జేఈఈ అడ్వాన్స్‌డ్.. అలవోకగా సాధించొచ్చిలా..
ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతుంటారు. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. పలు మార్పులతో జేఈఈ- అడ్వాన్స్‌డ్-2020 నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2020లో ముఖ్యమైన మార్పులు.. పరీక్షలో విజయానికి అనుసరించాల్సిన మెలకువల గురించి తెలుసుకుందాం..
ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ప్రతి ఏటా నిర్వహిస్తారు. 10+2/ఇంటర్మీడియెట్(ఎంపీసీ గ్రూప్) అర్హతతోపాటు, జేఈఈ- మెయిన్ ఫలితాల్లో నిర్దేశిత ప్రతిభ చూపిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ పరీక్షకు అనుమతిస్తారు. ఈ ఏడాది కరోనా పరిస్థితుల దృష్ట్యా పలు మార్పులతో తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.
ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులంతా అర్హులే..
జేఈఈ అడ్వాన్స్‌డ్-2020లో కీలకమైన మార్పు.. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గతేడాది వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావాలంటే.. ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉండేది. ఈ ఏడాది కరోనా కారణంగా అన్ని రాష్ట్రాలు ఫైనల్ పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు ప్రకటించాయి. దాంతో 75 శాతం మార్కులు సాధించాలనే నిబంధనను తొలగించారు.
మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు..
- జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ.. జేఈఈ-మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో మాత్రం గత నిబంధన కొనసాగనుంది.
- జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. ముందుగా జేఈఈ మెయిన్‌లో స్కోర్ సాధించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో స్కోర్ ఆధారంగా టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభిస్తుంది. అంటే.. ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించినా.. జేఈఈ-మెయిన్‌లో తప్పనిసరిగా టాప్ 2.5 లక్షల మంది జాబితాలో నిలవాల్సిందే.
మహిళా విద్యార్థుల కోసం 20 శాతం అదనపు సీట్లు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మరో ముఖ్యమైన మార్పు.. దేశంలోని అన్ని ఐఐటీల్లో మహిళా విద్యార్థుల కోసం 20శాతం అదనపు సీట్లు(సూపర్ న్యూమరరీ సీట్లు) కేటాయించనున్నారు. ఐఐటీల్లో అందుబాటులో ఉన్న సీట్లకు అదనంగా 20 శాతం సీట్లు మహిళల కోసం పెంచనున్నారు. 2019-20 గణాంకాల ప్రకారం-జాతీయ స్థాయిలో మొత్తం 23 ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో కలిపి మొత్తం 12,463 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా 20 శాతం సీట్లు కేటాయించి.. వాటిని మహిళా విద్యార్థులతో భర్తీ చేస్తారు.
జేఈఈ-అడ్వాన్స్‌డ్ బులెటిన్ ప్రకారం- ఈ ఏడాది ఐఐటీల్లో అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య ఇంకా నిర్ధారణ కాలేదు. గతేడాది సీట్ల వివరాలను పేర్కొనడం జరిగింది.
పరీక్ష కేంద్రాల పెంపు..
ఈ ఏడాది జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్ష కేంద్రాలను పెంచారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో 212 నగరాలు/పట్టణాల్లోని సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. గతేడాది కేవలం 171 పట్టణాల్లో మాత్రమే ఈ పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రాల విషయంలో అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ ప్రాధాన్యత క్రమంలో ఎనిమిది సెంటర్లను పేర్కొనాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల సంఖ్య, మౌలిక సదుపాయాల లభ్యతను పరిగణనలోకి తీసుకొని..పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. గతేడాది వరకు విదేశాల్లోనూ జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించగా.. ఈ సంవత్సరం కొవిడ్ దృష్ట్యా విదేశాల్లో సెంటర్లను ఏర్పాటు చేయలేదు.
పరీక్షలో మార్పులు ఉంటాయా?
- పరీక్ష పరంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని.. గతేడాది మాదిరిగానే రెండు పేపర్లుగా పరీక్ష ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- గతేడాది పేపర్-1, పేపర్-2గా రెండు పేపర్లలో అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు.
- ప్రతి పేపర్ 54 ప్రశ్నలు, 186 మార్కులు చొప్పున 372 మార్కులకు జరిగింది.
- ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 18 చొప్పున ప్రశ్నలు అడిగారు. రెండు పేపర్లలోనూ ఒక్కో సబ్జెక్ట్‌కు 62 మార్కులు కేటాయించారు.
