కొత్త పాలసీలో ‘వర్క్ ఫ్రం హోమ్’: మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా నూతన ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీని రూపొందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా, మిన్నగా ఈ పాలసీ ఉండాలని, కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారించాలని సూచించారు. బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కోసం ఐటీ శాఖ రూపొందించిన వెబ్ పోర్టల్‌కు స్పందన బాగుందన్నారు. పోర్టల్ ప్రారంభించిన 4 రోజుల్లోనే 2,500 మంది నుంచి డిమాండ్ రావడం మంచి పరిణామమన్నారు.

  • విశాఖ కేంద్రంగా ఐటీకి బంగారు భవిష్యత్ ఉందని, పలు సంస్థలకు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. ఇందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంపై దృష్టిసారించాలన్నారు.
  • ఈ సమీక్షలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుందర్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐటీ జాయింట్ సెక్రటరీ నాగరాజ, ఐటీ శాఖ సలహాదారులు లోకేశ్వర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం

  • కేంద్రం ప్రకటించిన మూడు బల్క్ డ్రగ్ పార్కుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సుమారు 2,000 ఎకరాల్లో ఏర్పాటు చేయదల్చిన బల్క్ డ్రగ్ పార్క్‌కు నాలెడ్‌‌జ పార్టనర్‌గా ప్రముఖ రసాయనాల పరిశోధనా సంస్థ సీఎస్‌ఐఆర్-ఐఐసీటీతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి మేకపాటి సమక్షంలో ఏపీఐఐసీ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో అమూల్యమైన ఔషధాల తయారీకి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారనుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
  • ఈ పార్కు ఏర్పాటుపై ఒప్పంద సంస్థతో కలిసి సాంకేతిక సహకారం అందించడంతో పాటు, కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందేలా ప్రతిపాదనలను సిద్ధం చేశామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ అన్నారు.