ప్రీప్రైమరీ, ప్రైమరీ స్కూళ్లలో విద్యార్ధుల వయసు ఒకటే.. తరగతులే వేరు: అసర్ సర్వే

సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లు నిండిన వారినే ఒకటో తరగతిలో చేర్పించాలి.. ఇదీ విద్యా హక్కు చట్టం చెబుతున్న నిబంధన.
అందుకు భిన్నంగా ఉంది రాష్ట్రంలో పిల్లల పరిస్థితి. ఐదేళ్లు నిండని పిల్లలు కొంత మంది ప్రీప్రైమరీలో ఉంటే, మరికొంత మంది ఒకటో తరగతి చదువుతున్నారు. ఇక ఆరేళ్లు వచ్చినా కొంతమంది ఇంకా ప్రీప్రైమరీ స్కూళ్లోనే/అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఉండగా, కొంతమంది ఒకటో తరగతిలో ఉన్నారు. ఆయా విద్యార్థుల వయసు ఒక్కటే ఐనా, చదివే తరగతులు మాత్రం వేర్వేరు. తల్లిదండ్రుల ఆకాంక్షలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఈ అంతరాలకు కారణం. పిల్లలను త్వరగా చదివించాలన్న తపనతో కొంతమంది తల్లిదండ్రులు రెండేళ్లకే పిల్లలను ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపిస్తుంటే.. వారు ఐదేళ్లు నిండకుండానే ఒకటో తరగతికి వచ్చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు తమ పిల్లలను ప్రైవేటు ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపించకుండా ఆరేళ్లు వచ్చినా అంగన్‌వాడీ కేంద్రాలకే పంపు తుండగా, మరికొంతమంది తల్లిదండ్రులు మాత్రం ఐదేళ్లు నిండాకే తమ పిల్లలను ఒకటో తరగతిలో చేర్చుతున్నారు. రాష్ట్రంలో ప్రీప్రైమరీ, ప్రైమరీ స్కూళ్లలో ప్రవేశాల తీరుపై ‘ప్రథమ్’సంస్థ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్) పేరుతో సర్వే చేసింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.

24 రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో సర్వే..
దేశంలోని 24 రాష్ట్రాలకు చెందిన 26 జిల్లాల్లోని 1,514 గ్రామాల్లో అసర్ ప్రతి నిధులు ఈ సర్వేను నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని 30,425 ఇళ్లు తిరిగి 4 నుంచి 8 ఏళ్ల వయసున్న 36,930 మంది పిల్లలతో మాట్లాడి వివరాలను సేకరించారు. అందులో రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని 60 గ్రామాలకు చెందిన 1,201 ఇళ్లను తిరిగి 1,426 మంది విద్యార్థులను కలిసి, 4 నుంచి 8 ఏళ్ల వయసు పిల్లల స్థితిగతులపై నివేదికను రూపొందించారు.

ఇటీవల ఢిల్లీలో విడుదల చేసిన ఆ నివేదికలోని కొన్ని ప్రధాన అంశాలు..
  • రాష్ట్రంలో ఐదేళ్ల వయసున్న విద్యార్థుల్లో 21.6 శాతం మంది ఒకటో తరగతి చదువుతుండగా, మిగతా వారు అంగన్‌వాడీ/ప్రీప్రైమరీ తరగతులు చదువుతున్నారు.
  • ఇక ఆరేళ్ల వయసు వారిలో 32.8 శాతం మంది అంగన్‌వాడీ కేంద్రాలు/ప్రీప్రైమరీ స్కూళ్లలో ఉన్నారు. ఇక 46.4 శాతం మంది ఒకటో తరగతి చదువుతుండగా, 18.7 శాతం మంది రెండో తరగతి, మిగతా వారు ఆపై తరగతుల్లో ఉన్నారు.
  • 4 నుంచి 8 ఏళ్ల వయసు వారిలో బాలికలు ఎక్కువ మంది ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరగా, బాలురు ఎక్కువ మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నారు.
  • నాలుగైదేళ్ల వయసు పిల్లల్లో 56.8 శాతం మంది బాలికలు ప్రభుత్వ ప్రీప్రైమరీ స్కూల్స్/అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండగా, బాలురు మాత్రం 50.4 శాతం మందే ప్రభుత్వ సంస్థల్లో ఉన్నారు.
  • అదే వయసు పిల్లలు ప్రైవేటు ప్రీప్రైమరీ స్కూళ్లలో 43.2 శాతం బాలికలుండగా, బాలురు 49.6 శాతం ఉన్నారు.
  • 6 నుంచి 8 ఏళ్ల వయసు పిల్లల్లో 61.1 శాతం బాలికలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తుండగా, బాలురు 52.1 శాతం మందే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నట్లు తేలింది.

10 మందిలో ప్రతి నలుగురు తక్కువ వయసు వారే..
విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో చేరాలంటే ఐదేళ్లు నిండి ఉండాలి. కానీ రాష్ట్రంలో ఒకటో తరగతిలో చేరిన ప్రతి 10 మందిలో సగటున నలుగురు ఐదేళ్లు నిండని వారే ఉన్నట్లు సర్వేల్లో వెల్లడించింది. నిబంధనల ప్రకారం ఆరేళ్లకు వచ్చి ఒకటో తరగతిలో చేరిన వారు 41.7 శాతమే ఉన్నట్లుగా తేలింది. అలాగే ఒకటో తరగతిలో చేరిన వారిలో ఏడెనిమిదేళ్ల వయసు వారు 36.4 శాతం ఉండగా, నాలుగైదేళ్ల వయసు వారు 21.9 శాతం ఉన్నట్లుగా వెల్లడైంది.