Skip to main content

ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సుల ప్రారంభం.. డేటా సైన్స్‌పై పెరుగుతున్న ఆసక్తి..

టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఇది అది అనే తేడా లేకుండా.. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది.
ఇందులో భాగంగానే విద్యా రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ విద్యను పర్యవేక్షించే.. ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ).. బీటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు...

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల పరిశ్రమలు.. మానవ వనరులను తగ్గించుకునేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఆయా రంగాల్లో ప్రవేశ పెడుతున్నాయి. ఇవే కాకుండా వ్యాపార అభివృద్ధి సులభతరం చేసుకునే విధంగా డేటాసైన్స్ వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయా రంగాల్లో సరిపడ సంఖ్యలో సమర్థవంతమైన నిపుణులు ఉన్నారా.. అంటే లేరనే చెప్పాలి. ఈ కొరతను అధిగమించడానికి గత కొంతకాలంగా ఆన్‌లైన్ మార్గాల ద్వారా ఏఐ,డేటాసైన్స్ లాంటి కోర్సులో పలు అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో ఇలాంటి నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కాలేజీల్లో బీటెక్ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.

డేటా సైన్స్..
నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులను తయారు చేయడానికి ఇంజనీరింగ్ విద్యలో డేటాసైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. రంగం ఏదైనా.. జరగబోయే పరిణామాలను ముందే అంచనా వేసి.. కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించేదే.. డేటాసైన్స్. విద్య, వైద్యం, వ్యాపార, సామాజిక ఆర్థిక, రాజకీయం.. ఇలా రంగం ఏదైనా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాచారాన్ని తెలుసుకొని.. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే.. ఆయా రంగాల్లో విజయం సాధించడానికి వీలుంటుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పే వారే.. డేటా సైంటిస్టులు.
  • డేటా విశ్లేషణ: డేటాసైన్స్.. గణాంక సహిత సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం. అల్గారిథం, మెషిన్‌లెర్నింగ్ సిద్ధాంతాలను ఉపయోగించి.. వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏ సంవత్సరంలో ఎంత మొత్తంలో అమ్మకాలు జరిగా యి. ఆ సమయంలో డిమాండ్ -సప్లయ్ ఏ విధంగా ఉంది. ప్రస్తుతం అంత డిమాండ్ ఎందుకు లేదు. ఆయా వస్తువులపై వినియోగదారుల అభిప్రాయం ఏంటి? కొనుగోలు శక్తిలో వచ్చిన మార్పులు ఏంటి?!వంటివి అంచనావేసి చెబుతారు. గతంలో ఉన్న డిమాండ్‌ను ప్రస్తుత డిమాండ్‌తో పోల్చి విశ్లేషించి..రానున్న కాలంలో ఎంత డిమాండ్ ఉండవచ్చు..ఆ సమయానికి వినియోగ దారులకు అందుబాటులో ఉంచాల్సిన ప్రొడక్ట్స్ సంఖ్యతో సహా కచ్చితమైన లెక్కలతో వివరిస్తారు డేటా నిపుణులు.
  • కోర్సు స్వరూపం: డేటాసైన్స్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు.. డేటావిజువలైజర్స్, డేటాసైన్స్ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజనీరింగ్ సహా వివిధ రకాల ఉద్యోగాలు పొందవచ్చు.
  • వేతనాలు: డేటాసైన్స్ విభాగంలో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి వార్షిక వేతనం దాదాపు రూ.5లక్షల వరకు ఉంటుంది. నైపుణ్యాలు,అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశం ఉంటుంది.
ఇంకా చదవండి: part 2: ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సు బ్లాక్ చైన్ టెక్నాలజీ.. విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి..
Published date : 17 Nov 2020 04:34PM

Photo Stories