ప్రభుత్వ పాఠశాలలో ‘రాజ్‌భవన్ అన్నం’ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నిత్యం ఉచితంగా అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘రాజ్‌భవన్ అన్నం’ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.
సోమవారం రాజ్‌భవన్ కమ్యూనిటీహాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ స్వయంగా విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారం చాలా అవసరమని అన్నారు. పేదరికంతో లేదా ఇతర కారణాలతో విద్యార్థులు ఆకలితోనే తరగతులకు వస్తున్నారని, అలాంటి పరిస్థితులను చిన్నారులకు దూరం చేయాలనే ఉద్దేశంతోనే శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ సహకారంతో రాజ్‌భవన్ అన్నం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులతో పాటు రాజ్‌భవన్ లో పనిచేసే కార్మికులకు, జీహెచ్‌ఎంసీ వర్కర్లకి కూడా ఈ ఆహారాన్ని అందిస్తున్నామని గవర్నర్ వెల్లడించారు. అనంతరం సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వర్‌రావు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన శారీరక, మానసిక శక్తికి రాజ్‌భవన్ అన్నం కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో చదివే 1,250 మంది విద్యార్థులకు అల్పాహార సేవలు అందనున్నట్లు చెప్పారు.