సన్నద్ధత ఇలా..
అడ్వాన్స్‌డ్ పరీక్ష స్వరూపంలో ఎలాంటి మార్పులు లేవు. ఎప్పటి మాదిరిగానే ఆన్‌లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో మూడు గంటల వ్యవధిలో మూడు సబ్జెక్ట్‌ల(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో పరీక్ష నిర్వహించనున్నారు. కాబట్టి విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల సిలబస్‌పై దృష్టిపెట్టి.. పరీక్ష కోణంలో ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మ్యాథమెటిక్స్..
కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్‌తోపాటు 3-డి జామెట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్; బైనామియల్ థీరమ్; లోకస్ అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి.
కెమిస్ట్రీ..
కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహాల్స్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌడ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఫినాల్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డీ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.
ఫిజిక్స్..
ఎలక్ట్రో డైనమిక్స్, మెకానిక్స్,హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్ ఆఫ్ మాస్, మూమెంటమ్ అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే.. మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశముంది.
పునశ్చరణకు ప్రాధాన్యం..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు అధిక సమయాన్ని పునశ్చరణకే కేటాయించాలి. వాస్తవానికి ఇప్పటికే చాలా వరకు ప్రిపరేషన్ పూర్తి చేసుకొని ఉంటారు. కాబట్టి ఈ సమయంలో పునశ్చరణకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆయా టాపిక్స్‌లోని ముఖ్యమైన అంశాలను పాయింటర్స్, షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఇది పరీక్ష ముందు రెడీ రెకనర్స్‌గా ఉపయోగపడుతుంది. ప్రస్తుత సమయంలో కొత్త టాపిక్స్ కోసం సమయం కేటాయించడం సరికాదు. దీనివల్ల ఇప్పటికే చదివిన అంశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
మాక్ టెస్ట్‌లు, ఆన్‌లైన్ విధానం..
అడ్వాన్స్‌డ్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ద్వారా పరీక్ష హాల్లో మెరుగైన ప్రతిభ చూపొచ్చు. ఆన్‌లైన్ విధానంలో మాక్ టెస్ట్‌లకు హాజరవడం వల్ల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌పై అవగాహన వస్తుంది. ఇది పరీక్ష హాల్లో అందుబాటులో ఉండే మూడు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉపకరిస్తుంది. కాబట్టి విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో కనీసం అయిదు మాక్ టెస్ట్‌లకు హాజరవడం మేలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ ముఖ్య సమాచారం
- అర్హత: 2019 లేదా 2020లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ.
- వయో పరిమితి: అక్టోబర్ 1, 1995 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1990 తర్వాత జన్మించి ఉండాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 12, 2020
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 17, 2020
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: సెప్టెంబర్ 21, 2020 నుంచి సెప్టెంబర్ 27, 2020
- అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 27, 2020
- పేపర్-1: ఉదయం 9 నుంచి 12 గంటల వరకు; పేపర్-2: మధ్యాహ్నం 2:30-5:30;
- పరీక్ష ఫలితాల వెల్లడి: అక్టోబర్ 5, 2020
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jeeadv.ac.in
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రత్యేకంగా..
ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ-రూర్కీ, ఐఐటీ(బీహెచ్‌యూ) వారణాసి క్యాంపస్‌లలో అందుబాటులో ఉన్న అయిదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి.. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పేరుతో మరో పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడి తర్వాత ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఆర్కిటెక్చర్ టెస్ట్ రాసే అర్హత లభిస్తుంది. ఈ పరీక్ష ఒకే పేపర్‌గా మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు.
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ముఖ్య తేదీలు..
- రిజిస్ట్రేషన్: అక్టోబర్ 5, 2020 నుంచి అక్టోబర్ 6, 2020 వరకు.
- పరీక్ష తేదీ: అక్టోబర్ 8, 2020 (ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు)
- ఫలితాల వెల్లడి: అక్టోబర్ 11, 2020
రివిజన్‌కే ప్రాధాన్యం..
ఇప్పుడు ఉన్న సమయంలో విద్యార్థులు వీలైనంత వరకు రివిజన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. వెయిటేజీ ఆధారంగా సంబంధిత టాపిక్స్‌పై మరింత దృష్టి పెట్టాలి. మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి.
-ఆర్.కె.వర్మ, డెరైక్టర్, రెసోనెన్స్ అకాడమీ