Skip to main content

ఐఐటీల్లో కరోనా నిరోధ‌క ప‌రిక‌రాల త‌యారీ

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశంలోని అత్యున్నత జాతీయ విద్యాసంస్థలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.
Current Affairs

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థలు కరోనా వైరస్‌ను నిరోధించే పరికరాలను తయారు చేస్తూ అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాయి.


ఇన్ఫెక్షన్‌ ప్రూఫ్‌ ఫ్యాబ్రిక్స్‌

  • ఆస్పత్రుల్లోని సిబ్బంది, రోగులకు ఇన్ఫెక్షన్‌ రాకుండా నిరోధించడానికి ‘ఇన్ఫెక్షన్‌ ప్రూఫ్‌ ఫ్యాబ్రిక్స్‌’ను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహకారంతో ఢిల్లీ ఐఐటీ అభివృద్ధి చేసింది.
  • అధునాతన టెక్స్‌టైల్‌ టెక్నాలజీ ద్వారా సాధారణ కాటన్‌ను ఇన్ఫెక్షన్‌ ప్రూఫ్‌గా మార్పు చేశారు. ఇది శక్తివంతమైన యాంటీ మైక్రోబయాల్‌గా మారి ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది.


ఆటోమేటెడ్‌ స్ప్రేయర్‌ డ్రోన్‌

  • రోడ్లు, పార్కులు, మైదానాలు, ఇతర ప్రాంతాల్లో మానవ రహితంగా శానిటైజర్‌ను స్ప్రే చేసేందుకు గౌహతిలోని ఐఐటీ విద్యార్థులు ఆటోమేటెడ్‌ స్ప్రేయర్‌ డ్రోన్‌ను అభివృద్ధి చేశారు.
  • మొబైల్‌ ఫోన్‌తో నియంత్రించే డ్రోన్‌ .. 3 కిలోమీటర్ల పరిధిలో సిగ్నలింగ్‌ వ్యవస్థ ద్వారా ఇది పని చేస్తుంది.


రియల్‌ టైమ్‌ పీసీఆర్‌

  • కరోనా వైరస్‌ను గుర్తించేందుకు రియల్‌ టైమ్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌) యంత్రాలను ఐఐటీ గౌహతి రూపొందించింది.
  • రోబో ఆధారిత స్క్రీనింగ్‌ యూనిట్లు, హైకెపాసిటీ ఆటోక్లేవ్‌ మెషిన్లు, టెంపరేచర్‌ మెజరింగ్‌ యూనిట్లు త‌యారు చేసింది.
  • ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్‌–19 నివారణకు ఐఐటీ గౌహతిలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు


తక్కువ ఖర్చుతో వెంటిలేటర్‌

  • ఐఐటీ కాన్పూర్‌ తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. మార్కెట్లో రూ.4 లక్షలకు పైగా ఉండే వెంటిలేటర్‌ను దేశీయంగా లభించే పరికరాలు వినియోగించి రూ.70 వేలతోనే దీనిని రూపొందించింది.
  • అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ సిలిండర్‌ను అమర్చుకునే వీలు కూడా ఉన్న ఈ ప‌రిక‌రాన్ని మొబైల్‌కు అనుసంధానించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.


బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌ వెంటిలేటర్‌

  • ఎక్కడికైనా తీసుకువెళ్లేందుకు వీలుగా ‘అంబు బ్యాగ్‌’ పేరుతో బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌ వెంటిలేటర్‌ను హైదరాబాద్‌ ఐఐటీ సిద్ధం చేసింది.
  • అత్యవసర పరిస్థితుల్లో శ్వాసక్రియను కొనసాగింప చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
Published date : 02 Apr 2020 12:21PM

Photo Stories