పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.440 కోట్లతో ప్రత్యేక నిధి..

సాక్షి, అమరావతి: దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.440 కోట్లతో ప్రత్యేక నిధిని సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేయించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై విజయవాడలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేలా పాఠశాలల్లో విద్యార్థినులకు, మహిళా టీచర్లకు టాయిలెట్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వదిలేస్తే సరిపోదని, వాటి నిర్వహణ కూడా ముఖ్యమని చెప్పారు.

విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలల్లోనే గడుపుతారని.. వారి కోసం ఇంతలా ఆలోచించిన ప్రభుత్వాలు గతంలో లేవన్నారు. బుక్స్, బ్యాగ్స్, షూస్, డ్రస్, గ్రీన్‌ బోర్డు, కాంపౌండ్‌ వాల్స్, లైట్లు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, మంచినీరు, మధ్యాహ్న భోజనం.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని సీఎం స్వయంగా పరిశీలించడం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదన్నారు. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1,000 టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి ఆయాకు నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం అందిస్తామని మంత్రి ఆదిమూలపు చెప్పారు.