సర్కారు బడుల్లోని 8, 9 తరగతుల విద్యార్థులకు 30న స్లెస్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9 తరగతుల విద్యార్థుల విద్యా సామర్థ్యాలను తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ జనవరి 30న స్లెస్ (స్టేట్ లెవల్ అచీవ్‌మెంట్ సర్వే) నిర్వహిస్తోంది.
వంద మార్కుల ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించనుంది. 30న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్ష ఓఎంఆర్ పత్రం ఆధారంగా నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,449 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియం కేటగిరీల్లో 4.84 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఇందులో 8వ తరగతికి సంబంధించి 2.41 లక్షలు, 9వ తరగతికి సంబంధించి 2.43 లక్షల మంది విద్యార్థులున్నారు. తదుపరి తరగతిలో ఆ విద్యార్థి స్థాయిని సైతం అంచనా వేసేందుకు ప్రస్తుత సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకుగాను విద్యార్థుల సామర్థ్యాలను విద్యాశాఖ రికార్డు చేయనుంది. ప్రస్తుతం 8, 9 తరగతుల విద్యార్థులే స్లెస్‌లో పాల్గొంటుండగా.. వచ్చే ఏడాది నుంచి 7వ తరగతి విద్యార్థులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు.