సెప్టెంబర్ 15 నుంచి డిగ్రీ పరీక్షలు:ఉస్మానియా యూనివర్సిటీ

సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల వార్షిక పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీలు సన్నా హాలు ప్రారంభించాయి.
ఈ మేరకు టైంటేబుల్స్ రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నారు. మొత్తం 1,170 డిగ్రీ కాలేజీల్లో 430 కళాశాలలు ఓయూ పరిధిలో ఉన్నాయి. వీలైతే ఈ నెల 15 నుంచే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ఓయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. టైంటేబుల్స్‌ను మూడు, నాలుగు రోజుల్లో జారీ చేస్తామని వెల్లడించారు. ఒకవేళ పరీక్షలు 15 నుంచి సాధ్యం కాకపోతే 20 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. 10వ తేదీలోగా టైంటేబుల్స్ రూపొందించి జారీ చేస్తామని వెల్లడించారు. అలాగే మిగతా వర్సిటీల్లోనూ 15 నుంచి డిగ్రీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇక పీజీ పరీక్షలు మాత్రం అక్టోబర్‌లోనే నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో వీలైతే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని యోచిస్తోంది.