పంచాయతీలు, సచివాలయ ఉద్యోగుల బాధ్యతల్లో పలు మార్పులు
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత సమర్థంగా అందించడంతో పాటు గ్రామ పంచాయతీలు, సచివాలయాల మధ్య సమన్వయం పెంచేందుకు ఉద్యోగుల బాధ్యతల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది.
పంచాయతీ కార్యదర్శి ఇకపై ఆ గ్రామ పంచాయతీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. పంచాయతీ, గ్రామ సచివాలయాల మధ్య సంధానకర్తగా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యవహరిస్తారు. పంచాయతీ కార్యదర్శులు (1&V).. ఆయా పంచాయతీల్లో ఉండే సిబ్బందితో పాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లింపుల అధికారి (డీడీవో)గా విధులు నిర్వర్తిస్తారు. డిజిటల్ అసిస్టెంట్‌తో పాటు గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులకు, వలంటీర్లకు డీడీవోగా గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) వ్యవహరిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, పంపిణీ పనుల బాధ్యతలను వీఆర్వోలు పర్యవేక్షిస్తుంటారు.ఉద్యోగుల సెలవులను వీఆర్వో ద్వారా పంపించి.. మండల స్థాయి నుంచి అనుమతి తీసుకోవాలి. కార్యదర్శులకు (1&V) మాత్రం సర్పంచే సాధారణ లీవ్‌లు జారీ చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.