ఇంజనీరింగ్‌లో ఇన్ని సీట్లు.. 375 కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి
రాష్ట్రంలో 375 Engineering, Pharmacy కాలేజీల్లోని 1,50,837 సీట్లు కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లకు All India Council of Technical Education (AICTE) అనుమతి ఇచ్చింది. ఈ కాలేజీలను తనిఖీలు చేసి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నాయో, లేదో పరిశీలించాక ఆయా యూనివర్సిటీలు వాటికి అఫ్లియేషన్ ఇవ్వనున్నాయి. ఏపీ ఈఏపీసెట్–2022 తొలి విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆగస్టు 22 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 30 వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు గడువు ఉంది. 31 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగనుంది. 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, సెప్టెంబర్ 3న ఆప్షన్లలో మార్పులకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 6న సీట్లు కేటాయించనున్నారు. ఈ ఏడాది మొత్తం 1,94,752 మంది విద్యార్థులు ఏపీఈఏపీ సెట్‌కు హాజరుకాగా 1,73,572 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరు https://sche.ap.gov.in/APSCHEHome.aspx ద్వారా కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చు. ఆగస్టు 28 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఆలోగా యూనివర్సిటీల అఫ్లియేషన్‌ను పూర్తి చేసేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
చదవండి: Top Engineering Colleges 2022 - Andhra Pradesh | Telangana
17 వర్సిటీ కాలేజీల్లో 5 వేల ఇంజనీరింగ్ సీట్లు..
కాగా, 2022–23 విద్యా సంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన ప్రకారం.. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 261 కాలేజీల్లో 1,42,877 సీట్లు ఉన్నాయి. వీటిలో 17 యూనివర్సిటీ కాలేజీల్లో 5 వేల సీట్లు ఉండగా.. 244 ప్రైవేటు కాలేజీల్లో 1,37,877 సీట్లున్నాయి.
- ఫార్మసీలో 71 కాలేజీల్లో 6,670 సీట్లున్నాయి. వీటిలో ఆరు యూనివర్సిటీ కాలేజీల్లో 400 సీట్లు, 65 ప్రైవేటు కాలేజీల్లో 6,270 సీట్లు ఉన్నాయి.
- 43 ప్రైవేటు ఫార్మ్‌డీ కాలేజీల్లో 1,290 సీట్లు ఉన్నాయి.
చదవండి: AP & TS College Predictor 2022 (EAMCET | ICET | POLYCET)
ప్రైవేటు వర్సిటీల్లో ఈసారీ 35% కోటా
గతేడాది మాదిరిగానే 2022–23 విద్యా సంవత్సరంలో కూడా ప్రైవేటు వర్సిటీల్లో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో ఈఏపీసెట్‌లో మెరిట్ విద్యార్థులకు కేటాయించనున్నారు. ఈ 35 శాతం కోటా కింద గతేడాది వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ విట్)లో 1,509 సీట్లు, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో 527 సీట్లు, బెస్ట్ వర్సిటీలో 1,074 సీట్లు, సెంచూరియన్ వర్సిటీలో 504 సీట్లు, క్రియా వర్సిటీలో 146 సీట్లు, సవితా వర్సిటీలో 81 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఈఏపీసెట్‌లో ర్యాంకులు పొందిన దాదాపు 3 వేల మంది ఈ వర్సిటీల్లో చేరారు. వీరికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటుతో చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థల్లో ఏ భారమూ లేకుండా విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
చదవండి: Best Engineering Branch: బీటెక్... కాలేజ్, బ్రాంచ్ ఎంపిక ఎలా
బీ కేటగిరీ సీట్ల భర్తీపై వెలువడని తుది నిర్ణయం
ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లయిన బీ కేటగిరీ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి తర్జనభర్జనలు పడుతోంది. గతంలో ఈ సీట్లు మెరిట్ విద్యార్థులకు దక్కేలా గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో 48ని జారీ చేసింది. గతంలో బీ కేటగిరీ సీట్ల భర్తీని యాజమాన్యాలే చేపట్టేవి. అయితే ఈ జీవోతో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా కన్వీనర్ ద్వారా ప్రభుత్వమే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. కన్వీనర్ కోటా (ఏ కేటగిరీ) సీట్ల భర్తీతో పాటు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా బీ కేటగిరీ సీట్ల భర్తీ చేపట్టారు. అయితే ఏ కేటగిరీ సీట్ల భర్తీ ముందుగా అయిపోతున్నందున బీ కేటగిరీ సీట్లు భర్తీ కావడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. అందువల్ల తామే ఆ సీట్లను భర్తీ చేసుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాయి. ఈ తరుణంలో బీ కేటగిరీ సీట్ల భర్తీపై అనుసరించాల్సిన విధానం గురించి ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం నుంచి ఇంకా దీనిపై తుది నిర్ణయం రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు బీ కేటగిరీ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి ముందుకు వెళ్లనుంది.