NEET UG 2024:‘నీట్‌ యూజీ-2024’కు రీ ఎగ్జామ్‌ లేదు: సుప్రీంకోర్టు

NEET UG 2024:‘నీట్‌ యూజీ-2024’కు రీ ఎగ్జామ్‌ లేదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపు చ్చింది. వివాదాస్పదంగా మారిన ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజ్‌, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై విచారణ ముగియడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. పూర్తిస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిందని నిర్ధారణకు వచ్చేందుకు ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని కోర్టు పేర్కొంది. హజారిబాగ్‌, పట్నాల్లో ప్రశ్న పత్రం లీక్‌ మాట వాస్తవమేనని న్యాయస్థానం తెలిపింది. ఈ పరీక్ష రాసిన 20లక్షల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిపెట్టుకోవాల్సిన అవసరముందని పేర్కొంది. మళ్లీ పరీక్ష నిర్వహిస్తే వీరంతా ఇబ్బంది పడతారని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి:  AP EAPCET -2024 Final Phase Counselling Schedule

ఆ ప్రశ్నకు ఒకటే సమాధానం:

సుప్రీంకోర్టు ఆదేశం మేరకు నీట్‌యూజీలో ఒక ప్రశ్నకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ల బృందం మంగళవారం నివేదిక సమర్పించింది. ఆ ప్రశ్నకు రెండు సమాధానాలు లేవని, ఒకటే సమాధానం ఉందని పేర్కొన్నారు. ఫిజిక్స్‌కు సంబంధించి పరీక్షలో అడిగిన ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలుగా పేర్కొన్నారని, కానీ మార్కులకు మాత్రం ఒకటే సమాధానానికి ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టులో వాదించారు. దీంతో న్యాయస్థానం ఈ విషయంపై ముగ్గురు సభ్యులతో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే.

అందుకే అనుమానాలు:

దేశంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5వ తేదీన దేశవ్యాప్తంగా 571 పట్టణాల్లోని 4750 పరీక్ష కేంద్రాల్లో నీట్‌ యూజీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 23 లక్షల మందికిపైగా హాజరయ్యారు. జూన్‌ 4న ఫలితాలు వెల్లడించగా.. ఏకంగా 67 మంది విద్యార్థులకు టాప్‌ ర్యాంకు వచ్చింది.

#Tags