. గత కొన్ని నెలల్లో అమెరికా చేపట్టిన మూడో పెద్ద ఆపరేషన్ ఇది. 2019, అక్టోబర్‌లో ఐసిస్ నేత బగ్దాదీని, 2020, జనవరిలో ఇరానియన్ జనరల్ సులేమానీని అమెరికా దళాలు హతం చేశాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అల్ కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) కీలక నేత హతం
ఎవరు : ఖాసిం అల్ రిమీ (46)
ఎక్కడ : యెమెన్
ఎందుకు : యెమెన్‌లో అమెరికా భద్రతా దళాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో
Published date : 08 Feb 2020 05:48PM

Photo Stories