Skip to main content

ఆగస్టు 2017 ద్వైపాక్షిక సంబంధాలు

మనీలాలో ఆసియాన్-భారత్ విదేశాంగ మంత్రుల సదస్సు
15వ ఆసియాన్-భారత్ విదేశాంగ మంత్రుల సదస్సు ఆగస్టు 6న మనీలాలో ముగిసింది. ఇందులో భారత విదేశాంగ సహాయ మంత్రి వి.కె.సింగ్ పాల్గొన్నారు. దక్షిణ చైనా సముద్ర వ్యవహారాలపై సదస్సు ఉమ్మడి ప్రకటన చేసింది.

దక్షిణకొరియా ఐవీఐతో భారత్ ఒప్పందం
టీకా మందులపై పరిశోధన, అభివృద్ధి కోసం దక్షిణ కొరియాలోని ఇంటర్నేషనల్ వాక్సిన్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఐ)తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) డెరైక్టర్ సౌమ్యా స్వామినాథన్, ఐవీఐ డెరెక్టర్ జనరల్ జెరోమ్ హెచ్ కిమ్‌లు ఆగస్టు 21న ఒప్పందంపై సంతకాలు చేశారు.
భారత్ 2012 నుంచి ఇంటర్నేషనల్ వాక్సిన్ ఇన్‌స్టిట్యూట్‌లో సభ్య దేశంగా ఉంది. టీకాల పరిశోధన, అభివృద్ధి కోసం ఈ సంస్థకు ఏటా 5 లక్షల డాలర్ల సహాయాన్ని అందిస్తుంది. ఐవీఐలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 35.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐవీఐతో భారత్ ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : ఐసీఎంఆర్, ఐవీఐ
ఎందుకు : టీకాలపై పరిశోధన, అభివృద్ధి కోసం

భారత్, నేపాల్ మధ్య ఎనిమిది ఒప్పందాలు
Current Affairs నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా.. భారత్ పర్యటనలో భాగంగా ఆగస్టు 24న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. డ్రగ్‌‌స అక్రమ రవాణాను అరికట్టడం, భూకంపాల తర్వాత హిమాలయన్ దేశాల్లో పునర్నిర్మాణం వంటి ఎనిమిది అంశాలపై వీరిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. భారత్-నేపాల్‌ల మధ్య ఉన్న ఓపెన్ సరిహద్దు దుర్వినియోగం కాకుండా ఇరుదేశాల భద్రత, రక్షణ బలగాలు ఒకరినొకరు సహకరించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. దీనికి దేవ్‌బా స్పందిస్తూ ప్రతి విషయంలోనూ భారత్‌కు సహకారం అందిస్తామని, ఓపెన్ సరిహద్దు ఉన్నప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు జరగనివ్వమని హామీనిచ్చారు. అనంతరం కటైయా-కుసాహ, రాక్సల్-పర్వానీపూర్ సరిహద్దుల ప్రాంతాల మధ్య విద్యుత్ రవాణా లైన్లను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, నేపాల్ మధ్య 8 ఒప్పందాలు
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా
ఎందుకు : నేపాల్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా

భారత్, జర్మనీల మధ్య పునరుత్పాదక ఇంధన ఒప్పందం
పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరాకు సంబంధించిన గ్రిడ్ల నిర్మాణం, అనుసంధానం కోసం భారత్, జర్మనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇండో జర్మన్ ఎనర్జీ ప్రోగ్రామ్ - గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ (IGEN-GEC) కార్యక్రమంలో భాగంగా రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. IGEN-GEC ని భారత్, జర్మనీలు 2013లో ప్రారంభించాయి. భారత పునరుత్పాదక ఇంధన నిర్వహణ, హరిత శక్తి కారిడార్ల నిర్మాణం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. ఇందుకోసం రాయితీతో కూడిన ఒక బిలియన్ యూరోల రుణాన్ని జర్మనీ భారత్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, జర్మనీ మధ్య గ్రిడ్ అనుసంధాన ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎందుకు : పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరాకు సంబంధించి గ్రిడ్ల నిర్మాణం, అనుసంధానం కోసం
Published date : 10 Oct 2017 11:03AM

Photo Stories