Skip to main content

48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి?

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ.. 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Current Affairs రాష్ట్రపతి భవన్‌లో ఏప్రిల్ 24న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జస్టిస్‌ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ 2022, ఆగస్టు 26వ తేదీ వరకు కొనసాగనున్నారు. దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించిన రెండవ తెలుగు వ్యక్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కావడం విశేషం. గతంలో జస్టిస్‌ కోకా సుబ్బారావు.. 1966– 67 మధ్య భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

2014లో సుప్రీంకోర్టుకు...
జస్టిస్‌ ఎన్వీ రమణ 2014, ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసులను విచారించిన ధర్మాసనాలకు నేతృత్వం వహించగా, కొన్నింటిలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2020, జనవరి 10వ తేదీన కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ నిలిపివేయడాన్ని వెంటనే సమీక్షించాలని జస్టిస్‌ రమణ తీర్పు ఇచ్చారు. 2019 నవంబర్‌ 13న సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించిన చారిత్రక ధర్మాసనంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. గృహిణులు ఇంట్లో చేసే పని, కార్యాలయాల్లో వారి భర్తలు చేసే పనికి ఏమాత్రం తక్కువేం కాదని జస్టిస్‌ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : ఏప్రిల్‌ 24
ఎవరు : సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ
Published date : 26 Apr 2021 07:48PM

Photo Stories