ఐటీఐ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్, నాస్కామ్ నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: ఐటీఐ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంచేలా నైపుణ్యాలను పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికలను అమల్లోకి తెస్తోంది.
మైక్రోసాఫ్ట్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) సహకారంతో సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా కేంద్ర డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) అడుగులు వేస్తోంది. భారత్ స్కిల్స్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా 3 వేల ఐటీఐల్లో 1.20 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కల్పించిన డీజీటీ తాజాగా మైక్రోసాఫ్ట్, నాస్కామ్‌తో కలసి సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలను మెరుగుపర్చడంపై దృష్టి పెట్టింది. దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకు మైక్రోసాఫ్ట్ లెర్న్ ప్లాట్‌ఫారం ద్వారా ఉచిత శిక్షణ, కంటెంట్‌లను అందుబాటులో ఉంచింది. నాస్కామ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ‘కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్’ (సీఓఏపీ) కోర్సు నిర్వహిస్తోంది. విద్యార్థులతో పాటు బోధన సిబ్బందికి కూడా శిక్షణ కార్యక్రమాలను రూపొందించింది. 15 వేల ఐటీఐలతో పాటు 33 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ద్వారా విద్యార్థులకు మేలు జరగనుంది.